“దేశీయంగా తయారైన ఈ వ్యవస్థ సక్సెస్ కావడంతో పారాచూట్ వ్యవస్థల తయారీలో ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యవస్థను డీఆర్‌డీఓ అభివృద్ధి చేయడం విశేషం. ఈ పారాచూట్ వ్యవస్థల సహాయంతో భారతీయ వైమానిక దళ సభ్యులు ఏకంగా 32వేల అడుగుల ఎత్తునుంచి భూమిపైకి దిగగలరు. ఇంతటి ఎత్తునుంచి పారాట్రూపర్లు దిగే సామర్థ్యాన్ని సంతరించుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. అయితే ఇప్పటివరకు 35వేల అడుగుల ఎత్తునుంచి పారాట్రూపర్లను దించే సామర్థ్యంతో అమెరికా అగ్రస్థానంలో వుండగా, 32వేల అడుగులతో భారత్ రెండో స్థానానికి చేరుకుంది.”
రక్షణరంగంలో భారత్ మరో కీలక విజయాన్ని సాధించింది. అత్యధిక ఎత్తులనుంచి మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్ (ఎంసీపీఎస్)ను విజయవంతంగా పరీక్షించడంతో ప్రపంచంలో ఇంతటి ఎత్తునుంచి పారాట్రూపర్లను దింపగలిగే సామర్థ్యమున్న రెండో దేశంగా గుర్తింపు పొందింది. వింగ్ కమాండర్ విశాల్ లఖేష్, విఎం(జి)తో పాటు మాస్టర్ వారంట్ ఆఫీసర్లు ఆర్.జె.సింగ్, వివేక్ తివారీ విజయవంతంగా ఈ మిషన్‌ను పూర్తిచేయడం విశేషం. దేశీయంగా తయారైన ఈ వ్యవస్థ సక్సెస్ కావడంతో పారాచూట్ వ్యవస్థల తయారీలో ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యవస్థను డీఆర్‌డీఓ అభివృద్ధి చేయడం విశేషం. ఈ పారాచూట్ వ్యవస్థల సహాయంతో భారతీయ వైమానిక దళ సభ్యులు ఏకంగా 32వేల అడుగుల ఎత్తునుంచి భూమిపైకి దిగగలరు. ఇంతటి ఎత్తునుంచి పారాట్రూపర్లు దిగే సామర్థ్యాన్ని సంతరించుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. అయితే ఇప్పటివరకు 35వేల అడుగుల ఎత్తునుంచి పారాట్రూపర్లను దించే సామర్థ్యంతో అమెరికా అగ్రస్థానంలో వుండగా, 32వేల అడుగులతో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు వెనుకంజలో వుండటం గమనార్హం.
డీఆర్‌డీఓ విభాగాలైన, బెంళూరులోని డిఫెన్స్ బయో ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబొరేటరీ (డీఈబీఈల్), ఆగ్రాలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఆర్‌డీఈ)లు ఈ వ్యవస్థను రూపొందించాయి. దేశీయంగా రూపొందించిన ఈ పారాచూట్స్ లో సుస్థిరత, స్టీరింగ్ కంట్రోల్ కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఫలితంగా అత్యధిక ఎత్తైన ప్రదేశాలనుంచి నియంత్రణతో నిర్దేశిత ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పారాట్రూపర్లు దిగగలుగుతారు. ముఖ్యంగా ఉ్రగవాద శిబిరాలు వంటి నిర్దిష్ట లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దిగి మన దళాలు దాడులు చేయగలుగుతాయి. ముఖ్యంగా ఈ పారాచూట్ వ్యవస్థలను దేశీయ ఉపగ్రహ వ్యవస్థల నేవిగేషన్ సిస్టమ్‌తో అనుసంధానించడం వల్ల, పారాట్రూపర్లకు ఎప్పటికప్పుడు కచ్చితమైన డేటా అందుతుంటుంది. అంతేకాదు శత్రుదేశాల రక్షణ వ్యవస్థలనుంచి ఏర్పడే అవరోధాలను తేలిగ్గా అధిగమించగలగుతారు. ఫలితంగా లక్షిత ప్రాంతాల్లో దిగి తమకు నిర్దేశించిన టాస్క్ ను అనుకున్న రీతిలో పూర్తిచేయగలరు. ప్రస్తుతం ఎంసీపీఎస్ మన సైనిక దళాలకు మాత్రమే అందుబాటులో వుంది.
