– పెంచిన జీతాలు తగ్గించడం అన్యాయం
– తెలంగాణ రైజింగ్ అంటే ఇదేనా
– సిఎం రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ
మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను అంగన్‌వాడీలుగా గుర్తించి ఏడాది దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇప్పటికీ పెరిగిన జీతం ఇవ్వలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. వీరికి తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఇచ్చిన జీ.ఓ.ను కాపీ కొట్టి రేవంత్ సర్కార్ ప్రచారం చేసుకున్నదని ఆరోపించారు. పెంచిన జీతం మూడు నెలలు మాత్రమే చెల్లించి గతేడాది కాలంగా వారిని పాత జీతానికే పని చేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జీతాన్ని రూ.13,650 నుంచి తిరిగి రూ.7,800కి తగ్గించడం దారుణమని, బహుశా పెంచిన జీతాలను తగ్గించే కొత్త సాంప్రదాయానికి తెర లేపిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమోనని ఎద్దేవా చేశారు. అన్నింటా తెలంగాణ రైజింగ్ అని చెబుతూ అంగన్‌వాడీల జీతాలు తగ్గించడం ఎంతవరకు సమంజసమన్నారు.
ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు జనవరి 2024 నుంచి 12 నెలలకు పెరిగిన జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్‌చేశారు. అంగన్వాడీ కేంద్రాలుగా మారిన ప్రతీ చోట హెల్పర్లను నియమించాలన్నారు. మే నెల పెరిగిన జీతాలు అందని జిల్లాల్లో తక్షణమే చెల్లించాలన్నారు. మే నెల జీతాన్ని 8 జిల్లాల్లో మాత్రమే ఇచ్చి మిగతా జిల్లాల వారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మినీ అంగన్వాడీలు ప్రచార సాధనాలు కాదని, వారికి నిజమైన గౌరవం ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న మానసిక వేదన, వారి కుటుంబాలు రాష్ట్రవ్యాప్తంగా 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలున్నారు .వీరంతా మారుమూల గ్రాణ, గిరిజన ప్రాంతాల్లో అత్యంత పేదవర్గాలకు అంకితభావంతో సేవలు అందిస్తున్నారు.
మినీ అంగన్‌వాడీ కార్యకర్తల కష్టాలను గుర్తించిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 5న వారికి అంగన్‌వాడీలుగా పదోన్నతి కల్పిస్తూ జీ.ఓ. జారీ చేసింది. అయితే, ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఉత్తర్వులు అమలు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క.. మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మినీ అంగన్‌వాడీలను అంగన్‌వాడీలుగా గుర్తిస్తూ మొదటి సంతకం చేసిన సంగతి గుర్తుండే వుంటుంది. 2023 డిసెంబర్ 15న ఇదే విషయంపై జీ.ఓ. కూడా జారీ చేశారు. కానీ, అది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీ.ఓ. దాన్నే తిరిగి కొత్తగా ప్రచారం కోసం విడుదల చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. 2024 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలు అంగన్‌వాడీ పేగ్రేడ్‌లో రూ.13,650 జీతం చెల్లించిన ప్రభుత్వం, ఆ తర్వాత మినీ అంగన్వాడీ జీతం రూ.7,800కి తగ్గించి, 2025 ఏప్రిల్ వరకు అదే జీతం చెల్లించింది. ఇది అన్యాయమని పేర్కొన్నారు.
అన్నిట్లో తెలంగాణ రైజింగ్ అని చెబుతూ అంగన్‌వాడీల జీతాలు తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మినీ అంగన్వాడీలు తమ హక్కుల కోసం మంత్రిని, అధికారులను అనేకసార్లు కలిసినా, ప్రభుత్వం స్పందించలేదు. బీఆర్‌ఎస్ పార్టీ ఈ విషయంపై ప్రశ్నించిన తర్వాత, 2025 ఏప్రిల్‌లో మళ్లీ పాత జీవోను తిరిగి విడుదల చేస్తూ, మినీ అంగన్‌వాడీలను అంగన్‌వాడీలుగా గుర్తిస్తున్నామని ప్రచారం చేసుకున్నారు. అంతేతప్ప వారికి ఎటువంటి న్యాయం జరగలేదన్నారు.
అంగన్‌వాడీలకు రూ.18,000 నెలసరి జీతం పెంచుతామని మోసం, మినీ అంగన్వాడీలను అంగన్వాడీలను చేస్తామని మోసం… ఇలా కాంగ్రెస్ మహిళలకు చేసిన మోసాల లిస్ట్ రాస్తే చాంతాండంత అవుతుందన్నారు.