– యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి మహోన్నత విలువలను సమాజానికి అందించిన గొప్ప సంస్కర్త బసవేశ్వరుడు అని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఆయన బోధించిన కాయకమే కైలాసం అనే సూత్రం ప్రతి మనిషి తన శ్రమ ద్వారానే ఎదగాలనే గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. మహాత్మా బసవేశ్వరుని 893వ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించి మాట్లాడుతూ బసవేశ్వర కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా సమాజాన్ని ఒకటిగా చూడాలని పిలుపునిచ్చారు. స్త్రీ-పురుష సమానత్వానికి ప్రాధాన్యతనిస్తూ సమాజంలో సమాన అవకాశాల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఆయన వచనాలు నేటికీ ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ, సమాజ మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో ఇంకా కొన్ని అసమానతలు, వివక్షలు కొనసాగుతున్న ఈ సమయంలో బసవేశ్వర ఆశయాలు మరింత ప్రాసంగికంగా మారాయన్నారు. సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి విలువలను ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వర ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. బసవేశ్వర బోధనలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వాటిని మన జీవితాల్లో ఆచరణలో పెట్టాలని మంత్రి శ్రీహరి సూచించారు. సమాజంలో మంచి మార్పునకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలంటూ బసవేశ్వర జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను మనస్ఫూర్తిగా ఆచరిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, సీపీ సజ్జన్నార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





