ఇంత గందరగోళం ఎందుకు సర్‌జీ?
ముందుగా నెవిల్ చాంబర్లేన్ ఏమన్నాడో చూద్దాం : “యుద్ధంలో ఎవరు తాము విజేతలమని ప్రకటించుకున్నా, చివరికి ఓడిపోయేది అందరూ…” ఇప్పుడు ‘ఇన్‌సైడ్ మ్యాన్: మోస్ట్ వాంటెడ్’ అనే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే సినిమాలో డైలాగ్ చూద్దాం : “నీవింకా అమెరికా ఆధిపఠ్యాన్ని నమ్ముతున్నావంటే నువ్వొక జోకర్ వి. అమెరికన్ అఖండ శక్తి అనేది చవకబారు ప్రచారం. మేము గనుక లేకపోతే మీరు దివాళా తీసే పనే”. ఏప్రెల్ 22 మన దేశ చరిత్రలో ఇంకో దుర్దినం. కశ్మీర్ లోని పహల్గాంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 28 మంది పర్యాటకుల్ని టెర్రర్ మూక నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపిన విషాద ఘట్టం. అయితే ఈ ఉగ్రవాద దాడి, తదనంతరంగా భారత సైనిక ప్రతిచర్యతో దేశం యావత్తూ తప్పుడు వార్తల తుఫానులో తేలిపోతూ నిజాలపై ఆలోచించే అవకాశం లేకుండా గందరగోళానికి లోనైంది. టీవీ ఛానళ్ల స్టూడియోల్లో తయారైన ఫేక్ న్యూసులతో ప్రజలను రెచ్చగొట్టడం మొదలైంది. మనం, అంటే సామాన్య ప్రజలం, దేశభక్తి మత్తులో మునిగి, ఇది దీర్ఘకాలిక యుద్ధంగా మారిపోతుందేమోనని భయంతో జీవించాల్సి వచ్చింది.
ఈ ఘటనపై ఇరు దేశాల నాయకత్వాలు దారుణంగా మౌనం పాటించడం ఒకెత్తు అయితే, తటస్థ పరిశీలకులు వాస్తవాలు బయటికి తేవాలని చేసిన ప్రయత్నాలను అణిచివేయడం ఇంకో యెత్తు. దీంతో సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాలు విచ్చలవిడిగా జాతీయతను రెచ్చగొట్టే ప్రచారానికి తెరలేపాయి. ఈ రెండు వారాలుగా జరిగిన సంఘటనలు, వాస్తవానికి మసాలా వార్తల్ని వండి వార్చడానికి తోడ్పడ్డాయే తప్ప, సంఘటనల నిజానిజాలేమిటో తెలుసుకునే అవకాశం ఏ మాత్రం ఇవ్వలేదు.
2016, 2019 సర్జికల్ స్ట్రైక్స్ తరువాత ఎలాగైతే పాకిస్తాన్ మౌనంగా ఉండిపోయిందో, అదే మౌనం ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా పాటించివుంటే వార్తల వంటా వార్పూ ఇంత దారుణంగా వుండేది కాదేమో. కానీ ఈసారి పెరిగిన దేశీయ ఒత్తిడిని తట్టుకోలేక పాక్ మన దేశంపై విమానాలతో, డ్రోన్లతో ప్రతి దాడులకి తెగబడింది. వాస్తవానికి జరుగుతున్నదానికీ, ఇరు దేశాల మీడియా చూపించిన చిత్రణకీ చాలా వ్యత్యాసం ఉంది. ఇరు దేశాలు అధికారికంగా యుద్ధం ప్రకటించనే లేదు. కానీ మధ్యలో ట్రంప్ మహాశయుడు ఎవరూ అడక్కుండనే మధ్యవర్తిత్వం నేరపేసి – కాల్పుల విరమణ జరిగిందోచ్ అని ప్రకటించేశాడు!
ఈ సంధి ప్రకటన దాదాపుగా అమెరికా ఒత్తిడితో వచ్చినదిగా పేర్కొనడం గమనార్హం. ట్రంప్ జోక్యంతో ఇరు దేశాల మధ్య పోరాటమే గందరగోళంగా మారింది. ఎంత గందరగోళమంటే అసలు కాల్పుల విరమణ అనేది అమలవుతోందో లేదో తెలియనంత. ఎందుకంటే ట్రంప్ కాల్పుల విరమణ అలా ప్రకటించాడో లేదో- పాకిస్తాన్ కాల్పులు మొదలెట్టేసింది! మీడియా స్టూడియోలను కమాండ్ కేంద్రాలుగా మలచుకుని యాంకర్లు పాత విజువల్స్ తో, వీడియో గేములతో సమాంతర యుద్ధమే చూపించేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “మేమే శాంతి ఒప్పందం కుదిర్చాం” అని ప్రకటిస్తూ ‘Brokered’ అనే పదాన్ని స్పష్టంగా ఉటంకించడంతో ఇది మధ్యవర్తిత్వం కాదని స్పష్టమై పోయింది.
