*జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం
*బీఆర్ ఎస్ వైపే వోటర్లు అంటున్న సర్వేలు ?
*కనిపించని బిజెపి జెండాలు
( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
రాష్ట్రంలోని రాజకీయపార్టీలన్నిటి లక్ష్యం ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలుపుపైనే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఉపఎన్నిక లిట్మస్ టెస్ట్‌లాంటిదని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు ఎట్టిపరిస్థితిలో ఈ నియోజకవర్గాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికలను అమలు పరుస్తున్నాయి. అయితే ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకపోయినా కొన్ని సర్వే సంస్థలు అప్పుడే తమ సర్వే నివేదికలను ఆవిష్కరించాయి. ఈ సర్వేల ప్రకారం ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు బిఆర్‌ఎస్ వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌ను రెండవ స్థానంలో, బిజెపిని మూడవ స్థానానికి ఈ నివేదికలు పరిమితం చేస్తున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలై, అయాపార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించేనాటికి పరిస్థితులు ఎలా మారుతాయన్నది ఊహాతీతం. ప్రధానంగా ఈ ఉపఎన్నిక అధికార కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం కానుంది. ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల్లో జిహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేపోయింది. కాకపోతే కంటోన్మెంట్‌కు జరిగిన ఉపఎన్నిక ఆ పార్టీకి కలిసొచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా జిహెచ్‌ఎంసీ పరిధిలోనిదే కావడంతో ఈ నియోజకవర్గాన్ని గెలుచుకోవడంద్వారా రాష్ట్రరాజధాని ప్రజలు కాంగ్రెస్ పాలనకు జై కొడుతున్నారన్న సంకేతం వెళ్తుందన్నది కాంగ్రెస్ అశ. అది రానున్న జీహెచ్‌ఎంసీతోపాటు స్థానిక ఎన్నికలపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నది. కాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్‌పార్టీ ఇప్పటికే సీక్రెట్ సర్వే చేయించిందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఒకటి రెండు కాదు కాంగ్రెస్ ఇప్పటికే మూడు సర్వేలు చేయించిందన్నది ప్రచారంలో ఉంది. ఇందులో పార్టీ పరిశీలకురాలైన మీనాక్షి నటరాజన్ ఆద్వర్యంలోకూడా ఒక సర్వే జరిగినట్లు తెలుస్తున్నది. ఆ సర్వే నివేదిక బహిర్గతం కాకపోయినప్పటికీ బిఆర్‌ఎస్‌కే ఎక్కువ అవకాశాలున్నట్లుగా వార్త ప్రచారంలోఉంది. అలాగే మూడ్ ఫర్ ది పబ్లిక్ అండ్ ది పీపుల్ అన్న అంశంపైన ఆర్ ఆర్ పొలిటికల్ సంస్థ చేసిన సర్వేకూడా బిఆర్‌ఎస్‌కే అవకాశాలున్నట్లు తేల్చింది. వివిధ అంశాలపై ఈ సంస్థ చేసిన సర్వే కాస్తా ఆసక్తిని కలిగిస్తున్నది. ముఖ్యమంత్రులుగా రేవంత్‌రెడ్డి, కెసిఆర్‌లో ఎవరిని ఇష్టపడతారన్న అంశంలో రేవంత్‌రెడ్డి వైపు 28.40 శాతం మంది, కెసిఆర్ వైపు 55.68 శాతం మంది మొగ్గుచూపినట్లు ఆర్‌ఆర్ సర్వే ప్రకటించింది. అలాగే అభ్యర్ధులెవరన్నది ఇంకా పార్టీలు ప్రకటించకపోయినా, బిఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీలో ఉంటే 46.60 శాతం వోటర్లు ఆమెకు మద్దతు తెలిపే అవకాశమున్నట్లు ఆ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్, ఫిరోజ్‌ఖాన్‌లు ఉంటే పోటీ తీవ్రతరమవుతుందని, నవీన్‌నాయక్ అయితే 15.90 శాతానికే కాంగ్రెస్ పరిమితం అవుతుందని ఆ నివేదిక వెల్లడించింది. ఎంఐఎం సంపూర్ణంగా మద్దతిస్తే కాంగ్రెస్, బిఆర్‌ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీసాగే అవకాశముందని సర్వే చెబుతోంది. అలాగే మానిఫెస్టో హామీలను అమలుపర్చడంలో ప్రజల మద్దతు బిఆర్‌ఎస్‌కె ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో బిఆర్‌ఎస్‌ను 65.90 శాతం మంది అవునంటే, కాంగ్రెస్‌ను 17.04 శాతం మంది లైక్‌చేసినట్లు తెలుస్తున్నది. కట్ట సర్వేలోకూడా బిఆర్‌ఎస్‌కే నియోజకవర్గ ప్రజల మొగ్గున్నట్లు తెలుస్తున్నది. అయితే గతంలోకన్నా కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉండడంతో పోటీ తీవ్రతరంగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నది. వోటర్ పల్స్ సర్వే కూడా బిఆర్‌ఎస్ 40 శాతం, బిజెపి 26 శాతంతో రెండవ స్థానంలో ఉంటుందని, కాంగ్రెస్ 20 శాతంతో మూడవ స్థానంలో ఉంటుందని తెలిపింది. కాగా ఎంఐఎం స్వతంత్రంగా పోటీచేస్తే 11 శాతంతో నాల్గవ స్థానంలో ఉంటుందని, కాంగ్రెస్‌కు మద్దతిచ్చే పక్షంలో ఈ రెండు పార్టీలకు కలిపి 31 శాతం వోట్లు వచ్చే అవకాశముందని ఆ సర్వే పేర్కొంది. కోడ్‌మో కనెక్టిక్ డెమక్రసీ తన సర్వేలో 42.8 శాతం వోటర్లు బిఆర్‌ఎస్‌కు అనుకూలమని, కాంగ్రెస్‌కు 32.7శాతం, బిజెపికి 19.5శాతం మద్దతుఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. ఇదిలా ఉంటే దాదాపు ఎనిమిది నుండి పదిహేను శాతం మంది తటస్థులు ఎటువైపు మొగ్గుతారన్నది చెప్పలేమని, వారి వోట్లను బట్టి గెలుపు ఓటములుంటాయని సర్వేలు అభిప్రాయపడుతున్నాయి. సర్వేల విషయం ఎలాఉన్నా రాజకీయ పార్టీలు మాత్రం నియోజకవర్గంలో ఇప్పటికే తమ కార్యాచరణను ప్రారంభించాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఇక్కడ గెలవటం ప్రతిష్టకాగా, తమ సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బిఆర్‌ఎస్ తీవ్ర కసరత్తు చేస్తున్నది. కాగా రానున్న గ్రేటర్ ఎన్నికలకు ఇక్కడి గెలుపు అనుకూలంగా మారుతుందన్నది బిజెపి ఆలోచనగా ఉంది.
ఫోటో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన కరెంట్ స్తంభానికి కొబ్బరికాయ కొట్టిన మంత్రి వివేక్ వెంకటస్వామి.




