న్యాయమూర్తులలో అవినీతి

బహిరంగ చర్చే ఈ పురుగుకు మందు

మన రాజ్యాంగంలో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలను బర్తరఫ్‌ ‌చేయడం సులభం కాదు. మామూలుగా ఉద్యోగం ఇచ్చేవాడికి తీసేసే అధికారం కూడా ఉంటుంది. అయితే దానికి సరయిన కారణాలు ఉండాలి. తీసేసే ముందు సహజ న్యాయసూత్రాలను పాటించి విచారణ జరపాలి అని చట్టం చెప్తుంది. ఒక్క హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల విషయం మాత్రమే ఇందుకు భిన్నమైనది. వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేది ప్రభుత్వమే కాని వారు ఎంతటి తప్పు చేసినా వారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు. ఆ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది.
 కె.బాలగోపాల్‌, ప్రజాతంత్ర ‘నిగాప్‌ా’, సెప్టెంబర్‌ 19,2004
జడ్జి అవినీతిపరుడయితే దానివల్ల ఏ విధంగా ప్రయోజనం పొందుదామా అని చూడడం సగటు లాయరు లక్షణం. అవినీతిని దూరం ఉంచేవారు జడ్జీలలో చాలా మందే ఉండవచ్చును గానీ జడ్జీలలోని అవినీతిని తన వృత్తి ప్రయోజనం కోసం వాడుకోవడంలో తప్పు లేదన్న ఆలోచనను దూరం ఉంచే లాయర్లు ఎక్కువ మంది ఉండరు. అందువల్లనే, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి అవినీతిపరుడని ఆరోపిస్తూ, అతనిని బర్తరఫ్‌ చేయాలని మద్రాసు హైకోర్టు లాయర్లు ఆందోళనకు దిగడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎవరికి వారు స్వంత ప్రయోజనం చూసుకునే ఆలోచన విడిచిపెట్టి ఉమ్మడిగా అతన్ని బర్తరఫ్‌ చేసి న్యాయవ్యవస్థను కాపాడాలని నినదించడం ఇవ్వాల్టి సమాజంలో అసాధారణ విషయమే మరి.
అవినీతి అంటే లంచగొండితనం అని మాత్రమే అనుకుంటే పై స్థాయి న్యాయస్థానాలలో అవినీతిపరులైన న్యాయ మూర్తులు ఎక్కువమంది ఉండక పోవచ్చు. ఏ వ్యవస్థలోనైనా కొంత మంది స్వతహాగా నీతిమం తులు ంటారు. వారిని పక్కన పెట్టినా, ఉన్నత న్యాయస్థానాలలో న్యాయ మూర్తులుగా ఉండే వారికి జీతభత్యాలు బాగుండడమే కాక రిటైరయిన తరువాత కూడా ఎన్నో కొన్ని కమిషన్లు, ఆర్బిట్రేషన్లు వగైరాలతో జీవితాంతం అదే హో దాలో బతికే అవకాశం ఉం టు ంది. డబ్బుకు కక్కుర్తి పడి దానిని చేజార్చుకోవడం సబబు కాదని భావించడానికి ఏమంత నీతిమంతులు కానవసరం లేదు. అయినప్పటికీ కొంత మంది లంచగొండ్లు ఉన్నారనేది వాస్తవం.
అయితే అవినీతి అనే మాటకు లంచం తిని తప్పుడు తీర్పు ఇవ్వడం అని మాత్రమే కాక, న్యాయ నిర్ణయానికి బాహ్య మైన ఒత్తిళ్లకూ ప్రయోజనాలకూ లోనుకావడం అనే విస్తృతమైన అర్థంలో కూడా తీసుకున్నట్టయితే అవినీతి పరులు న్యాయస్థానాల్లో అన్ని స్థాయిలలోనూ చాలామందే ఉన్నారని చెప్పక తప్పదు. కానీ దీని గురించి సమాజానికి పెద్దగా తెలియదు. తెలియకపోవడానికి కారణమేమిటంటే, తెలియజెప్పగల లాయర్లు ఈ విషయాన్ని బయటపెట్టడం కంటే దీనవల్ల  ప్రయోజనం పొందడమే తెలివైన పని అని భావించడం. ఈ వైఖరి న్యాయవ్యవస్థకు చాలా నష్టం చేస్తున్నదని వేరే చెప్పనవసరం లేదు.
