జనధర్మో విజయతే
ఆచార్యగారు ఎందుకీ పత్రిక ప్రారంభించారు? ఈ ప్రశ్నకు జవాబు స్వవిషయం అనే సంపాదకీయంలో దొరుకుతుంది. ‘‘ఇది ‘జనధర్మ’ ప్రారంభ సంచిక. మీ సహాయ ప్రోత్సాహాలతో అవతరించుచున్న పత్రిక. మీ ప్రేమాదరాలతో ఎదిగి చిరంజీవి కావలసిన మీ పుత్రిక. మీ ముందు ప్రారంభ సంచిక నుంచుతూ ఇంకా చెప్పగలిగింది చాలా తక్కువ. కత్తిపై సాము పత్రికారంగంలో అనన్యానుభవం గల నిర్వాహకులు, సంపాదకులూ మా ఈ ప్రయత్నాన్ని ఒక సాహస కార్యంగా వర్ణించారు. నేటి పరిస్థితులలో ఇదొక తలకు మించిన బాధ్యత అన్నారు. పత్రికా నిర్వహణ వాస్తవానికి కత్తిపై సామువంటిదే. బాగాడబ్బున్నవాళ్లు నడచే పత్రికలతో సమఉజ్జీగా నిల్వగల్గటం, నిల్చినా వాని పోటీకు తట్టుకోగల్గుటం సులభసాధ్యమైనది కాదు.
ప్రతిజిల్లాకు 10 పత్రికలు అవసరం ఆచార్య అభిప్రాయంప్రకారం ప్రతి జిల్లాకు 10 పత్రికలు ఉండాలని. ఇది 1958 మాట. ఇప్పుడ 2025 పత్రికలు, డిజిటల్ పత్రికలలెక్క చేస్తే, వారి ఆశ నెరవేరినట్టే. అది బాగుందా లేదా అనేది వేరే విషయం. మొత్తానికి ఇన్నెన్ని పత్రికలు వస్తున్నాయి. ఖర్చుచేస్తున్నారు. చదువుతున్నారు. ఆదాయం కూడా వస్తున్నదని అనుకోవాలి. ఇన్ని సమస్యలన్నవని తెలిసి ఈ భరువు ఎత్తుకొనుట ఎందుకు? ఇప్పుడుకున్న పత్రికలు చాలనా? చాలవు అని మా అభిప్రాయం. ఇంకా పత్రికలు ప్రకటించబడాలి, జిల్లా ఒక్కంటికి కనీసము 10 పత్రికలైనా ఉండాలి. ‘జనధర్మ’ను తమ ‘‘వాణీప్రసార యంత్రం ‘‘ప్రజాస్వామ్య సుస్థిరతకు పత్రికలు ప్రధాన సాధనాలు. కొందరు పార్టీలుగా ఏర్పడి ఎన్నికల్లో అభ్యర్థుల నిలపడం, ఓట్లు వేయడం వంటి పనులు మాత్రమే ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజాస్వామ్యం ఒక స్వతంత్ర్య దేశ ప్రజల జీవన విధానం.
ఈ విధానంలో ‘‘అధికారపు పెనుగులాటతో నిమిత్తం లేని అపారమైన సమాజం’’. మన ‘‘జీవనానికి, విలువలకు, విశ్వాసాలకు, భద్రతనిచ్చే సాంఘిక వ్యవస్థ’’. నిర్మాణానికి పురోగమించాల్సి ఉంది. ప్రభుత్వం అందుకనులమైన వాతావరణం కల్పించవలసి ఉంటుంది. ఈ ప్రగతీ పధంలో ప్రజలు గాని, ప్రభుత్వాధికారము చేబట్టినగారుగాని వేయు తప్పటడుగుల వారించి, పురోగమించుటకు వలయు సూచనలందజేసే ఉన్నత సాంప్రదాయాన్నేర్పరచు విమర్శనాశీలురగు విజ్ఞ ప్రజకు, పత్రిక ఉత్తమ సాధనం. ఈ సాధనమును సద్వినియోగపరచుకొను ప్రజలున్న ఏ దేశంలో నైనా ప్రజాస్వామ్య వేళ్లుదన్ని, ఊడలు బారి, స్థిరమై విలసిస్తుంది. ఈ సుదృఢాభిప్రాయమే మమ్మీ పత్రికా ప్రకటనకు పురిగొల్పింది. జిజ్ఞాసువులూ, మేధావులూ, మా ఈ సాహస కృషిని మన్నించి ‘జనధర్మ’ను తమ ‘‘వాణీప్రసార యంత్రంగా’’ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి’’ అని ఆచార్య అన్నారు. 1958 కాలంలో స్వతంత్ర అనే పత్రిక ఉండేది. అక్కడనుంచి జనధర్మ స్ఫూర్తి గ్రహించారు. అక్కడి సంపాదకీయ వివరాలను ఉటంకించి వస్తూ
ఆచార్య ఈ విధంగా అన్నారు.
