అట‌వీ శాఖ అనుమ‌తులు మంజూరు చేయండి..

కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి
న్యూదిల్లీ,ప్రజాతంత్ర, జనవరి16 :  తెలంగాణ‌లో చేప‌డుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రితో దిల్లీలో  ఆయ‌న కార్యాల‌యం ఇందిరా ప‌ర్‌ర‌ణ్ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి .రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప‌లు అంశాల‌ను సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అట‌వీ శాఖ అనుమ‌తులు రాక‌పోవ‌డంతో తెలంగాణ‌వ్యాప్తంగా 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయ‌ని వివ‌రించారు.

38 ప్రాజెక్టుల‌కు వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టాల పర‌మైన అనుమ‌తులు మంజూరు చేయాల‌ని సీఎం కోరారు. ఈ ప్రాజెక్టుల్లో అత్య‌ధికం రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, వామ‌ప‌క్ష తీవ్ర‌వాద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఉన్నాయ‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అనుమ‌తులు రాక‌పోవ‌డంతో జాతీయ ర‌హ‌దారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో ట‌వ‌ర్ల నిర్మాణం, పీఎంజీఎస్‌వై, పొరుగు రాష్ట్రాల‌ను అనుసంధానించే ర‌హ‌దారుల నిర్మాణ ప‌నులు నిలిచిపోయాయ‌ని కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గౌర‌వెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన అనుమ‌తుల విష‌యాన్ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు.

ఆయా ప‌నుల‌కు వెంట‌నే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తికి కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ సానుకూలంగా స్పందించారు. ముఖ్య‌మంత్రి వెంట రాష్ట్ర అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖ‌, రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మ‌హ‌బూబాబాద్ ఎంపీ బ‌ల‌రాం నాయ‌క్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (మౌలిక వ‌స‌తులు) శ్రీ‌నివాస‌రాజు, పీసీసీఎఫ్ డొబ్రియ‌ల్‌, తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ త‌దిత‌రులున్నారు.

 ఆర్టీసీ బ‌స్సుల‌ను ఈ -మోడ‌ల్‌లోకి మార్చేందుకు స‌హ‌క‌రించండి…
కేంద్ర మంత్రి కుమార‌స్వామికి ముఖ్య‌మంత్రి విన‌తి
హైద‌రాబాద్ న‌గ‌రంలోని వంద శాతం బ‌స్సుల‌ను ఎల‌క్ట్రిక్ మోడ‌ల్‌లోకి మార్చేందుకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్‌.డి.కుమార‌స్వామికి ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ఆయ‌న కార్యాల‌యంలో సీఎం గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. పీఎం ఈ-డ్రైవ్ ప‌థ‌కం కింద జీసీసీ ప‌ద్ధ‌తిలో బ‌స్సులు కేటాయించాల‌ని ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపినట్లు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం ఉన్న డీజిల్ బ‌స్సుల‌కు ఎల‌క్ట్రిక్ కిట్ అమ‌ర్చి రిట్రో ఫిట్మెంట్ ప‌ద్ధ‌తిలో ఎల‌క్ట్రిక్ బ‌స్సులుగా మార్చేందుకు అవ‌కాశం ఉన్న విష‌యాన్ని కేంద్ర మంత్రి కుమార‌స్వామి దృష్టికి సీఎం ఏ.రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.

హైద‌రాబాద్‌కు కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించే 2,800 బ‌స్సుల‌ను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్ మోడ‌ల్ కింద కేటాయించాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. ముఖ్య‌మంత్రి వెంట రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్, రాష్ట్ర మంత్రులు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, న‌ల్గొండ‌, మ‌హ‌బూబాబాద్ ఎంపీలు ర‌ఘువీర్ రెడ్డి, బ‌ల‌రాం నాయ‌క్‌, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ఆర్ అండ్ బీ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (మౌలిక వ‌స‌తులు) శ్రీ‌నివాస‌రాజు, తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ త‌దిత‌రులున్నారు..

కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌లు, ఉక్కు శాఖ స‌హాయ మంత్రి భూప‌తిరాజు శ్రీ‌నివాస వ‌ర్మ‌ను ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆయ‌న కార్యాల‌యంలో గురువారం సాయంత్రం మ‌ర్యాదపూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించి ప‌లు అంశాల‌పై ఆయ‌నతో చ‌ర్చించారు. ముఖ్య‌మంత్రి వెంట రాష్ట్ర మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, న‌ల్గొండ‌, మ‌హ‌బూబాబాద్ ఎంపీలు ర‌ఘువీర్ రెడ్డి, బ‌ల‌రాం నాయ‌క్ త‌దిత‌రులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page