అందుకే జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలంటూ మద్రాసు హైకోర్టు లాయర్లు ఆందోళన చేయడం చెప్పుకోదగ్గ విషయం. మన రాజ్యాంగంలో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలను బర్తరఫ్‌ చేయడం సులభం కాదు. మామూలుగా ఉద్యోగం ఇచ్చేవాడికి తీసేసే అధికారం కూడా ఉంటుంది. అయితే దానికి సరయిన కారణాలు ఉండాలి. తీసేసే ముందు సహజ న్యాయసూత్రాలను పాటించి విచారణ జరపాలి అని చట్టం చెప్తుంది. ఒక్క హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల విషయం మాత్రమే ఇందుకు భిన్నమైనది. వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేది ప్రభుత్వమే కాని వారు ఎంతటి తప్పు చేసినా వారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు. ఆ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. వందమంది పార్లమెంట్‌ సభ్యులు బర్తరఫ్‌ ప్రతిపాదనపైన సంతకాలు చేయాలి. ఆపైన దానిని పార్లమెంట్‌ చర్చించి మూడిరట రెండు వంతుల మెజార్టీతో ఆమోదించాలి. అప్పుడు మాత్రమే హైకోర్టు లేక సుప్రీంకోర్టు జడ్జిని ఉద్యోగం నుండి తొలగి ంచడం జరుగుతుంది.
జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి బర్తరఫ్‌ ప్రతిపాదనను మద్రాసు హైకోర్టు న్యాయవాదులు తయారు చేసారు.
అదొక 262 పేజీల గ్రంథం. దానిపైన 100 మంది పార్లమెంట్‌ సభ్యులు సంతకాలు చేస్తే అది పార్లమెంట్‌ ముందుకు చర్చకోసం వస్తుంది. మూడిరట రెండువంతుల మంది దానిని ఆమోదిస్తే ఆయన గారి ఉద్యోగం పోతుంది. ప్రస్తుతానికి వామపక్ష పార్టీల ఎంపిలు దానిపై సంతకం చేయడానికి ఒప్పుకున్నారని వినికిడి. అయితే వారు 60 చిల్లర మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇంకా 40 దాకా సంతకాలు అవసరం.
జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి పైన ఉన్న అభియో గాలను అర్థం చేసుకోవాలంటే హైకోర్టులలో అనుసరించే వ్యవహార నియమాలను తెలుసుకోవాలి. హైకోర్టులో చాలా రకాల కేసులు విచారణకొస్తుంటాయి. క్రిమినల్‌ కేసులు, సివిల్‌ కేసులు, కంపెనీ కేసులు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన రిట్‌ పిటిషన్లు వగైరా. వీటిలో ఏ జడ్జి ఏ కేసులు వినాలనేది ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారు. ఈ ఏర్పాటు స్థిరంగా ఉండదు. రెండు మూడు నెలలకొకసారి మారుతుంటుంది. అంటే రెండు మూడు  నెలలకొకసారి ప్రధాన న్యాయమూర్తి ఏ జడ్జి ఏ కేసులు వినాలో నిర్ణయించే ‘రోస్టర్‌’ ప్రకటిస్తారు. మళ్ళీ అది మారేంత వరకు ఆ ప్రకారమే కేసులు విచారించడం జరుగుతుంది.
