సంఘ‌ర్ష‌ణ‌ల ఉచ్చులో ఇరాన్ ఫుట్‌బాల్!

“మేము అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న చర్చలను నిశితంగా గమనిస్తున్నాం. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సంబంధించిన ఒప్పందానికి ఇరు పక్షాలు మునుపెన్నడూ లేనంత దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ వివాదం ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు జ‌రుగుతున్న సమయంలోనే చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే ఈ పోటీ ఇరాన్ జట్టుకు ఇది చాలా కీలకమైనది. ఈ టోర్నమెంట్‌లో దేశాల మధ్య వైరుధ్యాలు మైదానంలో ప్రదర్శించ‌బ‌డ‌టమ‌నేది చాలా కాలంగా జరుగుతున్న చ‌రిత్రే! అయితే ఇది కొన్నిసార్లు భావోద్వేగభరితంగా కూడా ఉండడం సహజమే. 1974లో తూర్పు జర్మనీ ఊహించని విధంగా పశ్చిమ జర్మనీని ఓడించినప్పుడు, తూర్పు జర్మనీ ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఆటగాళ్లు రహస్యంగా జెర్సీలను మార్చుకున్నారు. ఫాక్‌లాండ్స్ యుద్ధం జరిగిన కేవలం నాలుగేళ్ల తర్వాత అర్జెంటీనా ఇంగ్లాండ్‌ను ఓడించినప్పుడు, ఆ మ్యాచ్ ఒక ఆటలా కాకుండా యుద్ధంలా అనిపించిందని ఇరు జ‌ట్ల క్రీడాకారులు తెలిపారు. మరో మాటలో చెప్పాలంటే, ప్రపంచ కప్ సమయంలో ఫుట్‌బాల్‌పై భౌగోళిక రాజకీయాల ప్రభావం ఉండటం కొత్తేమీ కాదు. అయినప్పటికీ, ఆతిథ్య దేశం, టోర్నమెంట్‌లో పాల్గొంటున్న దేశంతో యుద్ధంలో ఉండటం అనేది చాలా తీవ్రమైన విషయం. ఇరాన్ ఈరోజు న్యూజిలాండ్‌తో తన మొదటి మ్యాచ్ కోసం మైదానంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, ఇరాన్ ఆటగాళ్లు మరియు అభిమానులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడి గురించి నా సహోద్యోగి పారిన్ బెహ్రూజ్ రాశారు..”

-కాట్రిన్ బెన్హోల్డ్..” న్యూ యార్క్ టైమ్స్ ” సౌజన్యంతో .. 

(పారిన్ బెహ్రూజ్)

నా చిన్ననాటి జ్ఞాపకాలలో కొన్ని 1998 ప్రపంచ కప్‌కు సంబంధించినవి.  ఆ సంవత్సరం ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ తలపడ్డాయి. ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత రాజకీయ ఉద్రిక్తతలతో నిండిన ఆటగా కొందరు దీనిని అభివర్ణించారు. ఇస్లామిక్ విప్లవం, ఆ తర్వాత ఇరాక్‌తో జరిగిన భయంకరమైన యుద్ధం తర్వాత ఇరాన్ పోటీకి అర్హత సాధించడం అదే మొదటిసారి. ఆ జట్టు ప్రతిభావంతులైన ఆటగాళ్ల‌తో నిండివుంది. వారిలో యువ అలీ దాయీ కూడా ఉన్నాడు (అతని అంతర్జాతీయ గోల్స్ రికార్డు క్రిస్టియానో రొనాల్డో బద్దలు కొట్టే వరకు నిలిచి ఉంది). ఆ జట్టు పునర్నిర్మాణంలో ఉన్న ఒక దేశానికి ప్రతీకగా నిలిచింది. నాకు ఆ మ్యాచ్ జరిగిన విషయం గుర్తులేదు, కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం గుర్తున్నాయి. ఊహించని విధంగా ఇరాన్ గెలిచింది, యు.ఎస్. టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి పోటెత్తారు, కొందరు చ‌ట్ట‌విరుద్ధంగా బహిరంగంగా మద్యం తాగారు కూడా! అప్పుడు నా వయసు కేవలం 3 ఏళ్లే, కానీ టెహ్రాన్ వీధుల్లోకి హారన్లు మోగిస్తూ కార్లు అంతులేకుండా పోటెత్తడాన్ని చూస్తుండగా, మా నాన్న నన్ను కారు కిటికీలోంచి ఎత్తి బయటకు చూప‌డం నాకు ఇప్పటికీ గుర్తుంది. జన సమూహాలను నియంత్రించాల్సిన పోలీసులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. “ఆ విజయం ఇరాన్ ప్రజలందరినీ ఏకం చేసింది,” అని మ్యాచ్ అనంతరం ఒక ఆటగాడు అన్నాడు.

