కవులు, కళాకారులను ప్ర‌భుత్వం గౌరవిస్తుంది

– జయ జయహే ద్వారా ప్రజలను ఏకం చేసిన అందెశ్రీ‌
– సాంస్కృతిక, సామాజిక పురోగతికి కృషిచేసిన ఆయ‌న కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
– శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌నవ‌రి 3ః జయ జయహే తెలంగాణ గీతం ద్వారా రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అందెశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అందెశ్రీగా పిలుచుకునే అందే ఎల్లయ్య సిద్దిపేట జిల్లా రేపర్తి గ్రామంలో జ‌న్మించార‌ని, ఆయ‌న పశువుల కాపరిగా ఎన్నో కష్టనష్టాలకోర్చి గీత రచయితగా ఎదిగారని వివ‌రించారు. ఎలాంటి విద్య లేకున్నా తెలంగాణ గ్రామీణ, అణ‌గారిన వర్గాలను ప్రతిబింబించేలా ఆయన మూడువేల కవితలు రచించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, పోరాటాలు వాటి స్ఫూర్తిని తెలియజేస్తూ ఉద్యమ సమయంలో ఆయన రచించిన జయ జయ తెలంగాణ గీతం రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిందన్నారు.  ఆయ‌న‌ విప్లవాత్మక కవితలు భావోద్వేగంతో కూడిన గేయాలు కార్మికులు, రైతులు, అణగారిన వర్గాలను ప్రభావితం చేయడమేకాక వారి పోరాటాలను వ్యక్తీకరించాయ‌ని, తెలంగాణ సంస్కృతికి స్వరంగా నిలిచాయ‌ని భట్టి విక్రమార్క చెప్పారు. ఆయ‌న‌ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేయాలని 2024 జూన్ 2న 783 జీవో ద్వారా ఆమోదించిందని తెలిపారు. ఈ చర్య తెలంగాణ ఐక్యత, పురోగతికి తన జీవితాన్ని అంకితం చేసి సాంస్కృతిక‌ ప్రతీకగా నిలిచిన అందెశ్రీని గుర్తించి గౌరవించిదని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జయ జయ గీతాన్ని పెద్ద ఎత్తున వాడుకొని రాష్ట్రం వచ్చినాక ఆనాటి పాలకులు ఆ గేయాన్ని, మనిషిని వదిలేసింది చూశాం అని భ‌ట్టి అన్నారు. త‌మ‌ ప్రభుత్వం ఏర్పడగానే ఆ గేయాన్ని అధికారిక గేయంగా ప్రకటించడమే కాక వారిని ఏ రకంగా గౌరవించుకున్నామో రాష్ట్ర ప్రజలందరూ చూశారన్నారు.

దురదృష్టవశాత్తు అందే శ్రీ మన మధ్య లేకపోవడాన్ని చింతిస్తూనే వారి గౌరవాన్ని పెంపొందిస్తూ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని వారు రాసి, పాడిన పాట స్ఫూర్తితో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని తెలిపారు. మానవత్వంతో ఈ ప్రభుత్వం అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యతగా భావించి వారి కుమారుడు దత్తసాయిని ఉన్నత విద్యా శాఖలో డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా 25 నవంబర్ 2025న ఆర్డినెన్స్ 7 ద్వారా ఉద్యోగ నియామకం చేశామని భట్టి  తెలిపారు. ఆ ఆర్డినెన్స్ ఈరోజు అందరిచేత ఏకగ్రీవంగా ఆమోదం పొంద‌డం హర్షణీయమ‌న్నారు. అందెశ్రీతోపాటు పొడుస్తున్న పొద్దు మీద పాటతో తెలంగాణ సమాజాన్ని ఉవ్వెత్తున లేపి రాష్ట్ర సాధనకు ఏ విధంగా గద్దర్ ఉపయోగపడ్డారో కూడా అందరికీ తెలిసిన విషయమేన‌న్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాటి సీఎంను కలవడానికి గంటలతరబడి ఎండలో నిలబడినా ఆయ‌న‌కు గత ప్రభుత్వం అవకాశం కల్పించలేదని, ఈ ప్రభుత్వం వచ్చాక వారిని ఏ విధంగా గౌరవించుకుందో తెలంగాణ సమాజానికి తెలియంది కాదని అన్నారు. గతంలో సినిమా ఇండస్ట్రీ లో ఇస్తున్న నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డ్స్ గా నామకరణం చేశామ‌ని, ఉద్యమ సమయంలో సేవలందించిన పాశం యాదగిరి, జయరాజు, గూడ అంజన్న, గోరటి వెంకన్న వంటి వారిని సాంస్కృతిక శాఖ ద్వారా గుర్తించామ‌ని, త‌మ‌ ఆటపాటల ద్వారా తెలంగాణ ప్రజల కోరికలను తెలియజేశారని భట్టి విక్రమార్క తెలిపారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page