Take a fresh look at your lifestyle.

ఆం‌దోళనకర స్థాయిలో మానవ అక్రమ రవాణా

ఐక్యరాజ్యసమితీ గణాంకాల ప్రకారం మానవ రవాణా ప్రతి ఒక్క దేశంలో విస్తృతంగా ప్రబలుతోంది. మానవ రవాణా అంతర్జాతీయ కోట్ల డాలర్ల వ్యాపారంగా మారింది. ప్రపంచంలోని అత్యంత వేగంగా పెరుగుతున్న క్రిమినల్‌ ‌పరిశ్రమలలో అక్రమ రవాణా ఉంది. ప్రతి సంవత్సరం 99 బిలియన్‌ ‌కోట్ల వ్యాపారం జరుగుతోంది. మాదక ద్రవ్యాల సరఫరాను ప్రపంచంలోని అతిపెద్ద అక్రమ వ్యాపారంగా పేర్కొంటారు. తర్వాతి స్థానం ఆయుధాల అక్రమ రవాణాది కాగా మానవ అక్రమ రవాణా మూడో స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికా అధ్యయనం ప్రకారం… ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా ద్వారా ఏటా 10 బిలియన్‌ ‌డాలర్ల వ్యాపారం జరుగుతోంది. మానవుల అక్రమ రవాణాను సంఘ వ్యతిరేక, అనైతిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఈ నేరాలు కొనసాగుతున్నాయి. దేశంలో రాష్ట్రంలో మహిళల, బాలికల అక్రమరవాణా నానాటికీ పెరుగుతోంది.

 ఆందోళనకరస్థాయిలో మానవ అక్రమ రవాణా
జాతీయ నేర గణాంకాల విభాగం రికార్డుల ఆధారంగా దేశంలోని ప్రధాన నగరాలలో సాగుతున్న వ్యభిచార కేంద్రాలకు తరాలుతున్న మహిళలు, బాలికలో ముప్పై శాతం రాష్ట్రానికి చెందిన వారే కావడాన్ని బట్టి పరిస్తితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వ్యభిచార వృత్తిలో డెబ్బై అయిదు మిలియన్ల మండి మహిళలు, బాలికలు మగ్గుతున్నారు. అందులో 25 శాతం భారతదేశానికి చెందినవారే. వీరిలో అధిక శాతం మైనర్‌ ‌బాలికలే ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. ఇందులో ముఖ్యంగా 28 నుంచి 30 శాతం మహిళలు, బాలికలను వ్యభిచార కేంద్రాలలోకి బలవంతంగా నేడుతున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి.

బాలలు బానిసలుగా మారుతున్నారు
ఇటీవల జరిగిన కొన్ని ఉదంతాలను పరిశీలిస్తే కేవలం యాభైవేల రూపాయాలకు హైదరాబాద్‌ ‌పాతబస్తీలో పద్నాలుగేళ్ల అమ్మాయిని అరవై ఏళ్ల దుబాయ్‌ ‌షేక్‌కి  అమ్మేసిన సంఘటన, నేటి బాలలే రేపటి పౌరులు, పౌరులుగా ఎదగాల్సిన బాలలు కొన్ని ముఠాల చేతుల్లో బానిసలుగా మారిపోతున్నారు. సమాజాన్ని అర్థం చేసుకునే లోపు వారి జీవితాలు నలిగిపోతున్నాయి. వారి ఆనందాన్ని, ఆశలను, ఆశయాలను  అక్రమ రవాణా వ్యాపారులు ఆదిలోనే అంతం చేస్తున్నారు.

మానసిక గాయాలతో జీవచ్ఛవాలుగా మారుతున్నారు
ముక్కుపచ్చలారని పసిపిల్లలు, అమాయకమైన ఆడపిల్లలు, ఆదరణ కోరుకునే ఒంటరి మహిళలు అకస్మాత్తుగా కనిపించకుండాపోతున్న వారి సంఖ్య సంవత్సరం సంవత్సరానికీ విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. ప్రేమ, పెళ్లిళ్ల పేరుతో మోసపోయేవారు కొందరైతే ఉపాధి పేరుతో వలస వెళ్లి ఆపదలో చిక్కుకునేవారు మరికొందరు. పోలీసులు ఎంత నిఘాపెట్టినా, భారత రాజ్యాంగం లో ఎన్ని చట్టాలు రూపొందిస్తున్నా యథేచ్ఛగా మానవ అక్రమరవాణా సాగుతూనే ఉంది.. మాయమైపోతున్న బాధితుల్ని సంతల్లో వస్తువుల్లా వేలం వేస్తూ అమ్మేస్తున్నారు అక్రమ రవాణా ముఠాలు. కొందరిని లైంగిక బానిసలుగా మార్చేస్తున్నారు. ఇంకొందరిని అవయవాల మార్పిడికి ఉపయోగించుకుంటున్నారు. మరికొందరిని వెట్టి చాకిరీకి నిర్బంధిస్తున్నారు. బాధితుల్లో శారీరకంగా, మానసికంగా అయిన గాయాలు చివరికి వారిని జీవచ్ఛవాలుగా మార్చేస్తున్నాయి. సమాజం పైనే విరక్తి, ఏహ్యభావం పెంచుకునేలా తయారవుతున్నారు.

