గాయాల పరిమళం…

మూడు దశాబ్దాలుగా ఆత్మ విశ్వాసంతో నిబద్ధత కలిగిన కవిత్వం రాస్తున్న కవి బెల్లంకొండ సంపత్‌ కుమార్‌. స్వేచ్ఛాయుతమైన భావాలతో, సమ సమాజ స్థాపన లక్ష్యంగా మలుచుకున్న తీరుకు అద్దం పట్టే కవితలతో ఒక వేకువ కోసం సంకలనాన్ని ఆయన వెలువరించారు. నిబద్ధత, నిజాయితీ,సరళత,సూటిదనం, సున్నితత్వం కలిగిన ఆయన కవిత్వం ఎన్నో అంశాలను, సంఘటనలు, సందర్భాలు, వైరుధ్యాలు, వాద వివాదాలు, ధోరణులు, ఉద్యమాలు ఇలా ఎన్నింటినో గర్భీకరిం చుకుంది. మొత్తం 67 కవితలు ఇందులో ఉన్నాయి.

ఆ తమ్ముడు వస్తాడు/ ముంజేతికి ఆకలి పేగులు చుట్టుకొని అని మొదటి కవిత హోటల్‌ బాయ్‌ లో పేదరికం మిగిల్చిన వ్యధను కన్నీటి తడితో  చెప్పారు. బ్రహ్మ జె మ్ముళ్ళు  , నాగజెముళ్ళను తొక్కేసే శక్తిని పెంచుకొని చిమ్మ చీకట్ల ఊబి నుంచి ఆ తమ్ముణ్ణి బయటకు రమ్మన్నారు. చెమ టోడ్చినా  కడుపు మాడే  మాపటికి లేని బతుకు ఇంకెంత కాలమని ప్రశ్నిస్తారు. జనం అంటే ఒక వైపు కళ /ఒక వైపు పోరాటమని అర్థం చెప్పారు. నిలువెల్లా గాయాల నెమలి లాంటి బతుకు ఎలాగైనా ఆశయమై  వెల్లివిరియాలని తెలిపారు. వడ్లలా రాలిపోకుండా మనిషి ఎలాగైనా చిగురించి మొలకెత్తక తప్పదు అన్నారు. గోడలు కవితలో తరతరాల దుష్ట సంస్కృతికి తలకొరివి పెట్టి సామాన్యుని బతుకు బాటని సరళం చేయాలని చెప్పారు. ఆకలి స్వప్నాల్లోంచి సూర్యుళ్లు ఉదయిం చాల న్నారు. మాంజా దారం కవితలో మంచి తనాన్ని బలహీనంగా భావించే వ్యవస్థ పట్ల జాగ్రత్తగా ఉండాలని మనిషికి సునిశితంగా  హెచ్చరిక చేశారు.

ఉదయించడమే మనిషి కర్తవ్యం అవ్వాలని స్పందనేరా జీవితం అన్న కవితలో చెప్పారు. భోగితో పీడ ఎగిరిపోవాలన్నారు. తెలంగాణమే తన గానం ఊపిరి అని తెలిపారు. కళ్లెదుటి కరువుతో భూమి ఎడాం వుతుంటే మృతి రేఖలు కనిపిస్తాయన్నారు.  మొర కవితలో గుడిసెలు కాలుతుంటే / గుండెల మీద టైలు సవరించుకోవడం తన వల్ల కాదంటారు. నదులను సమానం చేసి గంగను విడిస్తే చెమట చుక్కలు కోటి సూర్యుళ్లను, రత్నాలను పండిరచి బతుకు దివ్వెలను  వెలిగిస్తాయన్నారు. ఆశల పొద లోకి సుడిగాలిరేపి / వసంతం ఆకురా లుస్తున్న వారెవరని  ప్రశ్నించారు. ఆకలి భారతంలో దొరకని అన్నం మె తుకు గురించి చెప్పారు. క్షణమైనా గుండె కదలిక పొందకపోతే అది మనిషి జడత్వ రోగ లక్షణమే అన్నారు.

