అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు..

మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలు వల్లెవేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు ఏటా 42 వేల కోట్లు మాత్రమేనని, కానీ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో చేసిన అప్పు 1 లక్షా 48 వేల కోట్లు అని వెల్లడించారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రైతు భరోసాకు బడ్జెట్ లో రూ.15 వేల కోట్లు కేటాయించారు. కానీ కేవలం 4500 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 11వేల కోట్లు రైతు భరోసాలో కోత పెట్టారు. రుణమాఫీకి బడ్జెట్లో రూ.31 వేల కోట్లు ఇస్తామని చెప్పి, 20 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. రుణమాఫీలో కూడా 11 వేల రూపాయలు కోత విధించారు. ఫసల్ భీమాకు 1300 కోట్లు పెట్టామని బడ్జెట్లో చెప్పారు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. రైతులకే గత బడ్జెట్లో 23 వేల కోట్లు కోతపెట్టి, రైతుల ఉసురు పోసుకున్నారు. అన్యాయం చేశారు ఐదేండ్లలో లక్ష కోట్లకు కోత పెడతారన్నమాట. నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4 లక్షల 50 వేల ఇండ్లు కడతామని గత బడ్జెట్లో చెప్పారు. 22500 కోట్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. దీన్నిబట్టి చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ 22500 కోట్లు నష్టం చేశారు. మైనారిటీలకు 3000 కోట్ల బడ్జెట్ పెట్టారు, ఇచ్చింది 1100 కోట్లు మాత్రమే.1900 కోట్లు కోత పెట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లో కూడా 60శాతం మించి ఖర్చు పెట్టలేదు.అన్యాయం చేశారు. వానకాలం ఇవ్వాల్సిన రైతుబంధు 8 వేల కోట్లు ఎగ్గొట్టారు యాసంగిలో 8వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే 3500 కోట్లు ఇచ్చారు. 4500 కోట్లు ఎగ్గొట్టారు. అంటే 8+4 = 12 వేల కోట్ల రూపాయలు రైతుభరోసా ఎగ్గొట్టారు, అవే డబ్బులు రుణమాఫీలో కలిపారు. 20 వేల కోట్లలో 12 వేల కోట్లు తీసేస్తే, మీరిచ్చిన రుణమాఫీ కేవలం 8 వేల కోట్లు మాత్రమే – చెప్పింది 31 వేల కోట్లు , చేసింది 8 వేల కోట్లు. 16 నెలల కాంగ్రెస్ పాలనా కాలంలో అప్పులు కట్టడానికి 88,564 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని 7 గంటల 44 నిమిషాలకు చెప్పారు. సీఎం ఇదే విషయమై 3.58 నిమిషాలకు ఇదే అసెంబ్లీలో తాము 1,53,359 కోట్లు అప్పులు, మిత్తీల కింద చెల్లించామని చెప్పారు. అంటే నాలుగు గంటల్లోనే ఎంత మారిపోయిందో గమనించాలి. భట్టి ఫైనాన్స్ మినిస్టర్ గా వాస్తవం చెప్పారు. సీఎం బురిడీ కొట్టించి కార్పొరేషన్ అప్పులు కూడా కలిపి చెప్పారు. మీరు అసెంబ్లీలో పెట్టిన కాగ్ రిపోర్టు 12వ పేజీలో కూడా అదే చెప్పారు.
మొత్తానికి సీఎం చెప్పింది తప్పు అని భట్టి చెప్పారు.. ఫామ్ బీ-5 ప్రకారంగా, కాగ్ రిపోర్టు ప్రకారంగా బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు 5 లక్షల 17 వేల కోట్లు అని చెప్పింది, అందులో ప్రభుత్వం కట్టని కార్పొరేషన్ అప్పులు, గత ప్రభుత్వ అప్పులు తీసేస్తే 4 లక్షల 18 వేల 284 కోట్లు మాత్రమే (ఎప్ఆర్బీఎం, కాళేశ్వరం, మిషన్ భగీరథ కలిపి)
భట్టి పెట్టిన బడ్జెట్ ప్రకారంగా చూసినా 4,22,674 కోట్లు మాత్రమే. బీఆర్ఎస్ హయాంలో అప్పు ఏటా 42 వేల కోట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో చేసిన అప్పు 1 లక్షా 48 వేల కోట్లు అని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *