కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కగార్ ఆపరేషన్

  • కార్పొరేట్ శక్తుల కోసం కేంద్రంలో బిజెపి ఊడిగం
  • పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే..
  • సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
  • ఘనంగా సిపిఐ భూపాలపల్లి పట్టణ 18 వ మహాసభలు
జయశంకర్ భూపాలపల్లి : దేశంలో కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ చేపట్టిందని సిపిఐ (CPI) రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ భూపాలపల్లి పట్టణ మహాసభ ఘనంగా నిర్వహించారు.  ముందుగా  మహాసభ ప్రాంగణంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సుభాష్ కాలనీలోని సింగరేణి ఫంక్షన్ హాల్ లో జరిగిన మహాసభకు సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్ అద్యక్షత వహించగా రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్రం ఎంతోమందిని పాశవికంగా హత్య చేస్తున్నదని అన్నారు. కార్పొరేట్ శక్తులకు దేశంలోని సహజ వనరులను కట్టబెట్టేందుకు, అడవులను వారికి అప్పగించేందుకు మావోయిస్టులను లేకుండా చేసేందుకే ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒకవైపున మావోయిస్టులు తాము చర్చలకు సిద్దం అని ప్రకటించినా, లొంగిపోతున్నా వారిని చంపడమే ద్యేయంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తామని చెప్పడం ఫ్యూడల్, ఫాసిజం, హంతకుల మనస్తత్వానికి నిదర్శనం అని అన్నారు. తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో చర్చలకు జరపాలని తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మరోవైపు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, సింగరేణి సంస్థలను ప్రైవేటు పరం చేసి నిర్వీర్యం చేయడం కోసం కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను వారికి దారాధత్తం చేస్తున్నదని విమర్శించారు.
కార్పొరేట్ శక్తులైన అంబానీ, ఆదానీలకు వంతపాడుతూ పేదల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. కార్పొరేట్ శక్తులకు వేలకోట్ల రూపాయల రాయితీ కల్పించి పేదల పై మాత్రం పెనుభారాలు మోపుతున్నారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో ప్రధాని మోడీ పావుగా మారాడాని, అమెరికాలో మన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా మోడీ మాట్లాడడం లేదని అన్నారు. గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందని ప్రజలు మళ్లీ కాంగ్రెస్ అధికారం ఇచ్చారని అన్నారు. కాలేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని, కాలేశ్వరం వల్ల ఉమ్మడి వరంగల్ భూపాలపల్లి జిల్లాలకు ఒక్క ఎకరానికి నీరు అందలేదని అన్నారు. ఎప్పటికైనా ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులేనని,  భవిష్యత్తులో ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

భూపాలపల్లి మున్సిపాలిటీపై ఎర్రజెండా ఎగరేద్దాం

సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో భూపాలపల్లి మున్సిపాలిటీ పై ఎర్రజెండాను ఎగరవేద్దామని సిపిఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. చట్టసభలలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉంటేనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. నూతన కమిటీ నిర్ణయాలను అమలు చేసే దిశగా పనిచేయాలని కోరారు.ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించాలని మహాసభలో తీర్మానించారు.మీరు చేయబోయే ప్రతి పోరాటం లో రాష్ట్ర, జిల్లా పార్టీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.ఈ మహా సభల్లో సిపిఐ కౌన్సిల్ సభ్యులు గురుజపెల్లి సుధాకర్ రెడ్డి, జి శ్రీనివాస్, మాతంగి రామ్ చందర్, కొరిమి సుగుణ, మాజీ కౌన్సిలర్ నూకల భూలక్ష్మి చంద్రమౌళి, ఆసిఫ్ పాషా, తాళ్ల పోషం నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్ తో పాటు 250 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page