మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ డిమాండ్
భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 26 : ఆదివాసీ ప్రజల హక్కుల కోసం జల్, జంగల్, జమీన్ ఉద్యమానికి నాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కొంరంభీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోని సుమారు 339 గ్రామాలను, ప్రజలను ఖాళీ చేయించాలని తెచ్చిన జీ.వో. నెం.49 రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు. ఈ జీవో 49 ఉద్దేశ్యం పులుల కోసం కాదు అనేది వాస్తవమనిొ, ఇది మానవ పులులైన మోదీ, అమిత్ షా మానసపుత్రులైన అదాని, అంబాని, కార్పొరేట్ సంస్థల కోసమే అనేది అందరూ గమనించాలని కోరారు. వేల సంవత్సరాలుగా అడవిని, అడవిలోని అన్ని రకాల జంతువులను కాపాడుతూ సహజీవనం చేస్తున్న మూలవాసులను అడవికి దూరం చేసి వారి జీవనాన్ని, సంస్కృతి సంప్రదాయాలను మరీ ముఖ్యంగా అటవీ సంపదను కొల్లగొట్టడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల్లో 3 జిల్లాలు పూర్తిగా కనుమరుగవుతాయన్నారు. కొమరంభీం జిల్లా, ములుగు జిల్లా, భóద్రాద్రి జిల్లాలు తెలంగాణ చిత్రపటంలో ఇక కనపడవని, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాల్లో సుమారు 10 నియోజకవర్గాలు రానున్న రోజుల్లో వాటి ఊసే ఉండదని పేర్కొన్నారు. భారతదేశంలోని మైదాన ప్రాంతాలు, చెరువులు, నదులు, కొండలు, గుట్టలు మెదలగు వాటిని సర్వనాశనం చేసిన దోపిడీదారులు ఇక రాజ్యాంగంలోని 5, 6వ షెడ్యూల్ ప్రాంతాలను, సంపదను దొంగిలించడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం జంతు సంరక్షణ, పర్యావరణం పేర్లతో ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను అడవి నుండి వెళ్ల్లగొట్టడానికి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో వారిని చిత్రహింసలకు గురిచేస్తూ చంపుతున్నారన్నారు. టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని సిర్పూర్ (యు), వాంకిడి, జైనూర్, కెరమేరి, ఆసిఫాబాద్, రెబ్బన, కాగజ్నగర్, నార్నూర్, సిర్పూర్(టి), చింతలమానేపల్లి, గాజుగూడ, బెజ్జూర్, లింగాపూర్, పెంచికలపేట మొదలగు మండలాల ప్రజలను ఖాళీ చేయించేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని జగన్ అన్నారు. ఇప్పటికే ఈ అనాలోచిత నిర్ణయాల పట్ల ఐక్య రాజ్యసమితి నిపుణులు, మానవహక్కుల విభాగం భారత ప్రభుత్వానికి ఈ ప్రయత్నాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారన్నారు..