దిల్లీ లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా గానం ..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారనున్నాయి. దేశ రాజధాని దిల్లీ  రాష్ట్రంలో ఆధిపత్యం కోసం రాజకీయ పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆ పార్టీల హడావుడి ఎక్కువ అయింది. అన్నిపార్టీలు ఎంతో ప్రిస్టేజీగా తీసుకుంటున్న ఈ ఎన్నికల ప్రక్రియకూడా ప్రారంభం కావడంతో విమర్శలు ప్రతి విమర్శలతో దిల్లీ  హోరెత్తిపోతున్నది. ఫిబ్రవరి 5న జరిగే ఇక్కడి ఎన్నికలకు గాను నామినేషన్‌ల ఘట్టం ఈనెల 17తో ముగిసింది. శనివారం ఉపసంహరణ తతంగం పూర్తికాగానే ఎవరు ఎవరితో ఏమేరకు తలపడనుందన్నది తేలిపోనుంది. ఇక్కడ ముక్కోణపు పోటీ కనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా బిజెపి, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్యనే పోటీ తీవ్రతరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్‌ ఇక్కడ ఒక్క స్థానాన్నికూడా సాధించుకోలేకపోయింది. అయినప్పటికీ ఈసారి దిల్లీ  రాష్ట్ర పీఠాన్ని అధిరోహిస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇటీవలకాలంలో ఆప్‌ నాయకులపై వొచ్చిన ఆరోపణలు, స్థానిక ప్రజలకు మోదీ పాలనపైన ఉన్న విరక్తి తమకు కలిసి వొస్తుందని ఆ పార్టీ ఆశిస్తున్నది. ఎప్పుడో పదిహేను ఏండ్ల కింద తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రగతే తప్ప దిల్లీ  వాసులకు ఇంతకాలంగా ఒరిగింది ఏమీలేదంటోంది కాంగ్రెస్‌. గడచిని మూడు విడుతలుగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ చేసిన అభివృద్ది మాత్రం శూన్యం, ఆలాగే దేశ ప్రధానిగా బిజెపికి చెందిన నరేంద్ర మోది మూడోసారి కూడా అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ఇక్కడి ప్రజలను పట్టించుకున్నదిలేదని కాంగ్రెస్‌ ఘాటుగానే విమర్శిస్తున్నది.

ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే సంస్కృతి, సంప్రదాయం కేవలం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందనడానికి గత సంవత్సరం తమ పార్టీ అధికారంలోకి వొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరణగా చూపిస్తున్నది. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన అయిదు గ్యారంటీలను పదమూడు నెలల కాలంలో ఇక్కడ అమలు చేస్తున్న తీరును సోదాహరణగా వినిపించడం ద్వారా దిల్లీ  వోటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని అక్కడ ప్రచారానికి ఆహ్వానించింది. తెలంగాణలో ఎన్నికలకు ముందు ప్రజలకు తమ ప్రభుత్వం ఇచ్చిన అయిదు గ్యారంటీల్లో అత్యంత ప్రధానమైనది రైతులకు రెండు లక్షల రుణమాఫీ. అదే విషయాన్ని చెప్పి సిఎం రేవంత్‌రెడ్డి దిల్లీ  వోటర్లను ఆకట్టుకునే ప్రయత్నంచేశారు. అలాగే 55వేల ఉద్యోగాల కల్పన, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం తో పాటు ఈ నెల 26న ప్రారంభించనున్న మరికొన్ని పథకాలను వివరించారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పారదోలినట్లు, దిల్లీలో ఆప్‌ను శంకరగిరి మాణ్యాలను పట్టిస్తే దిల్లీ లో ప్రగతి కనిపిస్తుందంటోంది కాంగ్రెస్‌. తమ పార్టీ అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే దిల్లీ  ప్రజలకిచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తామంటోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసిన హామీల్లో నిరుద్యోగ యువతకు ప్రతీనెల 8వేల 500 రూపాయల స్టైఫండ్‌  కల్పిస్తామన్న హామీ ముఖ్యంగా యువతను ఆకర్షించేదిగా ఉంది. నిరుపేద వర్గాల వారికి 25 లక్షల ఆరోగ్య భీమా సదుపాయం, మహిళలకు నెలవారి భృతి రూ .2,500 అందజేయడం, ఉచిత రేషన్‌ కిట్‌, 500 రూపాయలకే గ్యాస్‌, 300 యూనిట్స్‌ వరకు ఉచిత విద్యుత్‌లాంటి హామీలున్నాయి. అయితే కాంగ్రెస్‌ మాయమాటలు చెబుతోందని బిజెపితోపాటు బిఆర్‌ఎస్‌ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలంగాణలో అమలుపర్చామని చెబుతున్న హామీలన్నీ అసంపూర్తిగా ఉన్నాయని, లబ్ది పొందలేకపోయిన అనేకమంది నిత్యం నిరసన వ్యక్తం చేస్తున్నారంటూ ఆ పార్టీలు గోలపెడుతున్నాయి. కాగా, మూడుసార్లుగా మెజార్టీని సాధించడం ద్వారా రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న ఆప్‌పార్టీ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల ఆదరణను పొందిన విషయం తెలియంది కాదు. అయినప్పటికీ ఈ ఎన్నికల వేళ మరోసారి తన మ్యానిఫెస్టోను ప్రకటించింది. మహిళా సమ్మాన్‌ యోజన కింద గతంలో మహిళలకు అందిస్తున్న వెయ్యి రూపాయలను 2100 కు పెంచింది.