గోడమీది గడియారం కవితలో ఆశయం విశ్వజనీయమైతే చాలు / ఆరాటం నించే / శిశువు/ పురుడు పోసుకుం టుందని స్పష్టం చేశారు. భాష వైవిధ్యాల భ్రమల పడిపోయి కాటుకై కారిందని నిర్వేదం చెందారు. దేహపు తడి ఆరుతున్న మొక్కవోని ధైర్యంతో ప్రళయభేరిని మ్రోగించమని చెప్పారు. చిరునామాలేని మనిషికి కుడియడమై దారి చూపే అస్తిత్వం అమ్మ ఒడి అన్నారు. చెట్టు చెడు కాలానికి కవితలో తను చీదుతున్న చీమిడిలో తనే జారి పడుతూ / బతికి చచ్చిన వాళ్లు / బతకడం కష్టం  అని కాస్త ఘాటుగా చెప్పారు. గుండెలు పిండే తలెను పరిచయం చేశారు. హృదయ మమకారాల రేకులు విప్పుకొని ప్రేమ ప్రేమను ప్రేమిస్తుందని తెలిపారు.  భిన్న ధ్రువాల మధ్య బతకాలని, శీతోష్ణాలకు తట్టుకునే కవాటాలను అన్వేషించాలని సూచించారు. జీవన పరి మళానికి ఉద్యమ బీజమే సూత్రమన్నారు. ఆశ కారు చీకటిలో కాగడా వంటిదని నిర్వచించారు. పిరికితనం ఫోబియా దూరమైతేనే మనుగడ ఉంటుందని తేల్చారు. ఆకలి- అన్నం- అభివృద్ధి పదాల మధ్య యుద్ధానంతర శాంతి సందేశాన్ని వినిపించారు.

తెరచాప మొసళ్ళు/ దిగజారి/ జారుస్తుంటాయి జాగ్రత్త అని అసాధ్యుడు కవితలో హెచ్చరించారు. ఉద్యమమే గొప్ప ఆయుధం అన్నారు. తెల్లని శాంతి పావురాల పరిమళానికి భారత ఖండం నిలయం కావాలని ఆకాంక్షించారు. భాషకు  భూమి గరిమనాభి అన్నారు. హృదయ వైకల్యాలను జయించేందుకు విశ్వ మానవుని చేతిరాత చారిత్రాత్మక తీర్పును ఇవ్వబోతుందని చెప్పారు. ఆరుద్ర పురుగులు అలసిపోవని మెతుకు ప్రసారానికి నిరంతరం చినుకులై రాలుతుంటాయని ప్రకటించారు. గోడ మించి గూడు తడిమి పొడుచుకొచ్చిన వెచ్చని సూర్య కిరణమే జీవనోద్యమ  సంకే తం అని తెలిపారు. చిమ్మ చీకట్లను నేలకొ రిగించే పరిమళ స్వప్నం కోసం ఎదురు చూశారు. విద్యార్థి దశలోనే జీవితమంటే ఏమిటో బోధపడాలని చెప్పారు. అస మానమైన కథా యానంలో ప్రతిదీ ఒక మజిలీ మాత్రమేనని తెలిపారు. నేను కి మనకి మధ్య తరాల యుద్ధం జరుగుతూనే ఉందని చెప్పారు. మండే సూర్యుడిలో నిక్షిప్తమై ఉన్న ఆకలి సొమ్మను గమనిం చమంటారు. మూసిన గేట్లను తెరిచి రూపు రేఖలు మార్చి వెళ్దాం అని పిలుపునిచ్చారు. కవిత్వంలోనూ తన కవాతును చూపిస్తానని ధీమాగా చెప్పారు. పావురాల రెక్కలలో కాంతిని చూడు అన్నారు. ఒక నెత్తురు జీర ఎప్పుడూ ఓడుతున్నదని వేదన చెందారు. ఎదురింటి దూలానికి యేలాడిన ఉరితాటిని శాస్త్రం ప్రశ్నించమన్నది అనడంలో  మహి ళల ఆరళ్లను ప్రస్ఫుటంగా  చెప్పారు. చప్పుడు చేయకుంటే ఒక్కటైనప్పటికీ బతు కమ్మలు కూడా  బతకలేవు,బట్ట కట్టలేవు అని హెచ్చరిస్తారు. సంఘర్షణ ఎప్పుడూ ఘనీభవించదు అని అన్నారు.

