దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది.‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లు త్వరలోనే పార్లమెంట్‌లో ముందుకు రానుంది. దీనికి సంబంధించి రాజ్యాంగంలోని 129వ సవరణ బిల్లు సైతం ఆమోదిం చింది.కేంద్ర ప్రభు త్వం జమిలికే మొగ్గు చూపుతుండడంతో దీనికోసం ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకునేందుకు సన్నద్ధమ వుతోంది. పార్లమెంట్ నుండి పంచాయితీ ఎన్నికలు అన్నీ ఒకేసారి నిర్వహించేందుకు సమాయత్తం చేస్తోంది. మొత్తం రెండు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.తొలి దశలో పార్లమెంటు,అసెంబ్లీ ఎన్నికలు, అవిపూర్తైన వందరోజుల్లోపు స్థానిక సంస్థ లకు ఎన్నికలు జరుగుతాయి.దీనికోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను ఉపయోగించబోతున్నారు.జమిలి ఎన్నికలు అంటే వన్‌నేషన్, వన్ ఎలక్షన్. దేశానికి ఒక్కసారే ఎన్నికలు,మిగిలిన ఐదేళ్లు పరిపాలనపై దృష్టిపెట్టాలన్న దృక్పధంతో జమిలిని తెరపైకి తీసుకొచ్చారు.
గతంలో జమిలి ఎన్నికలకు సంబంధించి కోవింద్ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో ఇక రెండు ప్రక్రియలు మిగిలున్నాయి.ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలి.ఈ శీతాకాల సమా వేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయి ంచింది. బిల్లు అమల్లో రావాలంటే రాజ్యాం గంలోని ఆరు ఆర్టికల్స్ సవరణ చేయాల్సి ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లో రావాలంటే చేయాల్సిన రాజ్యాంగ సవరణలు చుసినట్లయితే లోక్‌సభ, రాజ్యసభ కాల పరిమితి చెందిన ఆర్టికల్ 83,రాష్ట్రాల అసెంబ్లీకు ఐదేళ్ల గడువుని నిర్దేశించే ఆర్టికల్ 172(1) సవరణ.ఎమర్జెన్సీ పరిస్థితులొస్తే సభ కాల పరిమితిని ఏడాది దాటకుంటా వీలు కల్పించే ఆర్టికల్ 83(2) సవరణ.లోక్‌సభను రద్దు చేసేలా రాష్ట్రపతికి అధికారాలిచ్చే ఆర్టికల్ 85(2) సవరణ.రాష్ట్రాల అసెంబ్లీ రద్దు అధికారాన్ని గవర్నర్‌కు ఇచ్చే ఆర్టికల్ 174(2) సవరణ.
రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356 సవరణ ఇలా కొన్ని ఉన్నాయి.ఎన్నికల కమీషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 324 సవరణ చేశారు.దేశంలో ఇప్పటి వరకూ అంటే స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1957, 1962, 1967లో ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత పరిస్థితులు మారి అడపా దడపా జరుగుతున్నాయి. జమిలి ఎన్నికల ప్రతిపాదన తొలిసారిగా 1980లో వచ్చింది. ఆ తరువాత 1999లో లా కమీషన్ కూడా జమిలి ఎన్నికలకు ఓకే చెప్పింది. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడంతో పాటు ఆరు ఆర్టికల్స్ సవరించాల్సి ఉంది. ఆ తరువాత సగం రాష్ట్రాలు ఓకే చెప్పాల్సి ఉంది. అన్నీ అనుకూలిస్తే 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించాలనేది కేంద్రం ఆలోచనగా ఉంది.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం.
గతంలో జరిగిన, ఆ తర్వాత వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు.1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని,1967 వరకు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం,గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయడం, తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి.దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి.జమిలి ఎన్నికలు జరుగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్ కమిటీ తాజా నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83 (2), ఆర్టికల్ 172(1), ఆర్టికల్ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
డా. మోటె చిరంజీవి
సామాజిక విశ్లేషకులు
9949194327