రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

అర్హులైన భూమి ఉన్న వారికే రైతుభరోసా
సంక్రాంతి తరవాత రైతుభరోసా అమలు చేస్తాం
గతంలోల ఆగా రాళ్లూ రప్పలకు, రోడ్లకు ఇవ్వలేం
బిఆర్‌ఎస్‌ హయాంలో రూ.22,600కోట్లు అనర్హులకు చెల్లింపు
అసెంబ్లీలో వెల్లడిరచిన సిఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌21: గతంలో మాదిరిగా కాకుండా అర్హులైన రైతులందరికీ భరోసా కల్పిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రైతు భరోసా అమలు విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు వద్దన్నారు.  అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శనివారం తో ముగిసాయి . ఏడో రోజు శాసనసభ సమావేశాలు ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కాగా, స్పీకర్‌ అనుమతితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ ప్రారంభించారు. రైతు భరోసా విధివిధానాలపై సూచనలు ఇవ్వాలని మంత్రి తుమ్మల సభ్యులను కోరారు. సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసాపై విధివిధానాలను ఖరారు చేసి, ఆ తర్వాత రైతు భరోసా చెల్లింపులు చేస్తామని మంత్రి ప్రకటించారు.  రైతుబంధుపై చర్చ సందర్భంగా సిఎం రేవంత్‌ సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు విపక్ష బిఆర్‌ఎస్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. పదేళ్ల పాలనతో బిఆర్‌ఎస్‌ తెలంగాణను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రైతు భరోసా అంశంపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. రైతులపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎంతో ప్రేమ ఉందన్నారు. భూమి చుట్టూనే రైతు జీవితం, వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. భూమినే నమ్ముకుని.. భూమినే అమ్మగా భావించి జీవనాధారం సాగిస్తున్నారన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. పెట్టుబడి సాయం కింద రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రైతు భరోసా తెస్తున్నామన్నారు.

 

గత ప్రభుత్వం.. బీఆర్‌ఎస్‌ పార్టీ హయాంలో… సాగులో లేని భూములు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, రాళ్లు, రప్పలు, జాతీయ రహదారుల కింద పోయిన భూములు..  పరిశ్రమల్లోని భూములు ఇలాంటి వాటన్నింటికీ రైతు బంధు కింద.. అనర్హులకు కూడా డబ్బులు ఇచ్చారన్నారు. కేసీఆర్‌ హయాంలో 72 వేల కోట్లు రైతు బంధు కింద చెల్లిస్తే.. అందులో 22 వేల 606 కోట్ల రూపాయలు అనర్హులకే చెల్లించారన్నారు. ఈ 22 వేల 606 కోట్ల రూపాయలు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు దోచుకున్నారన్నారు.  ఇలాంటి తప్పిదాలు అన్నింటినీ సవరించి.. కొత్త విధానాలు రూపొందించి.. అర్హులకే రైతు బంధు సాయం అందించే విధంగా ప్రణాళిక రచిస్తున్నామన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత.. 2025 జనవరి నెలలో కొత్త విధివిధానాలతో రైతు బంధు నిధులు విడుదల చేస్తామన్నారు. నిజమైన రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. హైదరాబాద్‌ లో అసలు వ్యవసాయమే లేదని.. ఇలాంటి హైదరాబాద్‌ సిటీలోనూ రైతు బంధు కింద డబ్బులు దోచుకుని తిన్నారంటూ సీఎం రేవంత్‌ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని  సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.రైతు భరోసాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. రైతు సమాజాన్ని ఆదుకునేందుకు మా ప్రభుత్వం ముందు ఉంటుంది. గత ప్రభుత్వం రైతు బంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ఈ పథకాన్ని తెచ్చారు. సాగులో లేని భూములకూ రైతుబంధు ఇచ్చారు. దీని ద్వారా రూ.22,600 కోట్ల ఆయాచిత లబ్ది చేకూర్చారు. రియల్‌ ఎస్టేట్‌, పారిశ్రామికవేత్తలకూ ఇచ్చారు. రాళ్లకు, గుట్టలకూ రైతుబంధు ఇద్దామా..?‘ అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. రైతు భరోసా అమలు చేయడానికి సభ్యులంతా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు. రైతు భరోసా అమలు చేయడానికి సభ్యులంతా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు.‘జవిూందార్లు, భూస్వాములకు రైతు బంధు ఇవ్వాలా..? విూరు ఇచ్చారు కాబట్టి.. మమ్మల్నీ రాళ్లు, గుట్టలకు రైతు బంధు ఇవ్వాలంటున్నారు.

 

భారాసను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుంటే మేం కూడా ప్రతిపక్షంలోనే ఉండేవాళ్లం. 2023లో అధికారం.. 2024లో డిపాజిట్లు కోల్పోయిన విూరు మాకు ఆదర్శం కాదు. నిజమైన లబ్దిదారులెవరికీ అన్యాయం జరగకూడదు‘ అని సీఎం అన్నారు.‘రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. భారాస పాలనలో 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గించామని చెబుతున్నారు. అబద్దాలు చెప్పే సంఘానికి అధ్యక్షుడు అసెంబ్లీకి రాలేదు. ఆ సంఘానికి ఉపాధ్యక్షుడు అసెంబ్లీకి వొచ్చారు‘ అని సీఎం ఎద్దేవా చేశారు. రైతు భరోసా పథకంపై వివిధ అంశాలను ఆయన వెల్లడించారు. రైతు భరోసా పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఇందిరాగాంధీకి ఉన్న చరిత్ర అందరికీ తెలుసునని అన్నారు. రైతు బందు ఉద్దేశం వ్యవసాయ పెట్టుబడికి సహాయం చేయడమని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రూ. 72 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే, ఈ పథకంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కొనసాగించారు. కేసీఆర్‌ అనుభవం, నాయకత్వాన్ని మేము అంగీకరిస్తున్నాం. కానీ, కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలని.. కేవలం గొప్పగా మాట్లాడటం కాదు, పేద రైతు వరకు ప్రభుత్వ పథకాలు అందించాలని ఆయన అన్నారు. రేవంత్‌ రెడ్డి తన నాయకత్వంలో రైతుల రుణమాఫీ చేయడం విధానాన్ని తెలిపారు. మేము రైతుల రుణమాఫీకి ముందుగానే చర్యలు తీసుకున్నామని, రైతులపై వడ్డీ భారం ఉండకూడదు కాబట్టి మేము ముందుగానే పని చేశామని ఆయన అన్నారు. ఆ తరువాత స్విస్‌ బ్యాంకులోని బిల్లులపై విమర్శలు గుప్పించిన ఆయన, రాజకీయ నాయకులు స్విస్‌ బ్యాంకుకు కూడా అప్పు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. 8 వేల కోట్లు కూడా లేవని కేసీఆర్‌ సభలోనే చెప్పారన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి చివరగా, తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితిపై కూడా మాట్లాడారు. రూ. 72 వేల కోట్లు అప్పులు చేసిన 16 మంది ముఖ్యమంత్రులు వాటి విూద పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page