బీసీల వెంటే కాంగ్రెస్‌ ‌పార్టీ

  • చరిత్రలో ఒక మైలురాయిగా కుల సర్వే
  • కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్‌, ‌ఖురాన్‌ ‌లాంటిది
  • దీన్ని తప్పు పడితే నష్టపోయేది బీసీ సోదరులే..
  • బీసీ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18 : కాంగ్రెస్‌ ‌పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.  బీసీ సంఘాల నాయకులతో జరిగిన సమావేవంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడారు. భారత్‌ ‌జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వొచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్‌ ‌గాంధీ స్పష్టంగా చెప్పారని ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల సర్వే నిర్వహించామన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలి. ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి.. అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుం టుంది. అందుకే రాష్ట్రంలో బీసీ కుల సర్వే నిర్వహించుకున్నాం.

అసెంబ్లీలో ఫిబ్రవరి 4 కు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఫిబ్రవరి 4 ను సోషల్‌ ‌జస్టిస్‌ ‌డేగా ప్రకటించుకున్నాం. పక్కా ప్రణాళికతో మంత్రివర్గ ఉపసంఘం, ఆ తర్వాత డెడికేటెడ్‌ ‌కమిషన్‌ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్‌ ‌లో కుల సర్వే పూర్తి చేశాం. మొదటి విడతలో కుల సర్వేలో పాల్గొనని వారి కోసం రెండో విడతలో అవకాశం కల్పించాం. పూర్తి పారదర్శకంగా కుల సర్వే పూర్తి చేశాం. ఏ పరీక్షలోనైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్‌ ‌నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్నా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేదే తమ ఆలోచన అని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.

కుల సర్వే భాగస్వాములవడం గర్వ కారణం కుల సర్వే చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.  ఇందులో మేం భాగస్వాములవడం తమకు గర్వకారణం అని తెలిపారు. దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి.. దీన్ని తప్పు పడితే నష్టపోయేది బీసీ సోదరులే.. కేవలం డాక్యుమెంట్‌ ‌చేసి వదిలేయకుండా బిల్లు చేశాం. రాజకీయ పరమైన రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించుకున్నాం జనగణనలో కుల గణన ఎప్పుడూ జరగలేదు.. జనగణనలో కులగణన చేర్చితే సరైన లెక్క తేలుతుంది. మండల్‌ ‌కమిషన్‌ ‌కూడా బీసీల లెక్క 52 శాతం అని తేల్చింది.

కానీ మేం కుల సర్వే ద్వారా బీసీల లెక్క 56.36 శాతంగా తేల్చాం. లెక్క తేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంది. పీసీసీ అధ్యక్షులుగా పని చేసినవారిలో ఎక్కువ మంది బీసీలే.. ఈ కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్‌, ‌ఖురాన్‌ ‌లాంటిది.  ఈ కులగణన పునాది లాంటిది.. ముందు అమలు చేసుకుని తర్వాత అవసరాన్ని బట్టి సవరణలు చేసుకోవచ్చు కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్‌ ‌లో పడకండి. ఈ సర్వేను తప్పు పడితే నష్టపోయేది మీరే.. పునాదిలోనే అడ్డుపడితే మీకు మీరే అన్యాయం చేసుకున్న వారవుతారు. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి నేను మీకు మద్దతుగా నిలబడతా..అని సీఎం రేవంత్‌ ‌రెడ్డి భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page