ఈ ప్రకటన సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ కు దారితీసింది. మరోవైపు, పాకిస్థాన్‌ను పూర్తిగా ఓడించాలని ఆకాంక్షించిన వారిలో నిరాశను కలిగించింది. భారత ప్రభుత్వం అమెరికా పాత్రను వెంటనే ఖండించినా, కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి.
కాల్పుల విరమణ గురించి అమెరికా ముందుగా ఎలా ప్రకటించింది? ఎలాంటి ఒప్పందం జరిగింది? అమెరికా అధ్యక్షుడు స్వయంగా చెప్పిన ప్రకారం, అతను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లను ఒత్తిడిచేసి కాల్పుల విరమణకు ఒప్పించాడట – ఒప్పుకోకపోతే మీ రెండు దేశాలతో వాణిజ్యం రద్దు చేస్తానని బెదిరించాడట. పైగా, అణు యుద్ధానికి దారి తీయకుండా ఆపి, లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడినట్లు కూడా తనే వెల్లడించాడు. అయితే భారత ప్రభుత్వం వెంటనే దీన్ని ఖండించి, అమెరికాతో జరిగిన చర్చల్లో వాణిజ్యం ప్రస్తావన రాలేదని తెలిపింది.
ఇలా ఎవరు నిజం చెబుతున్నారు అన్న సందేహాలు అలాగే ఉన్నాయి. విశ్వగురు అని ప్రకటించుకుని విదేశాంగ విధానాన్ని చూపించుకుంటున్న భారత నాయకత్వం, అమెరికా ఒత్తిడికి ఎలా లొంగింది? కశ్మీర్ అంశాన్ని ద్వైపాక్షికంగా పరిష్కరించాలనే విదేశాంగ విధానానికి ఇది ఘోరమైన పరాజయం కాదా? ట్రంప్ పాకిస్తాన్‌ను “గొప్ప దేశం” అని సంబోధించడం – భారత విశ్వగురు ప్రతిఛాయిని పాకిస్తాన్ స్థాయికి తేవడమే కాదా? ఈ అసహజ జోక్యం, దీన్ని భారత్ అంగీకరించడం – ఇదంతా భారతదేశానికి దౌత్య పరంగా ఎదురు దెబ్బే. సైనికంగా ప్రయోజనాలు పొందినప్పటికీ, దౌత్య పరంగా పాకిస్తాన్ విజయించిందనే అభిప్రాయం కలుగుతోంది. చరిత్ర తెలియని ట్రంప్ కశ్మీర్ సమస్యను “వెయ్యి సంవత్సరాల సమస్య” గా పదే పదే చెప్తూ జోక్ గా మార్చినప్పుడు- భారత ప్రభుత్వం ట్రంప్ వ్యాఖ్యలకు స్పష్టంగా ఎదురు చెప్పలేదు. ఇది మన దృఢ విదేశాంగ విధానానికి విరుద్ధంగా మారింది.
ఒక్క ప్రశ్న: భారత్ ఎందుకు అమెరికా ఒత్తిడికి లొంగింది? సైనికంగా విజయం సాధిస్తున్న సమయంలోనే ఎందుకు మడిగడుతున్నట్లు కనిపించింది? డీజీఎంవో బ్రీఫింగ్ ప్రకారం భారత సైన్యం తుదివిజయం అందుకునే దశలో ఉండగా, ఏ కారణంగా దిశ మార్చారు? ఇది విశ్లేషకులకూ ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనంత గందరగోళంగా ఉంది. కానీ, భారతదేశానికి పాకిస్తాన్ తో సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. మళ్లీ ఒక్క ఉగ్రవాద దాడి లేదా ఆర్డీఎక్స్ తో ఆత్మాహుతి
దాడి గనుక జరిగితే వాతావరణాన్ని తిరిగి ఉద్రిక్తంగా మార్చగలదు. ఇలాంటి పరిస్థితుల్లో, ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుని, కాల్పుల విరమణకు కారణమయ్యాడన్న కథనాన్ని మన నాయకత్వం నమ్మాల్సినట్టయ్యింది. ఫలితంగా, మళ్ళీ మనకు ‘ట్రంప్ అంకుల్ యుద్ధం ఆపేసారు, పాపా’ అనే మీమ్స్ చూస్తూ మన నాయకత్వం చెప్పే నాటకీయ పోజులు, ఫొటో-ఆప్స్ చూసే పనే ఇక మిగిలింది!
-శ్యామ్ సుందర్