రాష్ట్ర బీసీ ప్రతినిధుల మహాసభలో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ప్రశ్న
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, ఆ హామీ ఇంకా అమలు కాకముందే స్థానిక సంస్థల ఎన్నికలను జరిపే ప్రయత్నం చేయడం బీసీలకు మోసం చేసినట్లే అవుతుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు (Dr.Vakulabharanam Krishnamohan Rao) అన్నారు. “ఎన్నికలు అవసరమే కానీ హామీ అమలయ్యే వరకు ఆలస్యం చేయాలి. కోర్టుల అనుమతి ఆధారంగా మహారాష్ట్ర, తమిళనాడు మాదిరిగా రాజ్యాంగ, న్యాయ ప్రమాణాలను పాటిస్తూ ముందుకెళ్లాలి” అని పేర్కొన్నారు.
ఆదివారం ఖైరతాబాద్ మోడ్రన్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర బీసీ ప్రతినిధుల మహాసభ ఘనంగా జరిగింది. ఈ మహాసభ బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు కాటం నరసింహ యాదవ్ అధ్యక్షతన బీసీ నేతలు వినోద్ యాదవ్, వెంకటేశ్ గౌడ్, రుక్మిణి, రేణుక తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా డా. వకుళాభరణం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సభలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వి. ప్రకాష్, బీజేపీ అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. “న్యాయబద్ధంగా గణాంకాలు బలంగా లేకుండా రిజర్వేషన్లు అమలు చేయడం అన్యాయమే” అని స్పష్టం చేశారు. వి. ప్రకాష్ మాట్లాడుతూ.. “ప్రజాస్వామ్య పద్ధతులు పాటించి, కమిటీల నివేదికలు బయట పెట్టాలి” అని అన్నారు. బండారు విజయలక్ష్మి వ్యాఖ్యానిస్తూ “రాష్ట్ర పరిధిలో పరిష్కరించవలసిన అంశాలను పక్కనపెట్టి కేంద్రంపై విమర్శలు చేయడం సబబు కాదు” అని అన్నారు.
అనంతరం డా. వకుళాభరణం మాట్లాడుతూ.. రాష్ట్రపతిని కలిసేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం పంపాలని, ఇప్పటికీ రాష్ట్రపతి ఆమోదం పొందని బిల్లుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించలేదని పేర్కొన్నారు. అఖిలపక్ష నాయకులతో కలసి వెంటనే రాష్ట్రపతిని కలవాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, మహారాష్ట్ర ఉదాహరణలతో మరింత గడువు కోరాలని, హైకోర్టు ఇచ్చిన గడువును ఎన్నికల షెడ్యూలుగా కాకుండా, కోర్టులో లార్జర్ బెంచ్‌ను ఆశ్రయించి మరింత సమయం కోరాలని సూచించారు. సోషల్ ఎడ్యుకేషనల్, ఎకనామిక్, ఎంప్లాయిమెంట్, కాస్ట్ సర్వే నిర్వహించినప్పటికీ, పూర్తిస్థాయి డేటాను ఇప్పటికీ బహిర్గతం చేయలేదని, ప్లానింగ్ డిపార్ట్మెంట్ నివేదికలు, కులాల వారీగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. బుసాని కమిషన్ పట్టణ గణాంకాల నివేదిక కూడా విడుదల చేయాలని చెప్పారు. G.O. 49 ప్రకారం బుసాని కమిషన్ గ్రామీణ స్థానిక సంస్థలపై మాత్రమే నివేదిక ఇచ్చిందని, పట్టణ గణాంకాలపై ఇంకా నివేదిక లేదు. అయినా బిల్లులో రెండింటినీ కలిపి 42% రిజర్వేషన్ ప్రకటించడం సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ కు విరుద్ధమని వ్యాఖ్యానించారు. . బిల్లులు పంపినా ఆమోదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు “బిల్లులను రాష్ట్రపతికి పంపిన తర్వాత రాష్ట్రం నుండి ప్రయోజనంగా తగిన చర్యలు జరగలేదు. రాష్ట్రపతి ఆమోదం రాకుండా బిల్లులను ‘మోడల్’గా పేర్కొనడం హాస్యాస్పదం” అని అన్నారు.