ఆక్వా ఎగుమతులపై అంతర్జాతీయ ప్రభావం!

ప్రభుత్వానికి ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రంగం ఆక్వాదే. అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా మొదటి నుంచి రైతులే కష్టనష్టాలను ఎదుర్కొని సాగు చేస్తున్నారు. ఆక్వారంగం అభివృద్ధికి ప్రభుత్వం నామమాత్రం గానే చర్యలు తీసుకుంటుంది. మూడేళ్లుగా రొయ్యల మేత ధరలు పెరుగుతున్న తీరుపై ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్యానికి మించి ఉత్పత్తులు సాధిస్తూ  రాష్ట్రాన్ని  ఆర్థికంగా ముందుకు నడిపిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నా నాయకులకు మాత్రం పట్టడం లేదు. వ్యాధుల తీవ్రత, నీటి కొరత, మౌలిక వసతుల లేమి, నూతన పరిజ్ఞానం అందుబాటులో లేక నష్టాలపాలవుతున్నారు. ప్రస్తుతం ఆక్వా రైతులు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

image.png

విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యాపారులు కొనుగోళ్లు బాగా తగ్గించడం వల్ల మార్కెట్లో రొయ్య ధర దారుణంగా పతనమైంది. విదేశాల నుంచి ఆర్డర్లు లేక ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, కోల్డ్‌ స్టోరేజీలు రొయ్యల నిల్వలతో నిండిపోయాయి. రొయ్యల సాగు ఖర్చు బాగా పెరిగిపోయింది. రూ.లక్షల నష్టాలతో రొయ్య రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జనవరి వరకు ఆగి ఫిబ్రవరి నుంచి పండుగప్ప సాగు చేయాలనే ఆలోచనలో కొంతమంది రైతులున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రొయ్యల సాగు విస్తీర్ణం 1.2 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. వార్షిక ఉత్పత్తి నాలుగు లక్షల టన్నులు. వార్షిక ఆదాయం రూ.18 వేల కోట్లు. 24 శీతల గిడ్డంగులు ఉన్నాయి. విదేశాలకు ఆర్డర్లు తగ్గడంతో ఆక్వా మార్కెట్‌ కుదేలైంది పలు దేశాల్లో రొయ్య దిగుబడులు బాగా వచ్చాయి. దీంతో మన ప్రాంతం నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. మొన్నటి వరకు అధిక వర్షాలు, ప్రస్తుతం చలి వాతావరణం కారణంగా వైరస్‌లు విజృంభించి రొయ్యల దిగుబడులు 50 శాతానికి పడిపోయాయి. ఆర్థికమాంద్యం నేపథ్యంలో యూరోపియన్‌ దేశాలకు ఎగుమతులు భారీగా క్షీణించాయి.  ఎగుమతులు తగ్గడంతో ఆ ప్రభావం రొయ్యల మార్కెట్లపై పడిరది.

-ఎస్‌.కె. వహీద్‌ పాషా
(ఎంఎస్సీ బి.ఎడ్‌),
 ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌, హైదరాబాద్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page