- ఏడాది పాలన పూర్తైన సందర్భంగా శుభాకాంక్షలు
- హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్ష
- రాహుల్ గాంధీ లేఖపై స్పందించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. రవాణాశాఖలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయంటూ కితాబిచ్చారు.మనమిచ్చిన హామీలను విజయవంతంగా అమలుచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.
కాగా రాహుల్ లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తమ నేత రాహుల్ మార్గదర్శకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏడాది పూర్తి చేసుకున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తు విజయవంతంగా ముందుకు వెళ్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి రాహుల్ గాంధీ రాసిన లేఖపై ఆయన స్పందించారు.
కాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కి రాసిన లేఖలో హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. రవాణా శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ చేపట్టిన కార్యక్రమాలను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. తమ దార్శనికతను సాకారం చేసే దిశగా నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.