విద్వేష బిల్లుపై భిన్న స్వరాలు

తెలంగాణ శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన హేట్‌ ‌స్పీచ్‌ ( ‌విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లు-2026పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇది వాక్‌స్వాతంత్య్రాన్ని హరించేదిగా ఉందని, తప్పు ఒప్పులను నిర్ణయించే విషయంలో ఈ బిల్లులో స్పష్టత లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని అధికార వర్గాలు దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ముఖ్యంగా తమకు వ్యతిరేకమైన వారిపైన ప్రతీకార చర్యలు తీసుకోవాలనుకునేవారికి ఇది ఒక ఆయుధంగా మారుతుందన్న విమర్శలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సోమవారం శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా బిజెపి, సిపిఐ, ఎంఐఎం లు దీన్ని వ్యతిరేకించాయి.

అప్పటికే సస్పెండ్‌కు గురికావడంతో బిఆర్‌ఎస్‌ ‌శాసనభ్యులెవరూ ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీలో లేకపోయినా ఆ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన హేట్‌ ‌స్పీచ్‌ అం‌డ్‌ ‌హేట్‌ ‌క్రైమ్స్ (‌ప్రివెన్షన్‌)‌బిల్లు ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకే తెచ్చిందని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటి రామారావు విమర్శిస్తున్నారు. ప్రభుత్వంచేసే తప్పులను ఎత్తిచూపే పత్రికలు, సోషల్‌ ‌మీడియా లేదా విపక్షపార్టీల నాయకులు ఎవరిపైనైనా దీన్ని ప్రయోగించి వారి గొంతు నొక్కే విధంగా అందులో పదజాలాన్ని పొందు పర్చారాని ఆయన ఆరోపిస్తున్నారు.

విచిత్రమేమంటే అధికార కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న సిపిఐ, ఎంఐఎం పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేక చర్యలకు పాల్పడినవారిపైన చర్య తీసుకునేందుకు భారత న్యాయసంహిత (బిఎన్‌ఎస్‌)‌కింద ఇప్పటికే నిబంధనలుండగా మళ్ళీ కొత్తగా ఈ చట్టం దేనికని ఎంఐఎం శాసనసభ్యులంటున్నారు. క్రిమినల్‌ ‌ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 41ఏ ‌కింద నోటీసులు జారీచేయకుండానే నేరుగా రిమాండ్‌కు పంపడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తుందన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. దీనివల్ల ఒక విధంగా వాక్‌ ‌స్వాతంత్య్రాన్ని హరించడమే అవుతుందంటున్నారు. సిపిఐ పార్టీ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు కూడా అలాంటి వ్యాఖ్యానమే చేశారు.

విద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యానాలు చేసేవారికి శిక్షించేందుకు ఇప్పటికే ఉన్న చట్టాలు సరిపోతాయని, మరో  కొత్త చట్టం అవసరంలేదని కరాఖండీగా చెప్పారు. ఈ బిల్లు ప్రయోగంలో ఏది తప్పు, ఏది ఒప్పు అన్న విషయ నిర్ధారణ అయోమయానికి దారితీస్తుందని, అందుకు ఈ బిల్లును ఉపసంహరించుకోవడమే శ్రేయస్కరమని సూచించారు. ఈ బిల్లు భారత రాజ్యాంగంలోని  19వ ఆర్టికల్‌ను ఉల్లంఘించేదిగా ఉందంటున్న బిజెపి శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సామాన్యులపై  కక్షసాధింపుకు ఇది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్‌ ‌శాసనసభ్యులు మాత్రం దీన్ని కఠినతరంగా ప్రయోగించాల్సిందేనంటూ తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు.
    విద్వేష ప్రసంగాలు, మాటలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ ‌మీడియా ల్లో వొస్తున్న ధోరణులు, సమాచార ముద్రణ సంస్థలు, సమాచార మార్పిడి, సోషల్‌మీడియాల్లో మతం, జాతి, కులం,భాష, లింగభేదాల  విషయంలో అభ్యంతరకర విషయాలు దీని పరిధిలోకి వొస్తాయి.  ఇలాంటి వాటివల్ల దేశ గౌరవం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలు దెబ్బతింటాయన్నది ఆ బిల్లులోని సారాంశం. వీటిని నిరోధించడం, నేరస్తులను శిక్షించడం దీని ముఖ్య లక్ష్యం. కేవలం వ్యక్తులే కాకుండా, ఆ వ్యక్తి పనిచేసే సంస్థలపై కూడా చర్యలు తీసుకునే అవకాశముంటుంది.
నేరం రుజువైన పక్షంలో ఏడాది నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు, 50 వేల రూపాయల జుర్మాన    విధించే విధంగా ఈ చట్టంలో పొందుపర్చారు. అయితే ఈ చట్టం కింద నియమితులైన అధికారులు తీసుకునే చర్యలకు వ్యతిరేకంగా సంబంధిత అధికారి పై ఎటువంటి కేసు గానీ , న్యాయపరమైన విచారణ చేపట్టడానికి గానీ వీలులేకపోవడమన్నది అభ్యంతరకరంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  కాగా ఈ బిల్లుపై సభలో భిన్న అభిప్రాయాలు వెలువడడంతో దీన్ని హౌస్‌ ‌కమిటీ పరిశీలనకు పంపాలన్నది సభ్యులందరి ఏకగ్రీవ అభిప్రాయం. కాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సెలెక్ట్ ‌కమిటీకి పంపేందుకు అంగీకరించడంతో స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌సెలెక్ట్ ‌కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించడంతో చివరకు ఈ బిల్లు ఎలాంటి రూపు ధరిస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *