యూరియా దొర‌క్క రైతులకు ఇక్క‌ట్లు

– బీఆర్ నేత హ‌రీష్‌రావుకు రైతుల‌ మొర‌

క‌డ్తాల్(అచ్చంపేట‌), ప్ర‌జాతంత్ర‌, జూన్ 22: ఆన్‌లైన్ బుకింగ్ పేరుతో యూరియా దొరకక బ్లాక్‌లో కొంటున్నామని, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రేవంత్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని క‌డ్తాల్‌లో రైతులు మాజీ మంత్రి హ‌రీష్‌రావుకు సోమ‌వారం మొర‌పెట్టుకున్నారు. కొనుగోళ్లలో తరుగు, ఆగిపోయిన పాల బిల్లులతో అరిగోస పడుతున్నామని.. కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయామని, మళ్లీ కేసీఆర్ వస్తేనే తమ రాత మారుతుందని రైతు ఎల్ల‌య్య స్ప‌ష్టం చేశారు. హరీశ్ రావు అచ్చంపేట వెళుతూ మార్గమధ్యలో కడ్తాల్ వద్ద ఫెర్టిలైజర్ షాప్ దగ్గర ఆగి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్లయ్య అనే రైతుతో మాట్లాడగా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు పడుతున్న గోస కళ్లకు కట్టినట్లు కనిపించిందన్నారు. యూరియా దొరికిందా అని హరీశ్ రావు అడగగా అసలు యూరియా దొరకడం లేదని ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ బుకింగ్ చేస్తేనే యూరియా ఇస్తామంటున్నారని, తమ దగ్గర ఉన్నవి కీప్యాడ్ చిన్న ఫోన్లు కావడంతో ఆన్లైన్ చేయడం రావడం లేదని అన్నాడు. తీరా షాపు దగ్గరికి వెళ్లేసరికి స్టాక్ అయిపోయిందని చెబుతున్నారని, చేసేదేం లేక బ్లాక్‌లో తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపాడు. అంతేకాక యూరియా కావాలంటే తమకు అవసరం లేని ఇతర మందుల ప్యాకెట్లను కూడా కచ్చితంగా కొనాలని షాపుల వాళ్ళు బలవంతపెడుతున్నారని రైతు వాపోయాడు. ఇక కరెంటు పరిస్థితి గురించి అడగగా కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అసలు అర్థమే కావడం లేదన్నాడు. గత యాసంగిలో వడ్లు, మక్కలు అమ్మినప్పుడు కొనుగోలు కేంద్రాల్లో విపరీతంగా తరుగు తీసి నష్టపరిచారని ఎల్లయ్య చెప్పాడు. అలాగే, పాల బిల్లుల విషయంలోనూ ప్రభుత్వం రైతులను ఆగం చేస్తోందని వివరించాడు. గతంలో నెలకు రెండుసార్లు క్రమం తప్పకుండా వచ్చే పాల బిల్లులు ఇప్పుడు సక్రమంగా రావడం లేదని, ఒక బిల్లు వేసి మూడు బిల్లులు ఆపుతున్నారని, లీటరుకు ఇచ్చే ధర కూడా తగ్గించారని తెలిపాడు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరిగ్గా ఇవ్వకపోగా, రైతుబంధు, బోనస్ లాంటివి కూడా ఎగ్గొట్టిందని హరీశ్ రావు గుర్తుచేయగా తామంతా ఇప్పుడు తీవ్రమైన పరేషాన్‌లో ఉన్నామని రైతులు వాపోయారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకపై మక్కలు, జొన్నలు కొనమని చెబుతోందని, మరి తాము ఏం పంటలు వేసుకోవాలి, ఎలా బతకాలి అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *