– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
– మీది ఫెవికాల్ బంధం కాబట్టే తండ్రీకొడుకులు అరెస్టు కాలేదు
-సెంటిమెంట్‌తో ఓట్లు దండుకోవాలని చూస్తున్న బీఆర్‌ఎస్
– ఇక్కడి బస్తీవాసుల నీటి సమస్య తీర్చిన పీజేఆర్
– లక్షలాది పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన పేదోళ్ల దేవుడు ఆయన
– రహమత్ నగర్ డివిజన్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి ప్రసంగం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు పదేపదే చెప్పారు.. ఆ కేసును సీబీఐకి పంపిస్తే 48 గంటల్లో తండ్రీకొడుకులను జైలుకు పంపిస్తామన్నారు.. మీ రెండు పార్టీలది ఫెవికాల్ బంధం కాకపోతే ఈ నెల 11లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ చేయాలి అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ సవాల్ విసిరారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్‌లను అరెస్టు చేయాలి అని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్ (పీజేఆర్ సర్కిల్) వద్ద కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. వార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. ఇందులో మీ చీకటి ఒప్పందం ఏంటి? చీకటి ఒప్పందం చేసుకుని జూబ్లీహిల్స్‌లో బీజేపీ బీఆర్‌ఎస్‌కు పరోక్ష మద్దతు ఇస్తోంది.. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది.. ఇది తాను అంటున్నది కాదు.. వాళ్ల ఆడబిడ్డ చెబుతున్నదేనని అన్నారు. కారు దిల్లీకి చేరగానే కమలంగా మారుతోంది అని ఎద్దేవా చేశారు. 2007లో పీజేఆర్ ఆకస్మికంగా మరణిస్తే టీడీపీ, బీజేపీలు అభ్యర్థిని పెట్టకుండా ఆ కుటుంబాన్ని ఏకగీవ్రంగా నిలబెట్టేందుకు అండగా నిలబడ్డాయని తెలిపారు. కానీ కేసీఆర్ పీజేఆర్ కుటుంబంపై అభ్యర్థిని నిలబెట్టి మంచి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని, పీజేఆర్ సతీమణి కేసీఆర్‌ను కలిసేందుకు వెళితే మూడు గంటలు బయట నిలబెట్టిన దుర్మార్గుడని దుయ్యబట్టారు. ఆనాడు మీకో నీతి, ఇప్పుడు మాకో నీతి? ఆనాడు పీజేఆర్ కుటుంబాన్ని రోడ్డుపై నిలబెట్టినందుకు రహమత్ నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటకు పంపిన దుర్మార్గుడు కేటీఆర్.. ఈయన మాగంటి సునీతమ్మను ఆదుకుంటాడంటే నమ్మేది ఎలా? అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లు మహిళలకు మంత్రి పదవి ఇవ్వని వాళ్లను చీపురు దెబ్బలు కొట్టాలన్నారు. మహిళలకు, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనంటూ పదేళ్లుగా పాలించిన వాళ్లు పేదలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.. ఈ నియోజకవర్గంలో 14,197 రేషన్ కార్డులు పేదోళ్లకు ఇచ్చిన ప్రభుత్వం మాది.. ఇక్కడ 25,925 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. నియోజకవర్గంలో ప్రతి నెలా 23,311 క్వింటాళ్లు సన్న బియ్యం అందిస్తున్నాం.. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎన్నడైనా ఇలాంటి ఆలోచన చేసిండా.. ఎందుకు బీఆర్‌ఎస్‌ను గెలిపించాలో సమాధానం చెప్పాలి అని నిలదీశారు. రేషన్ కార్డులు రద్దు చేయడానికా? సన్న బియ్యం, ఉచిత బస్సు రద్దు చేయడానికా? ఉప ఎన్నిక తరువాత నియోజకవర్గంలో పేదలకు నాలుగు వేల ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది.. పదేళ్లు బెంజ్ కారులో తిరిగిన వాళ్లు ఇవాళ ఆటోలో తిరుగుతూ నటిస్తున్నారు.. పదేళ్లు కనిపించని సమస్యలు వారికి ఇప్పుడు కనిపిస్తున్నాయా అని నిలదీశారు. పదేళ్లు మున్సిపల్ మంత్రిగా ఉండి గాడిద పళ్లు తోమారా? రబ్బరు చెప్పులు లేని వాళ్లకు వందల ఎకరాల ఫామ్ హౌస్‌లు ఎలా వచ్చాయన్నారు. అభివృద్ధి కోసం నవీన్ యాదవ్‌ను గెలిపించండి అని ఓటర్లకు విజ్ఞప్త్తి చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఇతర నేతలు పాల్గొన్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