అక్రమ రవాణా బాధితులు బడుగు బలహీన వర్గాలే…..
అధిక మొత్తంలో డబ్బును సునాయాసంగా సంపాదించడానికి మానవ అక్రమ రవాణా వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. త్వరగా డబ్బు సంపాదించాలన్న కోరిక, కుటుంబ ఆర్థిక పరిస్థితులను చక్కపెట్టాలన్న బాధ్యత, ఇలా కారణాలేవైనా మంచి చెడులు ఆలోచించకుండా అడుగులేయడం వల్ల చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. సంపాదనకు సులువైన మార్గాల్ని ఎంచుకునే ప్రయత్నం చేయడం వల్లే ఎక్కువ మంది ఈ అక్రమ రవాణా బారిన పడుతున్నారు. మానవ అక్రమ రవాణా వ్యాపారులు సాంఘికంగా అణగారిన వర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వయసులో ఉన్న బాలికలు, స్త్రీలు, చిన్నపిల్లలను భయ పెట్టడం, డబ్బు ఆశతో ప్రలోభ పెట్టడం, అబద్దాలు మాట్లాడటం, ఏవేవో మాయమాటలు చెప్పి వారి బలహీనతలను సొమ్ము చేసుకుంటూ ఊబిలోకి దింపుతున్నారు.

- Advertisement -

 ట్రాఫికింగ్‌ ‌లో ఎక్కువ బలయ్యేది మైనర్‌ ‌బాలికలే
మైనర్‌ ‌బాలికలు ఏ పని చేయబోతున్నారో ముందుగా వారికి తెలియకుండానే బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించబడుతున్నారు. వ్యాపారులు ఎలా చెబితే అలా నడుచుకోవాల్సిందే. ఎదురు తిరిగే సాహసం చేస్తే చిత్రహింసలకు గురవుతుంటారు. వారి శరీరం మీద వారికే స్వేచ్చ లేని పరిస్తితి. గాయాలు, దెబ్బలు, అవమానాలు, సమాజం పై నమ్మకం సదలటం చివరకు తమపై తామే నమ్మాకాన్ని కొల్పెయే పరిస్తితులు నెలకొంటున్నాయి.

అక్రమరవాణా• బాలలతో  ఎయిడ్స్ ‌ప్రబలే అవకాశం

చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల ఎక్కువ అబార్షన్‌ ‌లు జరుగుతూ ఉంటాయి. పొత్తికడుపు నొప్పి, కడుపు నొప్పి, చర్మ వ్యాధులతో తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. బాధితురాలు మర్మావయవాల పై పుండ్లు, గాయాలు, మంటలతో తీవ్రమైన బాధలను ఎదుర్కోవాల్సిన పరిస్తితి వస్తుంది. అక్రమ రవాణాకు గురైన బాలలు సుఖవ్యాధులతో పాటుగా హెచ్‌.ఐ.‌వి. బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

తల్లిద్దండ్రుల బాధ్యత మరవొద్దు
పసిపిల్లల అక్రమ రవాణా ఇప్పుడు అందరినీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వీరిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలను బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా వదిలేయడం, అపరిచితులకు అప్పజెప్పడం, కుటుంబ గొడవలు, సమస్యల్ని ఇతరులతో పంచుకోవడం లాంటి వాటికి దూరంగా ఉండాలి.

అత్మవిశ్వాసం అందిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు
హింసాత్మక నేరపూరిత ఆలోచనలతో, మానవత్వానికి వ్యతిరేకంగా సమాజంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాను ముందు జాగ్రత్త వహిస్తే అరికట్టవచ్చు. ట్రాఫికింగ్‌కు గురైన బాలికలను వ్యభిచార వృత్తిలో దించడం, ఇతర పద్ధతులలో లైంగిక వేధింపులకు గురి చేయడం, బలవంతంగా, కార్మికులుగా, సేవకులుగా వినియోగించుకోవడం లేదా నియమించుకోవడం జరుగుతోందన్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా ఎవరో చేసిన మోసాలకు బలైపోయిన బాధితులకు సరైన జీవనోపాధి అందించి సమాజంలో గౌరవంగా బతికేందుకు అత్మవిశ్వాసం అందిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆంటి హ్యూమన్‌ ‌ట్రాఫికర్‌ ‌యూనిట్‌ ‌కలిసికట్టుగా పనిచేస్తేనే బాలలు, మహిళల అక్రమ రవాణాను నివారించడం చాలా సులువు. పేదరికాన్ని రూపుమాపడం, ఆచార సంప్రదాయాలు, సామాజిక నిర్మాణాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా మానవ అక్రమ రవాణా నిరోధించడానికి  వీలవుతుంది.

అక్రమరవాణా ఆపుదలకు విభాగాల ఏర్పాటు
మహిళా భద్రత విభాగం చీఫ్‌ ‌స్వాతి లక్రా ఐ.పి.ఎస్‌. ఆదేశాలతో తెలంగాణ లోని అన్నీ జిల్లాలో ఆంటీ హ్యూమన్‌ ‌ట్రాఫికింగ్‌ ‌యూనిట్‌ ‌లను ఏర్పాటు చేయడం, వివిధ శాఖాధికారులతో , స్వచ్ఛంధ సంస్థలతో సైకాలజిస్ట్ ‌సైక్రియాట్రిస్ట్ ‌లతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ, ప్రజలలో చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.  అత్యవసర సమయంలో మానవ అక్రమ రవాణాకు సంబంధించి ఫిర్యాదులు ఏమైనా ఉంటే డయల్‌ 100, ‌చైల్డ్ ‌హెల్ప్ ‌లైన్‌ 1098, ‌షీ టీం నంబర్‌ 94906 16555 ‌నంబర్లను సంప్రదించాలిి.

Atla
డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి
రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321

Leave a Reply