-కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, జర్నలిస్ట్
నక్సల్స్ అనగానే కొందరికి గౌరవించిన విప్లవకారులు గుర్తొస్తారు. మరికొందరికి హింసను నమ్మిన మావోయిస్టులు కనపడతారు. కానీ, రాజ కీయంగా, సమాజశాస్త్రపరంగా, ఆర్థికంగా, సాంఘికంగా ఇది ఓ పెచ్చులూడిన గాయం లాంటిది. దేశం లోతుల్లో దశాబ్దాలుగా నుంచీ నక్సలిజం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు “నక్సల్స్ అంతమే.. రక్తపాతం చేసే వారికి చోటు లేదు” అనే వ్యాఖ్యలు ఒకవైపు ధీటుగా కనిపించవచ్చు. కానీ, ఇది శాశ్వత పరిష్కారం కాదు.
భారతదేశ సాయుధ విప్లవ పోరాటాల చరిత్రలో 1967 లో నక్సల్బరి గ్రామంలో మొదలైన అణగారిన వర్గాల తిరుగుబాటు ఉద్యమం నిప్పు రవ్వలా ఎగిసిపడి దేశమంతా కార్చిచ్చుల వ్యాపించింది. భూమి, భుక్తి, విముక్తి అనే పోరాటంతో మొదలైన సాయుధ నక్సల్ బరి పోరాటం అణగారిన వర్గాలకు అండగా నిలిచింది. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు కూలీలు తమ పోరాటాన్ని సాయుధ విప్లవ కారుల అండతో బరితెగించిన భూస్వామ్య వ్యవస్థపై ఉగ్ర రూపమై కదం తొక్కారు. హక్కుల కోసం కదిలారు. కూలీల రేట్లు పెంచాలని నినదించారు. పిడికిలి బిగించారు. అనుకున్న విజయ తీరాలెన్నింటినో సాధించారు.
“నక్సలిజం అనేది కేవలం తుపాకులతో కూడిన పోరాటం మాత్రమే కాదు. ఇది ఒక భావజాలం. సమాజంలో అణచివేయబడిన, శోషించబడిన వర్గాలకు న్యాయం కావాలన్న ఆకాంక్ష. భౌతికంగా నక్సల్స్ దళాలను ప్రభుత్వాలు నిష్ప్రభం చేయగలవు. కానీ భావజాలాన్ని ఆయుధాలతో చంపలేవు. భావజాలం ఏదైనా ప్రజల మదిలో పుడుతుంది. సమాజంలో అణచివేత, అన్యాయం, అసమానత ఉన్నంత వరకు ఆ భావజాలం మరో రూపంలో రాజకీయంగా, సాంస్కృతికంగా, సాహిత్యంలో, చర్చలలో, ఉద్యమాలలో జీవించగలదు. భగత్ సింగ్ భావజాలం ను బ్రిటిష్ పాలకులు నశింపజేయలేకపోయారు. అది ఇప్పటికీ ఉద్యమాలను ప్రేరేపిస్తోంది. అంబేద్కర్ భావజాలం కూడా ఇప్పటికీ సమాజం రూపును మార్చడంలో కొనసాగుతుంది.”
కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా విప్లవ పోరాటం నూతన పంథాను ఎంచుకోలేకపోయింది. కాలానికి అనుగుణంగా మారని ఎన్నో పార్టీలు, వ్యవస్థలు, సంస్థలు కాలక్రమంలో కొట్టుకొనిపోయిన సంఘటనలు ఎన్నో తమ కళ్ళముందే ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. మార్పు సహజం. మారుతున్న కాలానికి అనుగుణంగా తమ పంతాను మార్చుకొని పోతేనే ఏ వ్యవస్థ అయినా పదికాలాలపాటు బతికి బట్ట కట్టే అవకాశం ఉంటుంది. కానీ పరిస్థితులను అర్థం చేసుకోకుండా తమ వ్యవహార శైలిని మార్చుకోకుండా వ్యవహరించడం వ్యూహాత్మక తప్పిదం. కానీ విప్లవం ఎన్నటికీ నశించదు. విప్లవం అంటే ప్రజలలో నెలకొన్న అశాంతి మాత్రమే. అన్యాయంపై తిరగబడడమే..! ఆక్రమాలను ప్రశ్నించడమే..!! ఇది ఎన్నటికీ ఓడిపోని ఉక్కు పిడికిలి బిగించిన సామాన్యుడి రణ నినాదమే విప్లవం.
నక్సల్స్ అంతమైతే భావజాలం నశిస్తోందా..?
నక్సలిజం అనేది కేవలం తుపాకులతో కూడిన పోరాటం మాత్రమే కాదు. ఇది ఒక భావజాలం. సమాజంలో అణచివేయబడిన, శోషించబడిన వర్గాలకు న్యాయం కావాలన్న ఆకాంక్ష. భౌతికంగా నక్సల్స్ దళాలను ప్రభుత్వాలు నిష్ప్రభం చేయగలవు. కానీ భావజాలాన్ని ఆయుధాలతో చంపలేవు. భావజాలం ఏదైనా ప్రజల మదిలో పుడుతుంది. సమాజంలో అణచివేత, అన్యాయం, అసమానత ఉన్నంత వరకు ఆ భావజాలం మరో రూపంలో రాజకీయంగా, సాంస్కృతికంగా, సాహిత్యంలో, చర్చలలో, ఉద్యమాలలో జీవించగలదు. భగత్ సింగ్ భావజాలం ను బ్రిటిష్ పాలకులు నశింపజేయలేకపోయారు. అది ఇప్పటికీ ఉద్యమాలను ప్రేరేపిస్తోంది. అంబేద్కర్ భావజాలం కూడా ఇప్పటికీ సమాజం రూపును మార్చడంలో కొనసాగుతుంది.
