– జంతర్ మంతర్ వద్ద మళ్లీ ఉద్రిక్తతలు
– జాతీయ పతాకంతో జంతర్‌మంతర్ లోకి ప్రవేశించిన సీజేపీ కార్యకర్తలు
– సీజేపీ ముఖ్య నాయకుల నిర్బంధం
– ఇండి కూటమి పిటిషన్‌పై 14 అభ్యంతరాలు
– రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రదర్శనపై రెండు ఎఫ్ఐఆర్ లు
– మహిళా జర్నలిస్టులపై దాడుల ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందన
– నిరసన హక్కుపై దిల్లీ హైకోర్టులో విచారణ
ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | దిల్లీ | అక్టోబర్ 13: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) నిలిపివేత డిమాండ్‌తో కొనసాగుతున్న నిరసనలు మంగళవారం మరోసారి ఉద్రిక్తతలకు దారితీశాయి. దిల్లీలోని చారిత్రక జంతర్‌మంతర్‌ను అధికారిక నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించిన మరుసటి రోజే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు పోలీసు బారికేడ్లను దాటి అక్కడికి చేరుకున్నారు. జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు సీజేపీ ముఖ్య నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండే సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు, సోమవారం రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నిర్వహించిన భారీ ప్రదర్శన అనంతరం సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌కు రిజిస్ట్రీ 14 సాంకేతిక, విధానపరమైన అభ్యంతరాలు తెలిపింది. దీంతో మంగళవారం ఆ పిటిషన్‌పై విచారణ జరగలేదు. నిరసనకారులపై పోలీసు చర్యలు, మహిళా జర్నలిస్టుల నిర్బంధం, మెట్రో సేవల నిలిపివేత వంటి అంశాలు మాత్రం న్యాయస్థానాల్లో విచారణకు వచ్చాయి. మంగళవారం ఉదయం జంతర్‌మంతర్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి సీజేపీ కార్యకర్తలు లోపలికి ప్రవేశించారు. జాతీయ పతాకాలు పట్టుకుని నినాదాలు చేశారు. కొందరు కార్యకర్తలు ఇనుప గేటును ఎక్కి లోపలికి చేరుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యాయి. ఈ సందర్భంగా సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండేతోపాటు ఇతర కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20 మంది నిర్బంధానికి గురైనట్లు సీజేపీ వెల్లడించింది అనుమతి లేని ప్రదేశంలో నిరసన చేపట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు చర్యలు తీసుకున్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.
దేశమంతా జంతర్‌మంతర్ అవుతుంది : అభిజీత్ దీప్కే 
సహచరుల నిర్బంధంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. జంతర్‌మంతర్‌ను నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించినంత మాత్రాన ప్రజల నిరసనలను అణచివేయలేరని వ్యాఖ్యానించారు.జంతర్‌మంతర్ కేవలం ఒక ప్రదేశం కాదని, అది ప్రజాస్వామ్య నిరసనకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇకపై దేశమంతటా జంతర్మంతర్లాంటి నిరసన వేదికలు ఏర్పడతాయని హెచ్చరించారు. జాతీయ పతాకాన్ని ప్రదర్శించడం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు. అదుపులోకి తీసుకున్న కార్యకర్తలకు న్యాయవాదులను సంప్రదించే అవకాశం కల్పించాలని పోలీసులను కోరారు. గతంలో తనను నిర్బంధించినప్పుడు 24 గంటలపాటు న్యాయవాదితో మాట్లాడేందుకు అనుమతించలేదని ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.
