ప్రజాప్రభుత్వంలోనే పౌరులకు భావస్వేచ్ఛ

 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో ఈరోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన తెలంగాణ పోరాటాన్ని అర్థం చేసుకున్న నాటి యూపీఏ చైర్పర్సన్‌ సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా కేంద్ర హోం మంత్రి చిదంబరంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన ప్రకటన డిసెంబర్‌ 9 నాడు చేయడం చరిత్రలో నిలిచిపోయిందన్నారు.. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నీళ్లు, నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్‌ తో బీఆర్‌ఎస్‌ పాలకులకు అప్పగిస్తే 7 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. పదేళ్లలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు నీళ్లను తీసుకురాలేదు. ఆత్మగౌరవంతో బతకాల్సిన ప్రజలను బందీ చేసి అనుక్షణం అవమానాలకు గురిచేసి రాజ్య హింసతో పాలన సాగించారని విమర్శించారు. రాచరిక పోకడలతో నియంతృత్వ పరిపాలన సాగిస్తున్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఆనాటి పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో భారీ బహిరంగ సభలు నిర్వహించగా, సీఎల్పీ నాయకుడిగా తాను ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్‌ పాదయాత్ర నిర్వహించామని తెలిపారు.  ఇక్కడ ఉన్న మంత్రులు ఆనాటి డిసిసి అధ్యక్షులు కాంగ్రెస్‌ నాయకులు సమష్టిగా రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని పోరాడామని అన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలని ప్రజల వద్దకు వెళ్లగా వారు కాంగ్రెస్‌ ను ఆశీర్వదించి అధికారాన్ని కట్టబెట్టారన్నారు.  ప్రజలు కాంగ్రెస్‌ ను దీవించడంతో ఏర్పడిన  ప్రజా ప్రభుత్వం నేటికీ ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్నదన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఈ  ఏడాది కాలంలో తెలంగాణ ప్రజలు నిరంతరం కోరుకుంటున్నట్టుగా స్వేచ్ఛ, భావస్వేచ్ఛ, స్వతంత్రంగా బతకాలనే పరిస్థితులను ఈ ప్రభుత్వం కల్పించింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పూర్తిగా ప్రక్షాళన చేసి 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మహిళలను మహాలక్ష్మిలుగా కొలుస్తున్నాం. ఆత్మగౌరవంతో బతకడానికి ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. మహిళలు ఆత్మగౌరవంతో, ఆత్మ అభిమానంతో బతకాలంటే ఆర్థికంగా ఎదగాలని సంవత్సరానికి 20వేల కోట్ల రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాం. వొచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలను వడ్డీ లేకుండా ఇచ్చి వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దబోతున్నాం. గత బిఆర్‌ఎస్‌ పాలకులు మోపిన అప్పుల భారంతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నా.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి వారు చేసిన అప్పులకు ఈ ఏడాది 64 వేల కోట్లు అప్పు, వడ్డీ చెల్లించాం.  నిరంతరంగా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్‌, ఉచిత వ్యవసాయ కరెంట్‌ కోసం  డిస్కంలకు 12 వేల కోట్లు చెల్లించాంమన్నారు. రాష్ట్రం ఆర్థిక ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారంగా మహిళలకు రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నాం రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల లోపు రుణం ఉన్న రైతులకు ఒకే సారి రూ,21 వేల కోట్లను వారి ఖాతాల్లో నగదును జమ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్‌ దారులకు ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నాం, రాష్ట్రంలో పారిశ్రామిక విధానం పెంపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు దావోస్‌ కు  వెళ్లి 36 వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో మరో అద్భుతమైన ఫ్యూచర్‌ సిటీని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

ఐటీ,  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాఫ్ట్‌ వేర్‌ ఇండస్ట్రీ, స్కిల్‌ యూనివర్సిటీ, అంతర్జాతీయ ప్రమాణాలతో కలిగిన స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుతో ముందుకు పోతున్నాం అని భట్టి విక్రమార్క తెలిపారు.  గురుకుల పాఠశాలలో సరైన వసతులు తిండి పెట్టడం లేదని మొసలి కన్నీరు కారుస్తున్న గత బిఆర్‌ఎస్‌ పాలకులు .. పదేళ్లలో డైట్‌ చార్జీలను ఎందుకు పెంచలేదు?  కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులందరం కలిసి ఒకేసారి 40 శాతం డైట్‌ చార్జీలను పెంచాం. 2023-24 లో గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణాలకు కేవలం రూ.73 కోట్లు కేటాయించగా, దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజా ప్రభుత్వం ఈ ఏడాది యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణం కోసం 5వేల కోట్లు కేటాయించాం. తెలంగాణ ప్రజలు తలెత్తుకునే విధంగా మన అమ్మ, , అక్క, నాయనమ్మ ప్రతిరూపంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుతున్నారని విమర్శలు చేస్తున్నవారు గత పదేళ్లలో అధికారంలో ఉండి అధికారికంగా ఎక్కడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదు. అమ్మగా, ఆరాధ్య దైవంగా,  పోరాటానికి స్ఫూర్తిగా, ఆశీర్వదించే తల్లిగా, పసిడి పంటలు పండిరచే తల్లిగా ధరించిన ఆకుపచ్చ చీర, ప్రగతిశీల భావాలు, ఉద్యమాలకు గుర్తుగా ఎరుపు రంగు, బహుజనుల పోరాట స్ఫూర్తిని గుర్తు చేసేలా నీలం రంగు, రాజ్య హింస పెరిగినప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు దానికి పీఠంపై పిడికిళ్ళు, తెలంగాణలో పండే పంటలన్నీ అరచేతిలో పెట్టుకొని, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ సుభిక్షంగా ఉండాలని ఆపన్న హస్తంతో ఆశీర్వదిస్తున్న తల్లిగా, మన సాంప్రదాయాలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలు పరిగణలోకి తీసుకొని నిండైన రూపాన్ని తెలంగాణ తల్లిని తీర్చిదిద్దినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు తలెత్తుకునే విధంగా తెలంగాణ విగ్రహాన్ని ప్రతిష్టించిన డిసెంబర్‌ 9 రోజును రాష్ట్ర ఉత్సవంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page