అలాగే నక్సలిజం భావజాలం కూడా దాని ఉగ్ర రూపం నశించినా, ఆవశ్యకత ఉన్నంతవరకు అది మానవ మేధస్సులో కొనసాగుతుంది. హక్కులను, అన్యాయాలను, ఆక్రమాలను, దోపిడీలను, దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు విప్లవం భావజాలం అనేది ఎప్పుడూ ఏదో ఒక రూపంలో నిత్యం ప్రజలలో నిగూడికృతంగానే ఉంటుంది. నక్సల్స్ అంతమవచ్చు, కానీ వారి భావజాలం అంతమయ్యే అవకాశాలు తక్కువ. అది న్యాయం లేకపోతే మళ్లీ, మరో రూపంలో పునరుద్ధృతం అవుతుంది. అంతేకాబట్టి, హింసను అణచేయడమే మార్గం కాకుండా, ఆ హింసకు కారణమైన అసమానతలను తొలగించడమే స్థిరమైన మార్గం.
ఎన్కౌంటర్ల బుల్లెట్లకు.. శాంతి దారి దొరకదా?
తీవ్ర నిర్బందాన్ని ఎదుర్కొంటున్న నక్సల్స్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని పలుమార్లు కోరినా.. ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వినకుండా మార్చి, 2026 లోపు దేశ అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా మారిన నక్సల్స్ ను నిర్మూలిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా నక్సల్స్ ను తుద ముట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమై ఆ పోరాటంలో సఫలీకృతమవుతున్నారు. తాము చర్చలకు సిద్ధమని చర్చలకు ఆహ్వానించాలని పలుమార్లు మావోయిస్టు నాయకత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా అందుకు ససేమిరా అంటున్న కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ పై దుందుడుకు గానే వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం నక్సల్స్ సమస్యను ‘లా అండ్ ఆర్డర్’ గా చూసి, సంపూర్ణ పోలీసు విధానంతో ఎదుర్కొంటోంది. ఇందులో చర్చలు, మానవహక్కులు, మార్గమధ్య సూత్రాలు అన్నీ విస్మరించబడ్డాయి. నక్సలిజం ఒక భద్రతా సమస్య కంటే ముందుగా, వంచితులకో దారి. అందుకే ప్రభుత్వం తుపాకీ మార్గం కాదు, ప్రజల గుండెల్లో మార్పు రగిలించగల అభివృద్ధి మార్గాన్ని ఎంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నించేవారికి సమాధానం చెప్పే సిద్ధత ప్రభుత్వానికి ఉండాలి. అదే నిజమైన శాంతి దారి.
గత నెల మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ను ఎన్కౌంటర్లో హతమార్చడం మావోయిస్టు వర్గాల్లో తీవ్ర నైరాస్యంలో నింపింది. ఆయనతోపాటు ఇటీవల పలువురిని నక్సల్స్ నాయకులను హతమార్చడంతో పాటు పదుల సంఖ్యలో నక్సల్స్ సమూహాన్ని భద్రత దళాలు ఎన్కౌంటర్లో హతమారుస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో మావోయిస్టు వర్గాలు అతలాకుతలమైపోతున్నాయి. ఐదున్నర దశాబ్దాల పాటు నక్సల్స్ కు ఆయువుపట్టుగా ఉంటున్న కాకులు దూరని కారడివిగా పేరుగాంచిన ఛత్తీస్గడ్ లోని అబూజ్ మడ్ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టి పోలీసులు పై చేయి సాధించడం నక్సల్స్ కు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అందుకే తాము చర్చలకు సిద్ధమని పలుమార్లు నక్సల్స్ నేతలు ప్రతిపాదించినా..
ప్రభుత్వం మాత్రం పెడ చెవిన పెడుతూ నక్సల్స్ నిర్మూలనే అంతిమ లక్ష్యంగా అందుకు దేశ సైన్యాన్ని, హెలిక్యాప్టర్లను వాడుతూ తమ లక్ష్య చేదన లో ముందుకు సాగుతున్నారు. నక్సల్స్ చర్చలు పేరుతో కాలయాపన జరిపి రక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడంతో పాటు ఆయుధాలను సమకూర్చుకునే వ్యూహాత్మక చర్యలకు పాల్పడుతుందనే భావన ప్రభుత్వ వర్గాలలో నెలకొంది. మావోయిస్టుల తమ కుటుంబ ప్రయోజనాల కోసం కాకుండా తాము నమ్ముకున్న సిద్ధాంతం కోసం, పేద ప్రజలు, అణగారిన వర్గాలు, ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న సొంత దేశ పౌరుల పైననే ఎన్కౌంటర్ల పేరుతో ప్రభుత్వం చంపడం సబబు కాదన్న అభిప్రాయం మానవ హక్కుల సంఘాలు వ్యక్తపరుస్తున్నాయి. ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నా దేశంలోని అనగారిన, పేద వర్గాల, ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న నక్సల్స్ ను చర్చలకు ఆహ్వానించాల్సింది పోయి, వారికి బుల్లెట్లతోనే సమాధానం చెబుతామని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటం పట్ల పలువురు మేధావులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
(మిగతా రేపటి సంచికలో ..)