జూబ్లీహిల్స్‌.. పేరుకే సంపన్నుల ఏరియా

– ఇక్కడి బస్తీలలో బాధలు మాత్రం వర్ణనాతీతం
– బీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదు.. కాంగ్రెస్సూ తీర్చడంలేదు
– ఉప ఎన్నిక ప్రచారంలో ఎంపీ ఈటల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: జూబ్లీహిల్స్‌ పేరుకే సంపన్నుల ఏరియా.. పారే మురికి కాలువల కంపు వాసన, గతుకుల రోడ్లు.. ఏ పేదవాడిని కదిలించినా తమను పట్టించుకునే వాడు లేడని బాధపడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. ఇక్కడి బస్తీలలో బాధలు మాత్రం వర్ణనాతీతమన్నారు. భర్త చనిపోయి ఐదేళ్లయినా పెన్షన్‌ రావడం లేదని కొంతమంది, 65 ఏళ్ళు దాటినా రావడం లేదని మరికొందరు చెప్తున్నారు. పార్టీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి తరపున ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఆనాడు బీఆర్‌ఎస్‌ పార్టీ ఇస్తాం అంటూ మోసం చేసింది.. ఇవన్నీ ఇస్తారని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఇప్పుడు ఆ పార్టీ కూడా అదే మోసం చేస్తోంది అని విమర్శించారు. తాగే నీళ్లు కూడా సక్కగా రావడం లేదని వీరంతా చెప్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టినం.. కాంగ్రెస్‌కుి కూడా అదే గతి అని ప్రజలు స్పష్టం చేస్తున్నారన్నారు. 40 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని, మంత్రుల మధ్య సమన్వయం లేదని, మంత్రులకు డబ్బులు సంపాదించుకోవడానికి, దోచుకోవడానికే సమయం సరిపోతోంది తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యల మీద అసెంబ్లీ వేదికగా కొట్లాడుతున్న పార్టీ బీజేపీ ఒక్కటేనన్నారు. జూబ్లీహిల్స్‌లో ఆ రెండు పార్టీలను బొందపెడితేనే చలనం వస్తుందన్నారు. పెన్షన్లు రావాలన్నా, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు రావాలన్నా, మురికి కాలువలు కట్టాలన్నా, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా వారి మెడలు వంచి బీజేపీ కొట్లాడుతుందంటూ బీజేపీ అభ్యర్థి దీపక్‌ రెడ్డికి ఓటు వేయాలని ఈటల విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందని, ఇది కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గారి పార్లమెంట్‌ పరిధిలోకి వస్తుంది. అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page