ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం
•మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ గా అప్ గ్రేడ్
•అభివృద్ధి దిశగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
•ఫలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి
•భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మహర్దశ
•జాతీయస్థాయిలో భద్రాద్రి కొత్తగూడేనికి ఖ్యాతి
•సీఎం రేవంత్ కు తుమ్మల ధన్యవాదాలు
ప్రజాతంత్ర నెట్ వర్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారు స్తు న్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటనతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు శ్రమ ఫలిం చింది. అన్ని సహజ వనరులు మె రుగైన అవకాశాలున్న మైని ంగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేయాలని మంత్రి తుమ్మల పలు మార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు అందచేసిన విషయం తెలిసిందే. మంత్రి తుమ్మల విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించి యూనివర్సిటీని మంజూరు చేస్తూ ప్రకటన జారీ చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. సహజ వనరులు, ఖనిజాలు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో అంతర్జాతీయ ఖ్యాతి లభించనుంది. దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ని కొత్తగూడెం జిల్లాలో మంజూరు చేయడం ఉమ్మడి జిల్లాకు లభించిన గొప్ప గౌరవంగా చెప్పవచ్చు.
300 ఎకరాల్లో విశ్వవిద్యాలయం…
సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 300 ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపుదిద్దుకోనుంది. అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారనుంది. మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చడం ద్వారా వేలాది మంది యువ శాస్త్రవేత్తల ఇక్కడి నుంచే దేశ భవిష్యత్తుకు బాటలు వేయనున్నారు. నాగరికతతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడంలో సహజ వనరులు కీలక పాత్ర పోషిస్తాయి. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల అమలుతో జాతీయ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది.
ఫలించిన మంత్రి తుమ్మల కృషి….
అపర చాణిక్యుడిగా…విజన్ కలిగిన నేతగా మంత్రి తుమ్మలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అభివృద్ధిలో పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేయడం ఆయన నైజం. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం మైనింగ్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా మార్చాలని పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి వినతి పత్రాలు లేఖలు అందించి తన పంతం నెగ్గించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటేలా, దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ప్రతి అంశాన్ని ప్రతి పనిలో సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
భద్రాద్రికి మహర్దశ…యువతకు ఉద్యోగాలు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మహర్దశ పట్టనుంది. మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులకు అవకాశాలతోపాటు శాస్త్రవేత్తలుగా తయారు కానున్నారు. . ఎర్త్ సైన్సెస్ వర్సిటీతో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రస్థాయిలో ప్రవేశాలు కల్పించే అరుదైన అవకాశం లభించనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నలుమూలల నుంచి విద్యార్థులకు చదువుతోపాటు ఉపాధి అవకాశాలు లభించాయి.
ప్రత్యేక వనరులు…
భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విద్యాలయానికి దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. ఇక్కడ బొగ్గుతోపాటు అన్ని ఖనిజాలు ( సహజ వనరుల) ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఖనిజ నిధిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పేరుంది. ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అన్ని అనుకూల వసతులు ఉన్నాయి. నేషనల్ హైవే కి సమీపంలో 300 ఎకరాల్లో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. విశ్వవిద్యాలయానికి సమీపంలో మినీ స్టిల్ ప్లాంట్, నావా లిమిటెడ్ , ఫెరో ఎల్లాయి,ఫెర్రో మెగ్నీషియం, విద్యుత్ ప్లాంట్ ఉన్నాయి. విద్యుత్ ప్లాంట్లు కూడా మరో 300 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాంతానికి సమీపంలో ఐటీసీ పేపర్ బోర్డ్, హెవీ వాటర్ ప్లాంట్ ఉన్నాయి. ఈ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయాన్ని ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఈ కల నెరవేరనుంది. రోడ్డు మరియు రైలు రవాణా మార్గాలు ఈ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నాయి. 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో నీటి ఇబ్బందులు ఉండవు. అన్ని అవకాశాలు ఉన్న దృష్ట్యా ఇక్కడ ఎర్త్ సైన్సెస్ విద్యాలయం ఏర్పాటుకు అనుకూల అంశాలుగా ప్రభుత్వం గుర్తించింది.