– సీఎం నేతృత్వంలో నేడు దిల్లీకి మంత్రుల బృందం
– ఎంపీలకు ఉత్తమ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్18: బనకచర్ల విషయంలో ఏపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్‌ని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల నేతృత్వంలోని బృందం కలవనుంది. బుధవారం సాయంత్రం గోదావరి-బనకచర్లపై ఎంపిలకు జలవనరుల శాఖ మంత్రిమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశానికి సిఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీ పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ పోలవరం-బనకచర్ల విషయంలో ఏపీ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. ఏపీ రిపోర్టుపై స్పందించాలని కేంద్రం తమని అడిగిందని తెలిపారు. పూర్తిస్థాయి నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. తాను, సిఎం ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర అభ్యంతరాలను తెలుపుతామని స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు పెద్ద దెబ్బ అని తెలిపారు. ఈ ప్రాజెక్టును పరిశీలించడమంటే రాష్ట్ర హక్కులను కాలరాయడమే అని అన్నారు. బనకచర్లను తిరస్కరించాలని కేంద్రానికి స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. గోదావరి ట్రైబ్యునల్ అవార్డును బనకచర్ల ప్రాజెక్టు ఉల్లంఘిస్తుందని.. తెలంగాణకు అనుకూలమైన ఇచ్చంపల్లిని ఏపీ వ్యతిరేకించిదని మండిపడ్డారు. అత్యవసరంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. తెలంగాణ వాటా 968 టిఎంసిలలో కట్టుకొనే ప్రాజెక్టులను ఏపీ వ్యతిరేకించిందని.. బనకచర్ల వల్ల మన వాటా జలాలకు కూడ భవిష్యత్తులో ఎదురుదెబ్బ తగులుతుందని అన్నారు. పూర్తయిన ప్రాజెక్టులకు అధిక కేటాయింపులను భవిష్యత్తులో ఏపీ అడుగుతున్నదని పేర్కొన్నారు. దీనిపై కేంద్రానికి జనవరి 22న అభ్యంతరాలను చెప్పామన్నారు. అయితే ఏపీ నుంచి డిపిఆర్ అందలేదని కేంద్రం సమాధానం ఇచ్చిందని తెలిపారు.