దీనితోపాటు కొత్తగా 60 ఏళ్లు పైబడిన వృద్దులకు ఆరోగ్య రక్షణ పథకాన్ని ప్రకటించింది. పూజాగ్రంధి సమ్మాన్‌ యోజన కింద పూజారులకు నెలకు 18వేల రూపాయలను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆటో రిక్షా కార్మికుల సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకుని వారికి 15 లక్షల విలువైన జీవిత బీమా, ప్రమాద బీమా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేగాక ఆడపిల్లల పెండ్లి ఖర్చులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. విద్యార్ధుల యూనిఫాం అలవెన్సులకుగాను ఏడాదికి రెండుసార్లు 2500 రూపాయల చొప్పున అందిస్తామంటోన్న ఆప్‌ పార్టీకి ధీటుగా బిజెపికూడా హామీలవర్షం గుమ్మరించింది.

ముఖ్యంగా మహిళా వోటర్ల లక్ష్యంగా మహిళా సమృద్ధియోజన పేరుతో దిల్లీ లో అర్హుల్కెన మహిళలకు ప్రతీనెల 2500 రూపాయలను అందించే విధంగా తొలిక్యాబినెట్‌ సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించింది. గర్భిణీస్త్రీలకు 2100 రూపాయలు, దిల్లీ  బస్తీల్లో అటల్‌ క్యాంటిన్లలో 5 రూపాయలకే భోజన వసతి కల్పిస్తామంటోంది. అయితే మ్యానిఫెస్టోలో ప్రకటించిన వాటితోపాటు ప్రకటించని వాటిని కూడా గతంలో తమ కేంద్ర ప్రభుత్వం ఎన్నో అమలు చేసిన విషయాన్ని ఆ పార్టీ గుర్తు చేస్తున్నది. మొత్తంమీద ఉచితాల పేరున లక్షలాది కోట్ల రూపాయల వితరణ చేసే విషయంలో పోటీ పడుతున్న ఈ పార్టీలు, ఆ సొమ్మునంతా ఎక్కడినుండి పోగు చేస్తాయన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. కొత్తగా అధికారంలోకి వొస్తున్న ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు తమ మీద అప్పుల కుంపట్లు పెట్టాయంటూ గోలపెడుతూనే కొత్త హామీలను ప్రకటించి ప్రజలపైన మోయలేని భారాన్ని మోపేందుకు మరోసారి సిద్దపడుతున్నాయి.
 ` మండువ రవీందర్‌రావు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page