– పెరిక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని, వారి విధుల విషయంలో కూడా స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ బీసీ కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని, వీటి ద్వారా ఆయా కులాల అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని వెల్లడించారు. పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్‌గా దొంగరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్‌గా బుడగం శ్రీనివాస్‌లు హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌లో శుక్రవారం పదవీ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా మాట్లాడారు. బీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమ శాఖ ద్వారా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తూనే వివిధ కుల కార్పొరేషన్ల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. అన్ని కార్పొరేషన్లకు తప్పక నిధులు కేటాయిస్తామని, వారు ఆ నిధులను ఎలా ఖర్చు చేయాలి, కార్పొరేషన్ బాధ్యతలు ఏమిటి అనే విషయంలో స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పెరిక కులం అందరికీ ఆదర్శంగా నిలిచే కార్యక్రమాలు చేస్తున్నదని అభినందించారు. సమైక్యంగా ఉండడంతోపాటు 50 ఏళ్లకు పైగా విద్యార్థుల కోసం హాస్టల్ నిర్వహిస్తున్నదని, కొత్తగా బాలికల హాస్టల్ కూడా నిర్మిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. కోకాపేటలో కూడా పెరిక కులస్తులు స్వయంగా విరాళాలతో ఆత్మగౌరవ భవనం నిర్మించుకుంటున్నారని, దీనికి తప్పక ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి, మద్దా లింగయ్య, వీర భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




