గ్రామీణ భారతదేశంలో పేదరిక నిర్మూలనకు ఉపాధి హామీకి ఆధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో విప్లవాత్మక సాంకేతిక మార్పుల ఆవశ్యకత ఏర్పడింది. 2005లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు కృత్రిమ మేధస్సు డేటా విశ్లేషణ సాంకేతికతను ఉపయోగించి చెల్లింపుల ఆలస్యం, వేతనాల క్షీణత పర్యవేక్షణలో లోపాల వంటి సమస్యలను పరిష్కరించడానికి ముందడుగు వేసింది. దేశ గ్రామీణ జనాభాలో సుమారు 30 శాతం మందికి సంవత్సరానికి 100 రోజుల వేతన ఉపాధి హామీ ఇవ్వడమే దీని ప్రధాన లక్ష్యం. 2024 సంస్కరణల కేంద్ర బిందువుగా కృత్రిమ మేధస్సు వినియోగం ఇంకా కొన్ని రాష్ట్రాలలో నత్తనడకన కొనసాగుతోంది.
ఏఐ ఆధారిత పద్ధతులు ఉద్యోగ అవసరాలను ముందుగా అంచనా వేసి, వనరుల కేటాయింపును సద్వినియోగం చేసుకోవడంలో అలాగే ప్రాజెక్టుల పురోగతిని ప్రత్యక్షంగా పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏఐ సాధనాలు ప్రాంతాల వారీగా ఉపాధి అవసరాలను ముందుగానే అంచనా వేయడం ద్వారా సమయోచితంగా ఉద్యోగ కేటాయింపులు జరిగేలా చేస్తాయి కానీ ఈ సాంకేతికను ఉపయోగించుకోవడానికి స్థానిక సంస్థలు గ్రామీణాభివృద్ధి సిద్ధంగా లేవు. ఈ సంస్కరణల్లో ప్రధానమైన సాంకేతిక ఆవిష్కరణ నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్.
ఈ సిస్టమ్ జియో-ట్యాగింగ్ సాయంతో రోడ్లు, కాల్వలు, వరద రక్షణ నిర్మాణాలు వంటి ప్రాజెక్టులు నిర్దేశిత ప్రణాళిక ప్రకారం అమలవుతున్నాయా అని రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తుంది. ఇది నిధుల లీకేజీలను తగ్గించి, బాధ్యత నిర్ధారిస్తుంది. కొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా కార్మికులు మొబైల్ లేదా వెబ్ యాప్‌ల ద్వారా పని కోసం దరఖాస్తు చేయగలరు, కేటాయింపులను తెలుసుకోవచ్చు, వేతన చెల్లింపుల స్థితిని వెంటనే తనిఖీ చేయవచ్చు. అలాగే ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ఆధారంగా వలస, వ్యవసాయ చక్రాలు, స్థానిక అవసరాలపై పాత డేటాను విశ్లేషించి, మట్టి సంరక్షణ, వనరుల పెంపకం, పునరుత్పత్తి శక్తి ప్రాజెక్టుల వంటి పనులు సమాజ అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు.
అలాగే కరకట్టల నిర్మాణం, చెరువుల్లో కుంటలు తలపిరులు వంకలు సూయిజ్ సప్ప్లై ఛానెల్స్ మరమత్తులకు అలాగే నాలా వ్యవస్థను పటిష్టపరచడానికి డ్రోన్ వ్యవస్థను అనుసంధానం చేయాలి. ఈ ఏఐ ఆధారిత సాధనాలు ఇప్పటికే అమలులో ఉన్న డిజిటల్ చెల్లింపు విధానాలపై ఆధారపడి ఉన్నాయి, ఇవి నగదు లావాదేవీల లీకేజీలను గణనీయంగా తగ్గించాయి. అయితే, ఇంటర్నెట్ సదుపాయం లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా సవాళ్లు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం సంప్రదాయ పద్ధతులతో కలిపి హైబ్రిడ్ పద్ధతిని అనుసరిస్తోంది.
నారెగ పథకంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు చెల్లింపు ఆలస్యం, వేతనాల క్షీణత, పర్యవేక్షణ లోపం వంటివి 2024 సంస్కరణలతో తగ్గుముఖం పట్టాయి. వేతనాలను ద్రవ్యోల్బణంతో అనుసంధానించి, పని పూర్తయ్యిన 15 రోజుల్లో చెల్లింపులు జరిగేలా ఏఐ ఆధారిత పద్ధతులు అమలు చేస్తున్నారు. పథకం పరిధిని విస్తరించి, ప్రకృతి వనరుల నిర్వహణ, నైపుణ్యాభివృద్ధికి అనువైన ప్రాజెక్టులను కూడా చేర్చారు. కనీసం ఒక మూడవ వంతు మంది మహిళల పాల్గొనడం తప్పనిసరి చేయడం ద్వారా లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు, సమాన పనికి సమాన వేతనం దక్కుతున్నది. ఏఐ విశ్లేషణ ఆధారంగా వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఒడిశాలోని వలస ప్రభావిత బ్లాకులలో లబ్ధిదారులకు అదనపు వేతనాలు ఇవ్వడం వంటి కొత్త చర్యలు కూడా ప్రవేశపెట్టారు. 2023–24 సంవత్సరానికి బడ్జెట్ ₹60,000 కోట్లు తగ్గినా, ప్రభుత్వం ఏఐ ఆధారిత ఆడిట్‌లు మరియు సోషల్ ఆడిట్‌ల ద్వారా పారదర్శకతను, ఖర్చు తగ్గింపును సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిపుణుల అంచనా ప్రకారం, ఈ సంస్కరణలు గ్రామీణ ఉపాధి సృష్టిని పెంచి, పట్టణ వలసలను తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచగలవు. అయితే అమలులో కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి.
కార్యాలయం ఆలస్యం, సాంకేతికతను అంగీకరించడంలో ప్రతిఘటన, గ్రామీణ కార్మికులలో డిజిటల్ అక్షరాస్యత లోపం. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం స్థానిక పంచాయతీ సామర్థ్యాన్ని పెంచడం పై దృష్టి సారించింది. అలాగే స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం ద్వారా కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తమిళనాడులో ఈ సంస్కరణలు విజయవంతమయ్యాయి.ఏఐ ఆధారిత అమలు విధానం, స్థానిక ఉపాధి అవసరాలు తీరడమే కాకుండా మౌలిక వసతుల అభివృద్ధి చేసింది. “ఏఐ ఆధారిత జాతీయ ఉపాధి హామీ పథకం కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, గ్రామీణ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నది.
భవిష్యత్తులో, 2030 నాటికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప్రాజెక్టులను సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానం చేయడం ప్రభుత్వ లక్ష్యం. ఏఐ ఆధారిత ప్రణాళికలు పర్యావరణానికి అనుకూలమైన ప్రాజెక్టులను నిర్ధారించనున్నాయి. సమయానికి వేతనాలు రావడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం జీవితాలను మార్చేసిందని లబ్ధిదారులు అంటున్నారు . 2024 సంస్కరణలు కేవలం ఉపాధి హామీ పథకం కంటే ఎక్కువ. ఇవి గ్రామీణ భారతదేశాన్ని సాంకేతికంగా శక్తివంతం చేసే దిశగా ముందడుగు. కృత్రిమ మేధస్సు ఆధారంగా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ, ఈ పథకం “ఉపాధి” నుండి “సుస్థిర అభివృద్ధి” దిశగా ప్రయాణిస్తోంది.
(డా . సిహెచ్ నవీన్ కుమార్ రెడ్డి,