విద్యార్థి సంఘం ప్రదర్శన 
సీజేపీ నాయకుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం దిశ విద్యార్థి సంఘం కార్యకర్తలు కన్నాట్ ప్లేస్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా తదితరులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జంతర్‌మంతర్‌ను తిరిగి ప్రజల నిరసన వేదికగా గుర్తించాలని కోరారు. యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ పిటిషన్‌కు 14 అభ్యంతరాలు
సోమవారం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా 11 మంది ఇండి కూటమి నాయకులు ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టులో ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ, వోటర్ల తొలగింపుపై ఆడిట్, ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయాలకు సంబంధించిన రికార్డుల సమర్పణ, ఎస్ఐఆర్పై తాత్కాలిక నిలుపుదల వంటి ఉపశమనాలను కోరారు. అయితే పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ 14 అభ్యంతరాలు గుర్తించింది. కోర్టు ఫీజులో రూ.220 లోటు, తొమ్మిది మంది పిటిషనర్ల తరఫున అవసరమైన వకాలత్నామాలు లేకపోవడం, మల్లికార్జున ఖర్గే గుర్తింపు కార్డు ప్రతిలో స్పష్టత లేకపోవడం, కొన్ని పత్రాల్లో పేజీలు కనిపించకపోవడం తదితర లోపాలను పేర్కొంది. జ్ఞానేశ్ కుమార్‌తోపాటు మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లను వ్యక్తిగత ప్రతివాదులుగా ఎందుకు చేర్చారన్న అంశంపైనా వివరణ కోరింది. ఈ అభ్యంతరాలు పరిష్కరించకపోవడంతో మంగళవారం పిటిషన్ విచారణ జాబితాలో చేరలేదు. లోపాలను సరిదిద్దిన తర్వాత విచారణకు తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది..అందువల్ల ఎస్ఐఆర్ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.
ఇండి కూటమి ప్రదర్శనపై రెండు కేసులు
సోమవారం రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ఇండియా కూటమి ప్రదర్శనకు సంబంధించి దిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు మంగళవారం వెల్లడైంది. బారాఖంబా రోడ్డు, తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించడం, బారికేడ్లను ధ్వంసం చేయడం, రహదారులపై రాతలు రాయడం వంటి ఆరోపణలను పోలీసులు పేర్కొన్నారు. ఒక ట్రక్కుతో బారికేడ్లకు నష్టం కలిగించినట్లు కూడా ఆరోపించారు. గత పది రోజులుగా జరిగిన నిరసనలకు సంబంధించి దిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో రెండు డజన్లకుపైగా ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు , అక్టోబర్ 10 నిరసనల సందర్భంగా 20 మందికిపైగా అరెస్టయి, అనంతరం బెయిల్‌పై విడుదలైనట్లు తెలుస్తోంది.
మహిళా జర్నలిస్టులపై దాడుల ఆరోపణలు: సుప్రీంకోర్టు స్పందన
మంగళవారం మరో ముఖ్యమైన పరిణామంగా నిరసనలను కవర్ చేస్తున్న మహిళా జర్నలిస్టులపై పోలీసుల దాడులు, అక్రమ నిర్బంధం జరిగాయన్న ఆరోపణలను సుప్రీంకోర్టు పరిశీలించింది. నెట్వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా, ఇండియా (ఎన్‌డబ్ల్యూఎంఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అడ్డుకోవడం, బలవంతంగా తరలించడం, గుర్తింపు కార్డులు చూపించినప్పటికీ నిర్బంధించడం వంటి ఆరోపణలను పిటిషన్లో ప్రస్తావించారు. ఈ అంశాలపై వివరణ ఇవ్వడానికి గురువారం, అక్టోబర్ 15న సీనియర్ దిల్లీ పోలీసు అధికారి హాజరుకావాలని ప్రధాన న్యాయమూర్తి కోరారు. పాత్రికేయుల భద్రత, నిరసనల సమయంలో వార్తా సేకరణకు స్వేచ్ఛ, పోలీసుల వ్యవహారశైలికి సంబంధించిన మార్గదర్శకాలను పిటిషనర్లు కోరుతున్నారు.
నిరసనల కేసుల విచారణ 15కు వాయిదా
అక్టోబర్ 10 నిరసనల సందర్భంగా మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రాకపోకలకు అంతరాయం, పోలీసు నిర్బంధాలు, ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలపై ఆంక్షలకు సంబంధించిన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు గురువారం అక్టోబర్ 15కు వాయిదా వేసింది. ధర్మాసనంలోని జస్టిస్ వి. మోహన అనారోగ్యంతో ఉండటంతో విచారణ వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, కోర్టు ఆదేశాల అమలుకు సంబంధించిన అఫిడవిట్ సిద్ధంగా ఉందని, మరికొన్ని వివరాలు చేర్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ధర్మాసనం అదనపు సమయం మంజూరు చేసింది. ఇది రాహుల్ గాంధీ సంయుక్త పిటిషన్‌కు సంబంధించిన విచారణ కాకుండా, నిరసనలపై పోలీసు ఆంక్షలకు సంబంధించిన ప్రత్యేక విచారణ.
దిల్లీ హైకోర్టులో నిరసన హక్కుపై విచారణ
నిరసనల నిర్వహణ, పోలీసుల ఆంక్షలు, జంతర్‌మంతర్‌లో ప్రదర్శనలకు అనుమతి అంశాలపై మంగళవారం దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నితిన్ డబ్ల్యూ. సాంబ్రే, జస్టిస్ సంజయ్ శర్మల ధర్మాసనం సంబంధిత పిటిషన్లను పరిశీలించింది. అక్టోబర్ 10న జంతర్‌మంతర్, కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో నిరసనకారులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడులు చేశారన్న ఆరోపణలపై ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్ స్వతంత్ర విచారణ కోరారు. దాడులకు సంబంధించినవిగా పేర్కొన్న తొమ్మిది వీడియోలను పిటిషన్లో ఆధారాలుగా సమర్పించారు. సీసీటీవీ రికార్డులను భద్రపరచాలని కోరారు. అయితే పిటిషన్ విచారణార్హతపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మూడు వారాల్లో ప్రాథమిక అభ్యంతరాలను సమర్పించేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ నాలుగు వారాల తర్వాత జరగనుంది. మరోవైపు నిరసనల సందర్భంగా బారికేడ్లు, రహదారుల మూసివేత వల్ల రూ.2,000 కోట్ల వ్యాపార నష్టం జరిగిందని వ్యాపార సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. నిరసనల నిర్వహణకు సంబంధించిన ఇతర పిటిషన్ల విచారణను హైకోర్టు అక్టోబర్ 16కు వాయిదా వేసింది.
20 వరకు అదనపు బలగాలు కొనసాగించాలని విజ్ఞప్తి
దిల్లీలో నిరసనలు మరింత విస్తరించే అవకాశం ఉందన్న అంచనాతో కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 273 కంపెనీల మోహరింపును అక్టోబర్ 20 వరకు పొడిగించాలని దిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరారు. ఇప్పటికే మొత్తం 301 కంపెనీల మోహరింపునకు అనుమతి ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే వాటిలో కొన్ని కంపెనీలు ఇంకా దిల్లీకి చేరలేదని పేర్కొన్నాయి. జంతర్‌మంతర్, ఎన్నికల సంఘం కార్యాలయం, పార్లమెంట్, ఇండియా గేట్ పరిసరాల్లో కొత్త నిరసనలు జరిగే అవకాశాన్ని పోలీసులు తమ విజ్ఞప్తిలో ప్రస్తావించారు.
జంతర్‌మంతర్‌ను పునరుద్ధరించాలని ఇండి కూటమి డిమాండ్
జంతర్‌మంతర్‌ను అధికారిక నిరసన స్థలంగా తిరిగి గుర్తించాలని ఇండియా కూటమి నాయకులు డిమాండ్ చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎన్నికల సంఘం పనితీరును విమర్శిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడతాయని ప్రకటించారు. రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు కలిసే ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి నిరసనలు విజయవంతమయ్యాయని వ్యాఖ్యానించారు.
గురువారం సుప్రీంకోర్టు విచారణ కీలకం
మంగళవారం పరిణామాలతో ఎన్నికల సంఘంపై జరుగుతున్న రాజకీయ ఉద్యమానికి న్యాయపరమైన అంశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాహుల్ గాంధీ ఉమ్మడి పిటిషన్‌లోని 14 అభ్యంతరాలను ప్రతిపక్షాల న్యాయవాదులు ఎప్పుడు పరిష్కరిస్తారన్నది ఒక ముఖ్యమైన ప్రశ్నగా మారింది. అక్టోబర్ 15న నిరసనలపై పోలీసు ఆంక్షలకు సంబంధించిన కేసులు, మహిళా జర్నలిస్టులపై దాడుల ఆరోపణల అంశం సుప్రీంకోర్టు ముందుకు రానున్నాయి. అక్టోబర్ 16న జంతర్‌మంతర్ నిరసనల అనుమతులు, ప్రజల రాకపోకలపై ఆంక్షలకు సంబంధించిన అంశాలను దిల్లీ హైకోర్టు తిరిగి పరిశీలించనుంది. జంతర్‌మంతర్‌ను అధికారిక నిరసన స్థలంగా పునరుద్ధరిస్తారా, సీజేపీ నాయకులపై కొత్తగా కేసులు నమోదు చేస్తారా, ఇండి కూటమి తదుపరి కార్యక్రమం ఏమిటన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
—————————————————————————————————————————————————————