ఈ ఏడాది అమెరికా, ఇరాన్ జట్లు తలపడతాయో లేదో మనకు ఇంకా తెలియదు. ఒకవేళ వారు గెలిచినా, ఆ విజయం ఇరానియన్లందరినీ ఏకం చేయదని చెప్పడం సమంజసమే. ఈ ఏడాది టోర్నమెంట్ కేవలం యుద్ధ వాతావరణంలోనే జరుగుతుండటం లేదు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆవిర్భావం తర్వాత జరిగిన అత్యంత   హింసాత్మక ప్రభుత్వ అణచివేత సంఘ‌ట‌న జ‌రిగిన  తర్వాత కొద్ది నెలలకే ఇది జరుగుతోంది. ఆ అణచివేతలో వేలాది మంది మరణించగా, మరికొంతమంది అరెస్టయ్యారు. అంతేకాకుండా, గత కొన్ని నెలలుగా మరణశిక్షల అమలు కూడా గణనీయంగా పెరిగింది. ఇతర అనేక దేశాల మాదిరిగానే, ఇరాన్ ప్రభుత్వం కూడా ఫుట్‌బాల్‌ను ఎల్లప్పుడూ ఒక మృదువైన శక్తి సాధనంగా చూసింది. కానీ ఈ సంవత్సరం, దేశంలో తీవ్ర విభేదాలు నెలకొని ఉన్న తరుణంలో,ప్ర‌పంచ క‌ప్పును త‌మ జ‌ట్టే గెలుచుకోవాల‌న్న నిశ్చ‌యంతో వున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వం కూడా త‌మ మాదిరిగానే ఉత్సాహ‌ప‌రుస్తుంద‌ని తెలిసి, చాలా మంది ఇరానీయులు తమ జట్టుకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధంలో ప‌డ‌టం ఖాయం. ఎందుకంటే చాలామందిలో ప్ర‌భుత్వం ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త ఉండట‌మే ఇందుకు కార‌ణం.

‘దాన్ని 10 రెట్లు పెంచండి’
ఈ అందమైన ఆట పట్ల ఇరాన్‌కు ఉన్న వ్యామోహం  స్థాయిని అర్థం చేసుకోవాలంటే, “బ్రెజిల్ లేదా అర్జెంటీనా  ఫుట్‌బాల్ అభిరుచిని తీసుకుని, దాన్ని 10 రెట్లు పెంచండి,” అని మాజీ జాతీయ జట్టు కోచ్ అఫ్షిన్ ఘోత్బీ ఒకసారి అన్నారు. ఫుట్‌బాల్‌లో ఇరాన్ చాలా నిష్ణాతురాలు. ఆ దేశ జాతీయ జట్టు గత నాలుగు ప్రపంచ కప్‌లతో సహా, మొత్తం ఏడు ప్రపంచ కప్‌లకు అర్హత సాధించింది. ఈ క్రీడకున్న ప్రజాదరణను తాము ఉపయోగించుకోవచ్చని ఆ ప్రభుత్వం ఎప్పటినుంచో అర్థం చేసుకుంది. 1998 విజయం తర్వాత, అయతోల్లా అలీ ఖమేనీ ప్రభుత్వ టెలివిజన్‌లో ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ, “బలమైన, అహంకారపూరితమైన ప్రత్యర్థి మీ చేతిలో ఓటమి చేదును చవిచూసింది,” అని అన్నారు.

ఖతార్‌లో జరిగిన 2022 ప్రపంచ కప్‌కు ముందు, ‘మహిళ, జీవితం, స్వేచ్ఛ’ నిరసనలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపిన‌ సమయంలో, ఆ జట్టు అధ్యక్షుడితో కలిసి ఒక ఫోటో దిగడంపై చాలా మంది ఇరానీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనిని వ్యతిరేకించిన ఆటగాళ్లు మూల్యం చెల్లించుకున్నారు. 2009లో, స్వదేశంలో వివాదాస్పద ఎన్నికల ఫలితాలపై  జ‌రుగుతున్న‌ నిరసనలకు సంఘీభావంగా, సియోల్‌లో జరిగిన ఒక ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ సందర్భంగా పలువురు జాతీయ జట్టు ఆటగాళ్లు ఆకుపచ్చ రంగు రిస్ట్‌బ్యాండ్‌లను ధరించారు. ఆట విరామ సమయంలో చాలా రిస్ట్‌బ్యాండ్‌లను తీసివేయడాన్ని అభిమానులు గమనించారు. బలవంతపు రిటైర్మెంట్లు, ఇతర శిక్షల గురించి కూడా వార్తలు వచ్చాయి. (ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ వాటిని ఖండించింది.) 2022 టోర్నమెంట్‌లో, అధ్యక్షుడిని కలిసిన అదే ఆటగాళ్లు ప్రారంభ మ్యాచ్‌లో జాతీయ గీతం పాడటానికి నిరాకరించారు. కానీ ఆ తర్వాత జరిగిన ఆటలలో, వారు స్పష్టంగా అసౌకర్యంగా కనిపిస్తూ, అయిష్టంగానే దాన్ని పాడారు.

‘ప్రభుత్వ జట్టు’?
యుద్ధ తీవ్రత కారణంగా ఈ ఏడాది జట్టు రాజకీయాల్లోకి మరింత లోతుగా కూరుకుపోయింది. మార్చిలో, టర్కీతో జరిగిన ఒక స్నేహపూర్వక మ్యాచ్‌కు ముందు, జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు ఆటగాళ్లు తమ స్కూల్ బ్యాగులను పట్టుకున్నారు. ఒక పాఠశాలపై అమెరికా జరిపిన బాంబు దాడికి నిరసనగా అలా చేశామని జట్టు అధికారులు తెలిపారు. మరణించిన పిల్లల జ్ఞాపకార్థం, ప్రపంచ కప్ జట్టు తమను తాము “మినాబ్ 168” అని పిలుచుకుంటుందని అధికారులు చెప్పారు. గత నెలలో, ఆటగాళ్లు ప్రభుత్వ అనుకూల ర్యాలీలో వేదికపై కనిపించారు. గత వారం, ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ  ఆంగ్ల-భాషా ఎక్స్  ఖాతా…ఏఐ-సృష్టించిన వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో జట్టు వివ‌రాలు, మత మరియు ప్రభుత్వ చిహ్నాలతో పొందిక‌గా పెట్టిన‌ ఉపశీర్షికలతో కూడి ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకులలో చాలామంది జాతీయ జట్టును “ప్రభుత్వ జట్టు” అని పిలవడం ప్రారంభించారు.

టెహ్రాన్‌లో నివసిస్తున్న 30 ఏళ్ల మహమ్మద్, తన స్నేహితులలో చాలామంది జట్టు గెలవడాన్ని కోరుకోవడం లేదని నాతో చెప్పాడు. ప్రతీకార చర్యలకు భయపడి తన మొదటి పేరు మాత్రమే వాడాలని కోరిన మహమ్మద్, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న ఆటగాళ్ల పట్ల తనకు సానుభూతి ఉందని చెప్పాడు. కానీ తన స్నేహితులు వాళ్లందరినీ “బూట్లు నాకేవాళ్లు” అని అనుకుంటున్నారని అన్నాడు.  కానీ, ఇరాన్‌లో పెరిగి, లాస్ ఏంజిల్స్‌లో చిత్రనిర్మాతగా ఉన్న షహీన్ కీయానీ, ఇరానీయులు ప్రపంచానికి తమ భిన్నమైన రూపాన్ని చూపించడానికి ఈ జట్టు ఒక మార్గమని తాను ఇప్పటికీ భావిస్తున్నానని నాతో చెప్పాడు. “వార్తా మాధ్యమాలలో చూపించేదానికి అతీతంగా, ఇది మన దేశానికి, మన ప్రజలకు మరో ప్రాతినిధ్యం,” అని అతను అన్నాడు. ఒకప్పుడు ఇరానీయులను ఏకం చేయగల ఏకైక క్రీడ‌ ఫుట్‌బాల్. కానీ ఇరాన్‌లోని యుద్ధం, విభేదాలు, క్లిష్టమైన రాజకీయ వాస్తవాలు ఇప్పుడు వారిని తీవ్రంగా గాయపరుస్తున్నాయి.

2026లో, ఇరాన్ ఫుట్‌బాల్ గుర్తింపున‌కు సంబంధించిన సంక్లిష్టమైన భావోద్వేగాలు, ప్రపంచ వేదికపై ఇరాన్‌కు ఎవరు ప్రాతినిధ్యం వహించాలి అనే అంశాలు సంఘ‌ర్షించే మరో వేదికగా మారింది. “ఇరాన్‌కు మద్దతు ఇస్తున్నప్పుడు, నేను ఎవరికి మద్దతు ఇస్తున్నాను?” అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయం చాలా మంది అభిమానుల మనసుల్లో ఉంది. వారు ఆ క్రీడను తక్కువగా ప్రేమిస్తున్నారని కాదు, కానీ  ప్రభుత్వం కూడా చాలా భిన్నమైన కారణాల వల్ల ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తుందనే విషయాన్ని మరచిపోవడం అసాధ్యం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *