భూమిని తొడిగిన మొక్క ఒక దిగ్దర్శనం
విలోమానుపాతంగా విలీనం అంచుల్లో
ఒకే రంగు కల పొదిగి పొదిగి వెచ్చని
గడ్డిలోంచి అనేకానేక వర్ణపు రెక్కలతో
బూడిదరంగు ఆకాశంలోకి అనంతాస్పృశ్యం
అసాధారణ మానసికం జారుడు పదార్థంలోంచి
పక్కున పగిలి ఉదారంగు గుడ్డుగా దొర్లినా
మొన్న మిగిలిన మాటల గీతలు
ఏ కోణమానినిలో పొసగక విఫలయత్నం
కార్చిచ్చుల కాలిబాట ఉరితాడై మిగిలే
వెరసి ముడుల ముళ్ళ కోలాహలం
ఒక నెమలిరంగు అరచేత్తో విప్పబడే చర్య ఉదాత్తం
దిక్కులు అదృశ్యావస్థలో ఆ మెదడు అగాధంలో
ఏ వార్నిష్ రంగు తలుపులోంచో బయటికొచ్చే వేళ
ఎన్నో మట్టి కాళ్ళు మొరటు చేతులు గారల పళ్ళు
పసుపు కళ్ళు పగిలిన ఎండిన పెదాలు
ఇంకా అద్భుతమైన ఆశగుండెతో
అంగలారుస్తూ ఒక తైలవర్ణ చిత్రం
మైదానానికి తాకని చెట్టు దాని కొమ్మకు వేళాడుతూ
అది అధివాస్తవిక కృత్యం
ఆ కవికి కలనుకూడా పొందికగా కలకనడమే యుద్ధం
దాన్ని చిత్తు చేస్తూ వలస పక్షుల అస్తవ్యస్తపు రాక
గురుత్వ త్వరణం లేకుండా విసిరేయబడుతున్నట్టు
ఆ గుండెలోకే పొడుస్తూ దూసుకొస్తున్నట్టు తీవ్ర వడితో
స్వాప్నిక కళ్ళు తెరుచుకున్నవి భరించలేక
వెండి మబ్బుల మధ్య సిల్వర్ బ్లూ రంగు వద్ద
ఒక ప్రతిధ్వనించే గట్టి చిగురు ప్రత్యక్ష్యం
నాగలి హారం తలపాగా మీదుగా
మెడకు వేళాడే సుప్తావస్థలో
పిడికిట్లో వడ్ల ముద్దతో “రైతే రాజు” అన్న
పాట కోరస్ గొంతులోంచి ప్రారంభం
రంగస్థలంపై దీపాల ఆర్పివేత
ఇది సరికొత్త స(వి)శేషం!
– రఘు వగ్గు