సైనిక పారాట్రూపర్లు 25వేల అడుగుల ఎత్తునుంచి భూమిపైకి దిగే ఏర్పాటుంది. అయితే ప్రస్తుతం మన వైమానిక దళానికి అందుబాటులోకి వచ్చిన ఎంసీపీఎస్ నిర్వహణ ఖర్చు చాలా తక్కువ మాత్రమే కాదు ఆత్మనిర్భర్ భారత్‌కు దోహదం చేసేదిగా వుంది. ఇప్పటివరకు మనదేశం ఇటువంటి పారాచూట్లకోసం విదేశాలపై ఆధారపడుతోంది. ఈ సరికొత్త ఆవిష్కరణ ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారంగా నిలవనుంది. నిజానికి ఈ పరీక్ష నిర్వహణకు ముందు ఆగ్రాలోని ఎయిర్‌ఫోరర్స్ పారాట్రూపర్ ట్రైనింగ్ స్కూల్‌లో ఎసీపీఎస్‌ను దాదాపు 350 సార్లు పరీక్షించారు. సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్తీనెస్ అండ్ సర్టిఫికేషన్ కూడా దీని సామర్థ్యాన్ని ధ్రువీకరించింది. ప్రస్తుతం సాధించిన విజయంతో తక్కువ ఖర్చుతోనే ఉగ్రవాద శిబిరాలపై కచ్చితత్వంతో దాడిచేసి వారిని నిర్మూలించి వేగంగా మనదేశంలోకి ఈ దళాలు తిరిగి రాగలుగుతాయి. క్షిపణుల వినియోగం అత్యంత ఖర్చుతో కూడినది కనుక అన్ని సందర్భాల్లో ఉపయోగించడం కష్టం. అటువంటి సమయాల్లో ఇంతటి ఎత్తునుంచి చేసే పారాట్రూపింగ్ నిర్దిష్ట ఫలితాల సాధనకు దోహదం చేస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో మనదేశం ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌లో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి వెల్లడించింది. నిజం చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ అప్పటివరకు మనదేశ రక్షణ పాటవంపై ఇతరదేశాలకున్న అభిప్రాయాలను పటాపంచలు చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం బ్రిటన్ తమ వైమానిక దళ సభ్యులకు శిక్షణ ఇవ్వాలని మనదేశాన్ని కోరుతోంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయంటే ఇదే మరి! ఇక ఫ్రాన్స్ కూడా త్రివిధ దళాల సమన్వయ పోరాట పటిమపై మనదేశంనుంచి పాఠాలు నేర్చుకోవడానికి, ఆ దేశ సైనిక దళాల చీఫ్ మనదేశానికి రావడం విశేషం. అంతేకాదు మన సాంకేతిక నైపుణ్యాలపై ప్రపంచ దేశాలకు గట్టి నమ్మకం ఏర్పడిన మాట వాస్తవం. తాజాగా పారాట్రూపింగ్ లో మన వైమానికదళం సాధించిన విజయం, ప్రపంచ దేశాలను మరోసారి మనవైపు చూసేలా చేయగలదనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అంతేకాదు వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడ్రన్ మిలిటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (డబ్ల్యుడిఎంఎంఏ) 2025 సంవత్సరానికి విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో మన వైమానిక దళం చైనాను వెనక్కి నెట్టేసి మూడో అత్యంత శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ గా ఎదగడం, రక్షణ రంగంలో మన ఎదుగుదల ఎంతవేగంగా జరుగుతున్నదీ వెల్లడిస్తోంది. ఇప్పుడు అమెరికా, రష్యా తర్వాత ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వైమానిక దళం వున్నది మన దేశానికే! ఈ ర్యాంకింగ్‌పై చైనా గగ్గోలు పెట్టినా ఫలితం లేదు! ఇది పెరుగుతున్న మన సామర్థ్యానికి నిదర్శనం!
