ఎపి కేబినేట్ ఘనంగా నివాళి
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ఎపి సిఎం చంద్రబాబు నివాళి అర్పించారు. దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషన్ గ్రహీత, టాటా సన్స్ సంస్థ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా భౌతికకాయానికి ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. ముంబయిలోని ఎన్సీపీఏ గ్రౌండ్లోని పార్థివదేహం ఎదుట పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్తోపాటు, గ్రూప్ ఉన్నతాధికారులు, టాటా కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రతన్ టాటా లాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ లోకాన్ని వీడిపోవడం తీరని లోటన్నారు. ప్రత్యేక విమానంలో ముంబై వచ్చిన బాబు నేరుగా టాటా భౌతిక కాయం సందర్శించి నివాళి అర్పించారు. అంతకు ముందు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముగిసింది. అజెండా అంశాలపై చర్చను క్యాబినెట్ వాయిదా వేసింది.
రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది. భేటీకి ముందు ఆయన చిత్రపటం వద్ద సీఎం చంద్రబాబు, మంత్రులు నివాళి అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముంబయికి బయలుదేరారు. రతన్ టాటా పార్థివ దేహానికి వారు నివాళులర్పించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. కొందరు మాత్రమే తమ అడుగుజాడలు వెళుతూ వెళుతూ ఈ భూమిపై వదిలి వెళతారని, తమ దూరదృష్టి, సమగ్రతలతో రతన్ టాటా అదే చేశారని అన్నారు. మనం కేవలం ఒక గొప్ప వ్యాపారవేత్తనే కాదు గొప్ప మానవతావాదిని కోల్పోయామని, కేవలం పారిశ్రామిక వారసత్వంలోనే కాకుండా ఆయన అందరి హృదయాలను స్పృశించి వెళ్ళారన్నారు.