తెలంగాణలో పెట్టుబ‌డుల‌కోసం య‌త్నిస్తా

  • ఇండియా ఫ‌స్ట్, తెలంగాణ ఫ‌స్ట్ అన్న‌దే మా విధానం
  •  పీడీఎస్ఎల్ తెలంగాణ‌లో విస్త‌రించాలి
  • త‌యారీరంలోనూ తెలంగాణ దూసుకెళుతోంది
  • బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌

అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతం-పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తాన‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు అన్నారు. ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ అన్నదే తన విధానం అన్నారు. ఇంగ్లాండ్ వార్విక్ యూనివర్సిటీ లో ఏర్పాటుచేసిన పిడిఎస్ఎల్ (ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూష‌న్స్ లిమిటెడ్‌) నాలెడ్జ్ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించిన సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు.   పెట్టుబడులు వచ్చి తెలంగాణ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలని ఆకాంక్షించారు. అందుకోసం తమ సర్వశక్తులు ఉపయోగిస్తామన్నారు. తెలంగాణ విజయాల గురించి మాట్లాడటానికి ఎల్లప్పుడూ తనకు గర్వంగా ఉంటుందన్నారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు పీడీఎస్ఎల్  కి ధన్యవాదాలు తెలిపారు.  పీడీఎస్ఎల్ తమ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించాలని కోరిన కేటీఆర్, ఇంగ్లాండ్ లో యూనివర్సిటీ, ఇండస్త్రీల మధ్య ఉన్న పరస్పర సహకారం తనను ఆశ్చర్యపరిచిందన్నారు.

మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్‌ సేవలను అందించే పీడీఎస్‌ఎల్ సంస్థ, వార్విక్ యూనివర్సిటీ లో తన నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించుకోవడం తెలంగాణ టాలెంట్ కు నిదర్శనమ‌న్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వినూత్న విధానాలతోనే ఆటోమోటివ్ హబ్ గా పూణే, చెన్నైల సరసన హైదరాబాద్ నిలిచిందన్నారు. తమ ప్రభుత్వ కాలంలోనే ఐటీ, లైఫ్ సైన్సెస్‌ తో పాటు ఆటోమోటివ్ రంగంలోనూ తెలంగాణ సత్తా చాటిందన్నారు. ఆటోమోటివ్ రంగంలో కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్‌ కే పరిమితం కాకుండా తయారీ రంగంలో కూడా తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపేందుకు తమ ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీలు ఉపయోగపడతాయన్నారు. భారతదేశంలో ఫార్ములా ఈ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్న కేటీఆర్, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రాష్ట్రంలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటుచేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు. ఐటీ, దాని అనుబంధ రంగాలతో పాటు ఆటోమొబైల్ వంటి ఇతర రంగాల్లోనూ మనదేశ యువత తమ ప్రతిభ,నిబద్ధతతో అద్భుతంగా రాణిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత, విద్యార్థుల తో పాటు కంపెనీలు కూడా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. పిడిఎస్ఎల్ డైరెక్టర్ క్రాంతి పుప్పాల మాట్లాడుతూ కేటీఆర్ ఆలోచనలు, పనితీరు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదన్నారు. ఆయన చేసిన పనులు, తీసుకొచ్చిన విధానాలు ముఖ్యంగా ఇన్నోవేషన్ రంగానికి చేసిన కృషి తో ఐటీ ఒక్కటే కాదు అనేక రంగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా నిలబడిందన్నారు. అనేక దిగ్గజ కంపెనీలను హైదరాబాద్ కు రప్పించి తన పనితీరు ఆలోచనా థృక్పథంతో గ్లోబల్ లీడర్ గా ఎదిగిన కేటీఆర్ చేతుల మీదుగా తమ నాలెడ్జ్ సెంటర్ ను ప్రారంభించుకోవడం తమ కంపెనీ కి అత్యంత గౌరమ‌న్నారు.  నాలెడ్జ్ సెంటర్ నుు ప్రారంభించిన ఆనంతరం అక్కడ జరిగే కార్యకలాపాలను కేటీఆర్ పరిశీలించారు. తమ సంస్థ గురించి పిడిఎస్ఎల్ ప్రతినిధులు ఆయనకు వివరించారు. ఆ తరువాత కంపెనీ సిబ్బంది,ఉద్యోగులతో కేటీఆర్ ముచ్చ‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page