చివరి రోజు భారీగా తరలివొచ్చిన భక్తులు
కాళేశ్వరం,ప్రజాతంత్ర,మే 26: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు (Saraswati Pushkaralu) ఘనంగా సాగుతున్నాయి. సోమవారంతో పుష్కరాలు ముగిశాయి. దీంతో చివరి రోజైన సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు మే 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాళేశ్వరంలో ఆధ్యాత్మికతతో శోభిల్లిన సరస్వతి పుష్కరాలు ముగిశాయి. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే తెలంగాణ, ఆంధప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నది మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు దంపతులు కలిసి త్రిగుణాత్మక నదుల సాన్నిధ్యంలో స్నానం చేసి పుణ్యఫలాన్ని అందుకుంటున్నారు. తీరం వెంట సైకత లింగాలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే, పితృదేవతలకు శ్రాద్ధకర్మలతో తీరాన్ని పరిపూర్ణంగా అలాగే పుష్కరాల ముగింపు సందర్భంగా పూజారులు చండీ హోమాన్ని నిర్వహించనున్నారు. చివరి రోజు కావడంతో అధికారులు భారీగా భక్తుల రాకను ఊహించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సరస్వతీ మాత, శుభానందదేవి అమ్మవారుల దర్శనార్థం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఒకవైపు భక్తి భావన, మరోవైపు భక్తుల ఉత్సాహంతో కాళేశ్వరం పుష్కర క్షేత్రంగా ప్రకాశించింది.
ముక్తీశ్వరాలయంలో పూర్ణాహుతి
రాష్ట్ర ప్రజల సంపద, ఆరోగ్యం, వృద్ధి, పాడిపంటల శుభఫలితాల కోసం 12 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన హోమాలు పూర్ణాహుతితో సోమవారం ముగిశాయి. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ మహా పర్వదినంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ వెంకటరావు, ఈఓ మహేష్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 12 హోమాలు ప్రజల ఆర్థిక, శారీరక శ్రేయస్సు, వ్యవసాయోత్పత్తి అభివృద్ధికి శుభపరిణామాలు కలగాలని ఆకాంక్షతో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సందర్భంగా శాంతి, ఐశ్వర్యం, సమృద్ధిని కోరుతూ విశేష పూజలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు చేశారు.