రేవంత్‌రెడ్డిని చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు
రైతులకు ఇచ్చిన హావిూలను అమలు చేసి చూపాం: తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: రాష్టాన్న్రి విధ్వంసం నుంచి వికాసం వైపు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకెళ్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. రేవంత్‌రెడ్డిలా వ్యవసాయంపై ఇంత సాహసోపేతమైన నిర్ణయం ఎవరూ తీసుకోలేదని అన్నారు. కొంతమంది బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు రేవంత్‌రెడ్డిని చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నవారు కూడా తమపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రూ.2లక్షల్లోపు రుణం ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నామని.. అలాగే చేశామని గుర్తుచేశారు. రైతునేస్తం సభలో ఆయన మాట్లాడుతూ..తమను విమర్శించే హక్కు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు లేదని చెప్పారు. బీజేపీ కూడా కేంద్రంలో రూ. 4లక్షలు రుణమాఫీ చేయాలని సవాల్ విసిరారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఐదు నెలల వరకు కూడా రైతుబంధు వేయలేదని.. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా తొమ్మిది రోజుల్లోనే రూ.9వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామని ఉద్ఘాటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 9 రోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తామంటే కొందరు నేతలు నమ్మలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలు తెస్తున్నామని వెల్లడిరచారు. ఏడాది కాలంలోనే రేవంత్ ప్రభుత్వం రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులను మరువబోమని చెప్పారు. తమ ప్రభుత్వం ఇంకా చాలా పథకాలు తీసుకురాబోతుందని ఉద్గాటించారు. సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాతనే తమకు ఓటు వేయమని అడుగుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. నిజంగానే ఈరోజు దేశ చరిత్రలో లిఖించదగిన రోజని తెలిపారు. తొమ్మిది రోజుల్లోనే రూ.9000 కోట్లు రైతుల ఖాతాల్లో వేయడం దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ జరగలేదని చెప్పారు. ’వ్యవసాయం అంటే కాంగ్రెస్. వ్యవసాయం కోసం బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌లు కట్టిందే కాంగ్రెస్. రైతుల కోసం ఉచిత కరెంట్‌ని, గిట్టుబాటు ధరను తెచ్చిందే కాంగ్రెస్. హరిత విప్లవాన్ని తెచ్చిందే కాంగ్రెస్. ఏ రాజకీయ పార్టీ వ్యవసాయం, రైతుల గురించి ఆలోచించలేదు. రైతుల కోసం బీఆర్‌ఎస్ ఏమి చేయలేదు. అందరి ఖాతాల్లో రూ.9000 కోట్లు వేస్తామని చెప్పామని.. అలానే వేశాం అని పేర్కొన్నారు.