- జిఎస్టీతోనే బిజెపి సామ్రాజ్యం పతనం ఖాయం
- అన్నదాతలు ఆగం అవుతున్నా పట్టింపు లేదు
- అధికార పక్షం ఎంతగా నిర్లిప్తంగా ఉందో.. విపక్ష పార్టీలు కూడా అంతే నిర్లిప్తతో ఉన్నాయి.
- కేవలం అధికారం కోసం తప్ప, ప్రజల కోసం పోరాటం చేసే పార్టీలు కరువయ్యాయి…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎప్పుడూ ..ఎలాంటి చర్చా జరగకుండా ముగుస్తున్నాయి. ఇటీవలి సమావేశాలు కూడా అలాగే ముగిశాయి. ఇందులో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉందో, విపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంది. అంబేడ్కర్‌కు అవమానం అంటూ కాలయాపన చేసి సమావేశాలను ముగించారు. ఇకపోతే అధికార పక్షాన్ని నిలదీసే క్రమంలో విపక్షాలు ప్రజాసమస్యలను పూర్తిగా విస్మరించాయి. తమ ధోరణిలోనే పోరాటాలు సాగిస్తున్నాయి. ఇందులో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టామన్న ఆనందం కోసం చేస్తున్నదే తప్ప మరోటి కాదు. పెరుగుతున్న నిరుద్యోగం, ధరలు, జిఎస్టీ వాతలు, రూపాయి పతనం, ద్రవ్యోల్బణం వంటి విషయాల్లో అధికార పక్షాన్ని నిలదీయలేకపోయారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలను చర్చించడం లేదు. చర్చించాలన్న ఆసక్తి అధికార, విపక్షాలకు లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే..అల్లు అర్జున్‌పై కేసు గురించి మాట్లాడుతున్న బిజెపి నేతలు ప్రజల సమస్యలపై మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పాలనపై విమర్శలుచేస్తున్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలు తమ డొల్ల గురించి మాట్లాడడం లేదు. రాష్ట్రానికి ఏద్కెనా మంచి చేయాలన్న ఆలోచనతో లేరు. మోదీ అధికారం చేపట్టాక గత దశాబ్దకాలంగా ధరలు, పన్నులు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు భారతీయులను అతలాకుతలం చేస్తున్నాయి. మోదీ అధికారం చేపట్టాక ధరలు, జిఎస్టీ, నిరుద్యోగం వంటివన్నీ దాడి చేస్తున్నాయి.
అన్నదాతలు ఆగం అవుతున్నా పట్టింపు లేదు. అధికార పక్షం ఎంతగా నిర్లిప్తంగా ఉందో విపక్ష పార్టీలు కూడా అంతే నిర్లిప్తతో ఉన్నాయి. కేవలం అధికారం కోసం పోరాటం తప్ప, ప్రజల కోసం పోరాటం చేసే పార్టీలు కరువయ్యాయి. విపక్షనేత రాహుల్ గాంధీకి దేశ సమస్యలపై పెద్దగా అవగాహన లేదు. దీంతో ఆయన కేవలం పత్రికా ప్రకటనలు, పోజులకే పరిమితం అవుతున్నారు. అందుకే పార్లమెంటులో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. వీరికి తగిన మార్గనిర్దేశనం చేసేవారు కూడా లేకుండా పోయారు. అందుకే తదుపరి అధికారం లక్ష్యంగా కాంగ్రెస్ తన పోరాట లక్ష్యాలను అమలు చేస్తోంది. కేవలం మోధీని లక్ష్యంగా చేసుకుని మాత్రమే కార్యాచరణ ఉంటోంది. ఇందుకు ప్రతిపక్ష పార్టీల నేతలంతా తానా అంటే తందానా అన్న చందంగా రాజకీయాలు సాగిస్తున్నారు. భారత ప్రజాస్వామ్యానికి పట్టిన చీడగా దీనిని భావించాలి. ప్రతిపక్ష బాధ్యత సక్రమంగా, బలంగా ఉంటే అధికారపక్షాన్ని నిలదీయ వచ్చు. కానీ అలా జరగడం లేదు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలనే తీసుకుంటే విపక్షాల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ, ఆవరణలోనూ చోటు చేసుకున్న సంఘటనలు సభ్యసమాజాన్ని విస్తుపోయేలా చేశాయంటే అతిశయోక్తి కాదు. అధికార, విపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగడమే కాదు, ఈ ఆందోళనలు శ్రుతిమించి పార్లమెంటు ప్రాంగణంలో సభ్యులు ఒకరినొకరు తోసుకోవడం, కొందరు గాయాలపాలు కావడం.. దరిమిలా పోలీసు స్టేషన్లకు వెళ్లి పరస్పరం కేసులు పెట్టుకోవడం చూసాం.
వీరంతా మన ప్రతినిధులు అని చెప్పుకోవడానికి మనమంతా సిగ్గుపడాలి. ప్రజలకు మేల్కెన పాలన అందించేలా పార్లమెంటులో సమస్యలపై చర్చించాల్సిన ఎంపిలంతా ఆందోళనతో సమావేశాల విలువైన సమయాన్ని హరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ను కేంద్ర బిందువుగా చేసుకుని ఎవరికి వారు పైచేయి సాధించాలని పోటీపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో మాట్లాడుతూ అంబేడ్కర్ పేరును పదే పదే జపించే బదులు, దేవుడిని తలచుకున్నా ఏడేడు జన్మల స్వర్గప్రాప్తి లభించేదంటూ వ్యాఖ్యానించారు. ఇది అంబేడ్కర్ ను అవమానించడమేనని కాంగ్రెస్ సభ్యులు ఆ మరునాడు సభలో ధ్వజమెత్తారు. ఇందుకు అమిత్ షా క్షమాపణ చెప్పడంతోపాటు, రాజీనామా చేయాలని పట్టుబట్టడంతో గలభా మొదల్కెంది. అంతటితో ఆగని విపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. ప్రతిపక్ష సభ్యుల దాడిని అడ్డుకునేందుకు అధికారపక్ష సభ్యులు.. హోం మంత్రి ప్రసంగంలోని కొన్ని పదాలను మాత్రమే తీసుకుని కాంగ్రెస్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందంటూ ఎదురుదాడి మొదలుపెట్టడంతో పరిస్థితి వేడెక్కింది. ఇక ఇంతటితో ఇది ఆగడం లేదు. అంబేడ్కర్‌కు అవమానమంటూ దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. వారంపాటు ఉద్యమిస్తామని పేర్కొంది.
నిజానికి నిర్మలా సీతారామన్ మరోమారు కొన్ని వస్తువులపై జిఎస్టీ వడ్డించారు. ఇన్సూరెన్స్ పథకాలపై జిఎస్టీ నిర్ణయాన్ని వాయిదా వేశారు. వీటిపై విపక్షాలకు కొంచెం కూడా చురుకు అంటడం లేదు. ఈ జిఎస్టీ వడ్డింపుల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జిఎస్టీ బాదుడు ఇక ఆగదన్న రీతిలో నిర్మలా సీతారామన్ నిర్ణయాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో మోధీ పతనం దీంతోనే ప్రారంభం అయ్యిందని చెప్పవచ్చు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కొద్దిగా తమ రుచి చూపారు. జిఎస్టీపై చర్చించి ప్రజలపై భారం పడకుండా చూసుకోవాల్సిన మోదీ అలా ఆలోచించడం లేదు. దీనిని బ్రహ్మపదార్థంగా ప్రచారం చేసుకుంటున్నారు. 18శాతం వరకు జిఎస్టీ కారణంగా ప్రజలపై ప్రత్యక్ష భారం పడుతోంది. అంతిమంగా ప్రతి పన్నుకు ప్రజలే బాధితులు. ఇది వ్యాపారులపై భారం పడదన్న ఇంగితం లేని పాలకులు మనకు దాపురించారు. దీనిపై విపక్షాలు పోరాడడం లేదు. ఇన్సూరెన్స్‌లపై జిఎస్టీ బాదుడుపై ప్రస్తావించినా పట్టించుకోవడం లేదు. నిజానికి జిఎస్టీని సవిరీక్షించకుంటే హనుమంతుడి తోక లంకను తగులబెట్టిన చందాన, బిజెపి సామ్రాజ్యాన్ని జిఎస్టీ తగులబెట్టడం ఖాయం.
-కందుల శ్రీనివాస్
(సీనియర్ జర్నలిస్ట్)