– ప్రతీ ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి నడపాలన్నదే మా అజెండా
– రాష్ట్ర సమగ్రాభివృద్ధికే ‘క్యూర్, ప్యూర్, రేర్’
– గ్రోత్ ఎక్స్ 2026 సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని మరింత పరుగులు పెట్టించేలా, పెట్టుబడిదారులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా అందరితో చర్చించి ఈ కొత్త విధానాన్ని రూపొందిస్తామన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘గ్రోత్ ఎక్స్ 2026’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గ్రోత్ అంటే యాదృచ్ఛికంగా వచ్చేది కాదని, భావితరాల భవిష్యత్తు కోసం శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ దిశగానే ప్రభుత్వం తెలంగాణ విజన్ 2047ను రూపొందించిందన్నారు. ఆర్థిక వృద్ధిని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న తమ లక్ష్య సాధనకు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ‘క్యూర్-ప్యూర్-రేర’ అనే త్రిముఖ వ్యూహానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నామన్నారు. నగరం నుంచి గ్రామం వరకు ప్రతీ ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ అజెండా అని స్పష్టం చేశారు. ఏఐ, ఇండస్ట్రీ 5.0 వంటి టెక్నాలజీస్‌తో వర్క్ కల్చర్‌లో మార్పు వచ్చిందని, రాబోయే రోజుల్లో కంపెనీల కంటే ఎకో సిస్టంకే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. అందుకే భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా దానినే నిర్మించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. పరిశ్రమలకు కేవలం అనుమతులు ఇచ్చే వ్యవస్థలా కాక వారితో కలిసి నడిచే భాగస్వామిగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ప్రముఖ వైద్యుడు నాగేశ్వర్ రెడ్డి, ఫ్యాప్సీ ప్రెసిడెంట్ ఆర్.రవికుమార్, స్కై రూట్ ఏరో స్పేస్ ప్రతినిధి పవన్, గ్రోత్ ఎక్స్ 2026 కన్వీనర్ పంకజ్ దివాన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