అత్యంత ఎత్తు ప్రదేశాలనుంచి పారాచూట్ సహాయంతో దిగేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు జరగడం సహజం. ముఖ్యంగా దీనికి సంబంధించిన ప్రాథమిక శిక్షణా సమయంలో ప్రతి వెయ్యి జంప్‌లకు 19.7% గాయాలు తగిలిన సంఘటనలు చోటుచేసుకునేవి. అదే మంచి అనుభవజ్ఞులైన పారాట్రూపర్లలో ఈ ప్రమాదాల శాతం 4.5% మాత్రమే. అయితే పారాచూట్ వైఫల్యం విషయానికి వస్తే ప్రతి పదివేల జంప్‌లకు ఒకటి కంటే తక్కువ వుండటం గమనార్హం. మిలిటరీ పారాచూటింగ్‌ను సాధారణంగా రెండు రకాలుగా విభజిస్తారు. మొదటిది హయ్ అల్టిట్యూడ్ హై ఓపెనింగ్ (హెచ్ ఏ హెచ్ ఓ) కాగా రెండవది హై ఆల్టిట్యూడ్ లో ఓపెనింగ్ (హెచ్ ఏ ఎల్ ఓ). ఎత్తును బట్టి పారాచూట్ రకాన్ని ఉపయోగిస్తారు. సంక్లిష్టమైన పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి సైనికులను భూమిపైకి దించడానికి ఈ రెండు పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని అనుసరిస్తారు. సాధారణంగా ఈ 15వేల నుంచి 35వేల అడుగుల వరకు ఎత్తునుంచి దళాలను భూమిపైకి దింపడం జరుగుతుంటుంది. మిలిటరీ పారాచూట్‌లు దిగే సమయంలో గంటకు 203 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
అంటే ఒక పారాట్రూపర్ కేవలం రెండు నిముషాల్లో భూమిపైకి దిగగలడు. హెచ్ ఓ ఎల్ ఓ నైపుణ్యాన్ని 1960లో అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు ఎంసీఏపీలో అత్యాధునిక వ్యవస్థలను వినియోగిస్తున్నది అమెరికా మాత్రమే. అమెరికా తయారీ హెచ్1-5 పారాచూట్ వ్యవస్థ అత్యధిక ఎత్తులనుంచి దిగడానికి ఉపయోగపడుతోంది. యు.ఎస్. ముఖ్యంగా తన పారాచూట్లలో ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ యాక్టివేషన్ డివైజ్, నావిగేషన్ డివైజ్‌లతో పాటు జీపీఎస్ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. చాలా ఇతర దేశాలు కూడా ఆధునిక పారాచూట్ వ్యవస్థలను కలిగివున్నాయి. వీటిల్లో బ్రిటిష్ ఆర్మీ ఎలైట్ పారాచూట్ రెజిమెంట్ అత్యున్నత నాణ్యమైన శిక్షణ పొందిన దళంగా పరిగణిస్తారు. అవసరమైన చోట్ల అత్యంత వేగంగా మోహరించే సామర్థ్యం ఈ రెజిమెంట్ సొంతం. ఇక రష్యా విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యధిక ఎయిర్ బోర్న్ దళాలు కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. గతంలో జరిగిన వివిధ పోరాటాల్లో ఈ దళాల వినియోగించడమే కాదు, వాటి సామర్థ్యం కూడా ప్రపంచానికి వెల్లడైంది. ఇక ఇజ్రాయిల్‌కు చెందిన సాయ్‌రెట్ మాట్కల్ ను ప్రపంచంలోనే గొప్ప ఎలైట్ ఫోర్స్ గా పరిగణిస్తారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీకి చెందిన ఫాల్‌చిర్‌మజ్‌గర్ దళాలు గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించడం గమనార్హం.
-ప్రజాతంత్ర డెస్క్