రెండు మూడు నెలలకొకసారి అంటున్నామంటేనే దీనికొక కచ్చితమైన నియమమేదీ లేదని అర్థం. ఎన్ని రోజులకొకసారి ఈ ‘రోస్టర్‌’ మారుతుందనేది ప్రధాన న్యాయమూర్తి ఇష్టం. అంతేకాదు, ఒకసారి ‘రోస్టర్‌’ ప్రకటించిన తరువాత కూడా ఏ రోజయినా ఏ కేసులోనయినా ఒక జడ్జి దగ్గర నుంచి తీసేసి ఇంకొక జడ్జి ముందు విచారణకు పెట్టే అధికారమూ ప్రధాన న్యాయమూర్తికి ఉంది. ఇదొక విశృంఖల అధికారమనీ, దీనికిఏ పరిమితి లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యా నించి ఉంది. చట్టమూ, న్యాయసిద్ధాంతమూ ఒకటే అయినప్పుడు ఏ కేసు ఏ న్యాయమూర్తి వింటే ఏం? అనుకునేంత అమాయకులు ఇప్పుడెవరూ లేరనుకుంటాను. చట్టమూ న్యాయసిద్ధాంతమూ ఒకటే అయినా దానిని అన్వయించే కోణాలు వంద ఉంటాయి. అందువల్ల కేసు ఏ జడ్జి ముందు వస్తుందనేది అతి ముఖ్యమైన విషయం అని ప్రతి లిటిగెంటుకూ తెలుసు.
సాధారణంగా ఒకసారి రోస్టర్‌ నిర్ణయించిన తరువాత, రెండు నెలలకో, మూడు నెలలకో కొత్త రోస్టర్‌ ప్రకటించేంత వరకు ఒక కేసును ఒక జడ్జి ముందు నుంచి తీసేసి ఇంకొక జడ్జి ముందు ఉంచడం జరగదు. ఆ పని చేసే విశృంఖల అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉందని సుప్రీంకోర్టు భాష్యం చెప్పినప్పటికీ క్రమశిక్షణ గల ప్రధాన న్యాయ మూర్తులు ఎవరూ ఆ పని చేయరు. జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రికి సన్ని హితులైన వారి కేసులను, ఇతరత్రా బలవంతులయిన వారి కేసులను వారిని ఇబ్బంది పెట్టే జడ్జీల లిస్టు నుంచి తీసేసి వారికి అనుకూలమైన జడ్జీల లిస్టులో పెట్టించిన ఘటనలు జరిగాయనేది ఆయ నపై గల అభియో గాలలో ముఖ్య మై నది. ఈ పని ఆయన రహస్యంగా కూడా చేయలేదు. అందరికీ తెలిసేటట్టే చేసాడు.
మరొక అభియోగం, ఒక న్యాయవాదికి చాలా అనుకూలంగా వ్యవహరించడం. ఈ న్యాయవాది వేరే ఎవరో కాదు. మన హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పని చేసి సుప్రీంకోర్టుకు పోయిన జస్టిస్‌ ఎ. ఆర్‌. లక్ష్మణన్‌ గారి సుపుత్రుడు ఎ.ఆర్‌. ఎల్‌. సుందరేశన్‌. ఇతను ఏ కేసు వేసినా జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి అనుకూలంగా స్పందిస్తున్నారని చెప్పి, అప్పటివరకు  వేరే లాయర్లను పెట్టుకున్న లిటిగెంట్లు వకాలత్‌ మార్పించి సుందరేశన్‌కు వకాలత్‌ ఇవ్వనారం భించారు. ఇది జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి మద్రాసు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన అనతి కాలంలోనే మొదలయిందంటే ఆ పక్షపాతాన్ని కూడా రహస్యంగా ఉంచలేదని అర్థం అవుతుంది.
2003 జూన్‌ 16 నుంచి అక్టోబర్‌ 20 మధ్య కాలంలో సుందరేశన్‌ జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి కోర్టులో 86 అప్పీల్స్‌ దాఖలు చేయగా, అందులో 44 కేసులు మారిన వకాలత్‌ మీద వేసినవేనని మద్రాసు హైకోర్టుల రికార్డులే తెలుపుతున్నాయి. ఇంకా కూడా అభియోగాలున్నాయి. పైన చెప్పినవి పామరులకు సహితం సులభంగా అర్థం అయ్యేవి మాత్రమే. అన్ని అభియోగాల పైనా పార్లమెంట్‌ – ఒకవేళ వంద మంది ఎంపిలు సంతకాలు చేసినట్టయితే – చర్చ చేపట్టవలసి ఉంది. అయితే న్యాయవ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలూ రహస్యంగా ఉండిపోవడమే ఈ చేటుకు మూలం కాబట్టి దీని గురించి ప్రజలు తెలుసుకోవడం అవసరం. చర్చించుకోవడం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page