‘‘స్వతంత్ర’ పత్రిక ప్రారంభ సంచిక సంపాదకీయంలో పేర్కొన్నట్లు ‘‘జనధర్మ’’ కు కూడా ‘‘గుత్తా వ్యపారుల అండదండలు లేవు. ధనిక స్వాముల తోడ్పాటు అంతకంటే లేదు. వర్గరాజకీయ నామకమ్మన్యుల దన్ను బొత్తిగా లేదు. రాజకీయంగా ఏదొక పార్టీని, లేదా వర్గాన్నీ, నమ్ముకొని ‘త్వమేవ శరణం’ అనేసుకునివారి అడుగుజాడలలో నడచి కాలక్షేపం చేయగల శక్తి గానీ, ఆసక్తిగానీ అంతకన్నా లేవు.’’ స్వత్వాల్తోపాటు స్వధర్మాలు పాటించాలి. తన సంపాదకీయంలో ఆచార్య చాలా విషయాలు వివరించారు. అసలు ప్రజారాజ్యం అంటే ఏమిటి, స్వాతంత్ర్య ఏమిటో తెలుసా అని ఆయన వివరించారు. స్వాతంత్ర్యం అంటే పాలకుల వినియమమే అనుకోవడం పొరపాటు అంటూ…స్వాతంత్ర్యం అంటే సంవత్సరంలో ప్రత్యేకమైన ఒకటీ, రెండు రోజుల్లో ‘హరిజన వీధుల పారిశుధ్యం’ ‘ప్రభాతభేరీ’ లాంటి ప్రదర్శనలు జరిపి, జాతీయ పతాకాన్నెగరవేసి, జాతీయ గీతాన్నాలపించి, జాతీయ నాయకులకు జేజేలు కొట్టి, సభావేదికల్నుంచి ‘పిదరమ్ సుల్తాన్ బూచ్’ లాంటి గర్వోక్తుల్తో పూర్వ ప్రాభవాన్నీ, యేదో అపూర్వ వుద్యమ చరిత్రనీ పునశ్చరణం చేయడంతో సంతృప్తి జెందే జడభావనా కాదు.
మామూలు ప్రజలు, సామాన్యులైన ప్రజాప్రతినిదులు వారికి కనీసమైన సౌకర్యాలు వస్తే చాలు. కాని ఈ ఇంద్రభవనాలు అవసరం లేదు అని ఆచార్య అప్పుడే వ్యాఖ్యానించారు. మంచి మెత్తని ఆసనాల్లో నిద్రపోవడానికి కాదు. ఓట్లు చీట్లు కాదు. అంటూ ఘాటుగా అన్నమాటలు చూడాలి. స్వాతంత్ర్యం అంటే అయిదోళ్లకోనాడు దేశప్రజల్లోంచి లక్షకు ఒకక్షకీ, పది లక్షలకు ఒకళ్లకీ ఇంద్రభవనాల్లాంటి లోక సభా విధానసభా భవనాల్లో పైన విద్యుచ్ఛామరాలు వీస్కోంటే దిండ్లు సమర్చబడ్డ ఆసనాల్లో జనాన్ని మరచీ, తనువును మరచీ కునుకులుదీయగలిగే మహదవకాశం కల్పించడానిగ్గాను, మతతత్వాలూ, కులతత్వాల మత్తితో ఉచితానుచిత విచక్షణా జ్ఞానాన్ని
కోల్పోయిన జనాళితో ఆ క్షణం వరకూ వాళ్ల చెవుల్లో ప్రతిధ్వనిస్తోన్న ఎన్నికల గుర్తులు అతికించబడ్డ గోడ్రెజ్ పెట్టెల్లోంచి యేదో ఒక పెట్టెలో ‘వోట్ల చీట్లు’ పడవేయించే పండగ సంబరమూ కాదు.
జనధర్మ పత్రిక మొదటి పేజీ వివరాలు: ప్రారంభ సంచిక వివరాలు ఇవి. ‘అనవరత జాగరమే ప్రజాస్వామ్య సుస్థిరతకు ఆధారము’ అనేది జాతీయ తెలుగు వార పత్రిక జనధర్మ నినాదం. శ్రీ విళంబి కార్తీక పౌర్ణిమి ‘సంపాదకుడు: యం శంకర్ రావు, ఎసోసియేట్స్: యం. యస్ ఆచార్య ఎం ఎస్స్ సి ఎల్ ఎల్ బి. టి.వై. నరసింహాచార్య, సంపుటి 1. గురువారము 27-11-1958 సంచిక 1.
(పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం యండగండి ఇతని స్వగ్రామం. తిరుపతి వేంకటకవులలో ఒకరైన దివాకర్ల తిరుపతిశాస్త్రి ఇతనికి పినతండ్రి. దివాకర్ల వేంకటావధాని -జూన్ 23, 1911 – అక్టోబరు 21, 1986. వారి పుత్రుడు దివాకర్ల సీతారామశర్మ హైదరాబాద్ లో ఇంజినీరింగ్ ఉన్నతమైన అధికారిగా పనిచేసారు. వారితో ఇంటర్వ్యూ చేసే అవకాశం లభించింది.) ఎల్ల జగమ్ము ధర్మముపయిన్నిలుచున్ , జనపాళి ధర్మ సం పల్లవిత ప్రవృత్తియయి వర్తిలుచో ధర స్వర్గ లోకమై చెల్లెడి, తత్సమగ్ర ఫలసిద్ధికి తీరుచిన రాచబాటయై పెల్లిదమైన కీర్తిగొని వెల్గుదు మీ ‘జనధర్మ’ నిచ్చలున్….