గాయం కర్తవ్యమైన వేళ పరిమళించే లక్ష్యాలు పదిలంగా మనిషికి అందుతాయని చెప్పారు. నేటి గాయం రేపటి యుద్ధం అని తేల్చారు. అపనమ్మకం కాలిపోవాలని చెప్పారు. గరకలా గాలికి వంగడం / సులుకు బరిగలా సోయి తెల్పడం అవసరమన్నారు. నాకు మానవాతీత మార్మికతలు లేవు / మనిషిగా బతకటం ఒక్కటే తెలుసు అని చెప్పారు. ముద్దుల చీకటి నేలకూలంగా సంధ్యాకాశం ముస్తాబవుతుందని  ఎంతో సృజనాత్మకంగా చెప్పారు. నీతి, రీతి నీడ లాంటివని అన్నా రు. కొండ చరియలు కవాతు లవు తాయి జాగ్రత్త అని ఇన్‌ బాక్స్‌ లో ఒక పిక్చర్‌ మిసేజ్‌ అన్న కవితలో చుర కలాంటించారు. నాణెం నయగారా బావిలో కప్పలమవుతూనే ఉన్నాం అని చెప్పి సరళీకృత యుద్ధానికి శాంతి పావురాలు అయిన ప్రజలను ఇప్ప టికైనా వాస్తవాలను జాగ్రత్తగా ఆలోచిం చమన్నారు. హోళీ కామ దహనానికి కట్టే, పిడకలేసి రగిలిస్తే పాటల మంట ఉవ్వెత్తున  ఎగజిమ్మాలని చెప్పారు. దుఃఖపు వర్షాల ఉప్పునీటి ఉటగా  అమ్మను చెప్పారు. సుదీర్ఘ ఆశల తుట్టెలో ఎన్నో తేనె బొట్లను పొదు గుకున్న ముసలి మంచం రంధి పాడుతు న్నదని అన్నారు.

సమాజం వీపు మీద రాచపండును రుజువు చేసేందుకు వ్యాకరణ శాస్త్రాల అక్కర్లేదని చెప్పారు. కనురెప్ప కాటేస్తే కలల గూడే చెదిరిపోయిందని వేదనపడ్డారు. కాలే భూమి పెనం మీద అనాధ హృదయం పేగులు కదిలిపోతుంటయని హృదయ విదారకంగా చెప్పారు. ఎన్ని కాళ్లు ఉప్పెనలవుతున్నాయో, ఎన్ని స్వర పేటికలు ఉరుముతున్నాయో  అని కవి మనిషి పక్షాన  యుద్ద గీతికను మ్రోగించారు. ఇది అణచి వేతలను నిలేసి ప్రశ్నించి భావనా పరమైన చైతన్యంతో జీవన పరిమళమై వ్యాపించిన కవిత్వం. ప్రత్యక్ష అనుభవాలు రాల్చిన పసిడి గింజలే ఈ సంపుటిలోని కవితలు. కనకా ంబరాల విత్తులే చిట్లిపోతాయి అనుకుంటే నిలువునా చీల్చుకునే బీజం అనుకేంద్రక సమ్మేళనాలలో ఎన్ని వలయాలు ఉంటాయో పసిగట్టమన్న ఈ కవి కవిత్వంలో భవి ష్యత్తును అంచనా కట్టగలిగిన  బలత్తరమైన శక్తి స్పష్టంగా వ్యక్తమైంది.
 ` డా. తిరునగరి శ్రీనివాస్‌
   9441464764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page