ఆసిఫాబాద్ గడ్డపై ‘ఇందిరమ్మ’ పండుగ

– 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సీఎం రేవంత్ శ్రీకారం
– అర్హులైన ప్రతితీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు
– ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్/కొమరం భీమ్ ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న పేదల సొంతింటి కలలను నిజం చేసే ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత కార్యక్రమానికి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసనమండలి సభ్యుడు దండే విఠల్, జిల్లా కలెక్టర్ కె.హరిత, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తదితరులతో కలిసి మంత్రి సభాస్థలి, రెబ్బెన మండలం కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్, కాగజ్‌నగర్ మండలం దాదానగర్, సిర్పూర్ పేపర్ మిల్ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి సందర్శించనున్న ప్రాంతాలతోపాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్షా 20 వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, జూన్ నాటికి 2.35 లక్షల ఇండ్లు పూర్తవుతాయని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణం ఆర్భాటాలకు మాత్రమే పరిమితమైందని, కానీ ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే నాగులు లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ.22,700 కోట్లతో శ్రీకారం చుట్టిందని చెప్పారు. మొదటి, రెండో విడతలకే పరిమితం కాకుండా అర్హత గల ప్రతీ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే వరకు ప్రభుత్వం కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆదివాసీ జిల్లా కొమరం భీమ్ ఆసిఫాబాద్‌లోని కొఠారి గ్రామంలో గిరిజన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం ద్వారా ఆదివాసీల సొంతింటి కష్టాలను తొలగిస్తున్నామని మంత్రి తెలిపారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళను కుటుంబానికి ఆధారస్తంభంగా గుర్తిస్తూ మహాలక్ష్మి, గృహజ్యోతి, రేషన్ కార్డులు, ఇందిరా మహిళా శక్తి, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అర్హులైన పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *