కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు
•కాంగ్రెస్ నిర్లక్ష్యంతో కుంటుపడుతున్న గ్రామాలు, పట్టణాలు
•చిన్నచిన్న బిల్లులు చెల్లించటానికి కూడా కాంగ్రెస్ పేచీ
•మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16 : బీఆర్‌ఎస్ పాలనలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టి ప్రతి నెల గ్రామాలకు 275 కోట్లు, పట్టణాలకు 150 కోట్లు ఇచ్చామని మాజీ మంత్రి తన్నీరుహరీశ్‌రావు అన్నారు. కానీ కాంగ్రెస్‌ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె, పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామపంచాయతీలకు ఇవ్వడం లేదని విమర్శించారు. గ్రామపంచాయతీలను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేయడంతో తెలంగాణ పల్లెలకు పోతే చికన్ గున్యా వంటి వ్యాధులు వస్తాయని అమెరికా తన పౌరులను హెచ్చరించే స్థాయికి పరిస్థితి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనినిబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు తెలిసిపోతున్నదని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా సర్పంచులకు పెండింగ్ బిల్లులపై హరీశ్‌రావు ప్రశ్నలేవనెత్తారు.
దీనికిగాను మంత్రి సీతక్క సర్పంచ్‌లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.691 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. దీనిపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు, కానీ చిన్న కాంట్రాక్టర్లకు సంవత్సరకాలం నుంచి 691 కోట్లు నిధులు ఇవ్వకుండా సర్పంచులు, ఎంపీటీసీలను ప్రభుత్వం గోస పెడుతున్నదని విమర్శించారు. చివరికి వారు గవర్నర్, మంత్రులను కలిసి మొరపెట్టుకున్నారని అయినా లాభం లేదని చలో అసెంబ్లీకి పిలుపునిస్తే వారిని అరెస్టు చేస్తున్నారని చెప్పారు. ‘బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టి ప్రతి నెల గ్రామాలకు 275 కోట్లు, పట్టణాలకు 150 కోట్లు ఇచ్చాం. కానీ కాంగ్రెస్‌ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె, పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామపంచాయతీలకు ఇవ్వకపోవడంతో ఈ సమస్య వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీయల అవార్డులను ప్రకటిస్తే వాటిలో టాప్ 20లో 19 తెలంగాణ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఘనత కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వానిది. ఆ రకంగా పల్లెలలను చేశాం. ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, నర్సరీ, డంప్‌యార్డ్, వైకుంఠధామం పెట్టి తెలంగాణ పల్లెలను దేశానికి ఆదర్శంగా నిలిపాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్‌ఎఫ్‌సీ నిధులు విడుదల కావడం లేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈజీఎస్ నిధులు, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను దారిమళ్లించారు. జీపీ జనరల్ ఫండ్స్.. వాళ్ల డబ్బులు వాళ్లు ఖర్చుపెట్టుకోవడానికి ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో చెక్కులు పాసవకపోవడంతో నేడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అప్పులు చేసి, బంగారం కుదవపెట్టి పనిచేస్తే బిల్లులు ఇవ్వరా?. ఒక్క నవంబర్ నెలలో బడా కాంట్రాక్టర్లకు రూ.1200 కోట్ల బిల్లులు ఇచ్చారు. రూ.5 లక్షలు, రూ.10 లక్షల పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల బిల్లులను చెల్లించకుండా పగబట్టి, కక్షతో వారిని ఇబ్బంది పెడుతున్నారు.
గ్రామ పంచాయతీలకు క్రమంతప్పకుండా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో తెలంగాణకు పోతే చికన్‌గున్యా వ్యాధులు వస్తున్నాయని అమెరికా తన పౌరులను హెచ్చరించే స్థితికి పరిస్థితి తీసుకొచ్చారు. దీనిని బట్టి పల్లెలను కాంగ్రెస్ సర్కార్ ఏవిధంగా నిర్లక్ష్యం చేసిందో అర్ధమవుతుంది. ఇది మన రాష్ట్రానికే కాదు, మన దేశానికే అవమానం. మీ పాలన ఈ విధంగా ఉన్నది. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు దిగిపోయి తొమ్మిది నెలలైనా ఇంకా వారికి జీతాలు చెల్లించలేదు. ఒకటో తేదీన జీతాలిస్తున్నమని గొప్పగా చెబుతరు.. కానీ జెడ్పీ చైర్మెన్లకు జెడ్పీటీసీలు, ఎంపీటీలకు ఇంప్పటికీ వారికి మూడు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. వారికి స్పష్టమైన తేదీ చెప్పాలి. పంచాయతీ ఎన్నికలలోపు వారికి జీతాలు చెల్లించాలి. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో రాజీవ్‌గాంధీ తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం, గ్రామపంచాయతీలను బలోపేతం చేస్తామన్నరు. క్రమంతప్పకుండా నిధులు విడుదల చేస్తామన్నారు. మాజీ సర్పంచులు, జెడ్పీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నరు. అవేమీ చేయకుండా కనీసం జీతాలు కూడా ఇస్తాలేరు. వారి జీతాలు, పెండింగ్ నిధులను ఎప్పటిలోగా క్లియర్ చేస్తరో స్పష్టంగా చెప్పాలని’ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాగా, సర్పంచుల పెండింగ్ బిలులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.