- మహిళా కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేయాలి
- మహిళలకు సమానావకాశాలు
- పార్టీకోసం శ్రమించిన మహిళా నేతలకు అండ
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 22: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంక్షేమ పథకాల లబ్ధి ప్రతి ఇంటికీ చేరుతోందని, ఈ అద్భుత ప్రగతిని మహిళా కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మహిళా లోకానికి సమాన అవకాశాలు కల్పించడంతో పాటు, వారిని ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయడమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. గత పాలకుల పదేళ్ల నిరంకుశ పాలనలో పేద ప్రజలు ఇళ్ల కోసం ఎదురుచూసి అలసిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి పేదవానికి ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోందని గుర్తుచేశారు. “గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే. ఈ ఏడాది కూడా నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లు కేటాయించాం. ఇంకా ఎవరైనా అర్హులు ఉండి ఇళ్లు రాకుంటే మా దృష్టికి తీసుకురండి, వారికి తప్పకుండా మంజూరు చేస్తాం” అని హామీ ఇచ్చారు.
పేద పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద వంద రోజుల పని కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు వివరించారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పేద కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వైద్యం కోసం ఇల్లు, భూమి, బంగారం అమ్ముకునే దుస్థితి రాకూడదనే ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా రూ.10 లక్షలకు పెంచామని డిప్యూటీ సీఎం తెలిపారు. దీని ద్వారా పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందుతోందన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందని కొనియాడారు.
గత పదేళ్లుగా పార్టీ కోసం రోడ్లపైకి వచ్చి, ధర్నాలు, ఉద్యమాలు చేసిన ప్రతి ఒక్క మహిళా నాయకురాలికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కష్టపడిన వారి వివరాలు జిల్లాల వారీగా తమ వద్ద ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు అందరికీ సముచిత గౌరవం, పదవులు దక్కేలా చూసే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నేను (ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క) తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో మహిళలు చురుగ్గా పాల్గొని, అర్హుల ఓట్లు పోకుండా చూడాలని కోరారు. పార్టీ వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి ప్రతి బూత్ లెవెల్ కమిటీలోనూ మహిళలకు కీలక ప్రాధాన్యత కల్పిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్య, శాసనసభ్యులు రామదాస్ నాయక్, డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం,, పువాళ్ళ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





