ఫార్ములా-ఈ రేసు కేసులో మిగిసిన విచారణ

  • తీర్పు ఇచ్చే వరకు కెటిఆర్‌ను అరెస్ట్ ‌చేయొద్దు
  • మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు

హైదరాబాద్‌, డిసెంబర్ 31(ఆర్ఎన్ఏ): ‌ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ ‌దాఖలు చేసిన క్వాష్‌ ‌పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. కేటీఆర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా .. ఈనెల 30 వరకు అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 27కి వాయిదా వేసింది.

ఆ తర్వాత విచారణ 31కి వాయిదా పడింది. తాజాగా ఇరు వైపులా వాదనలు ముగియగా.. కేటీఆర్‌ ‌పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది. తీర్పు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. ఏసీబీ తరఫున అడ్వొకేట్‌ ‌జనరల్‌ ఎ.‌సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా – ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. బ్రిటన్‌ ‌పౌండ్ల రూపంలో రూ.46 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ – కార్ల రేసింగ్‌ ‌సీజన్‌ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు. దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది.

కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని.. అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిశోర్‌ ‌వాంగ్మూలం సేకరించినట్లు కోర్టుకు తెలిపారు. నిందితులు అరవింద్‌ ‌కుమార్‌, ‌బీఎల్‌ఎన్‌ ‌రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని న్యాయస్థానం అడిగింది. ఇప్పటివరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్‌ అనుమతి తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేశామని ధర్మాసనానికి ఏజీ తెలిపారు. దానకిశోర్‌ ‌తరఫున సీనియర్‌ ‌న్యాయవాది సీపీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పురపాలక శాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. రేసింగ్‌కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్‌ ‌వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page