- ఎన్నో స్కాముల్లో కేటీఆర్ నిందితుడని తేలినా.. ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
- కేటీఆర్ తో పోలిస్తే హరీష్ క్రెడిబిలిటీ ఉన్నోడు
- సంగెం వద్ద కాదు… మూసీ బాధిత ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలి
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8 : కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే, కేసీఆర్ కొడుకు యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తో రేవంత్ రెడ్డి రాజీ పడ్డారని, అందుకే ఈ ఫార్ములా రేస్, రేవ్ పార్టీ, డ్రగ్స్, కాళేశ్వరం సహా అన్ని స్కాంలలో కేటీఆర్ ప్రధాన నిందితుడుని తేలిన తర్వాత కూడా ఆయనను అరెస్ట్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని అన్నారు. ‘‘ఒకనాడు జన్వాడ ఫాంహౌస్ పై డ్రోన్ ఎగిరేశారనే కారణంతో నీ బిడ్డ పెళ్లని కూడా చూడకుండా నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.. అట్లాంటిది ఈరోజు అన్ని స్కాంలలో కేసీఆర్ కొడుకు ముద్దాయి అని తేలినా కూడా ఎందుకు జైలులో పెట్టడం లేదు..అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వొచ్చిన బండి సంజయ్ కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఏమన్నారంటే…
కేసీఆర్ కొడుకు పెద్ద బ్లాక్ మెయిలర్..
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అలుపెరగకుండా పోరాటం చేశాను.. ఆనాడు రేవంత్ రెడ్డి కూడా ఫైట్ చేశాడు. మేం ఫైటర్స్. అందుకే కేసీఆర్ కొడుకుకు నిద్రలో కూడా మేం గుర్తుకొస్తున్నాం.. అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ కొడుకుతో కలిసిపోయాడు. పగలు ఇద్దరూ ఫైట్ చేసుకుంటున్నట్లు నటిస్తున్నారు..రాత్రి ఒక్కటైపోతున్నారు. కేసీఆర్ కొడుకు పెద్ద బ్లాక్ మెయిలర్. గత ప్రభుత్వంలో అవినీతిపరుడు. బయటపడుతున్న అన్ని స్కాంలలో ఆయనే సూత్రధారి. అయినా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదంటే మీరే అర్ధం చేసుకోండి. ఆనాడు జన్వాడ ఫాంహౌస్ పై డ్రోన్ ఎగరేసినందుకే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలులో పెట్టాడు. అది కూడా రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లిచేసుకునే రోజే. కన్నకూతురి పెండ్లి జరుగుతుంటే.. చూడనీయకుండా కర్కశంగా అరెస్ట్ చేసి జైలుకు పంపాడు. అట్లాంటోడు ఈరోజు అన్ని స్కాంలలో ప్రధాన నిందితుడని తెలిసి కూడా అరెస్ట్ చేయకుండా మీన మేషాలు లెక్క పెడుతునాడంటే ఏమనుకోవాలి. చివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ చెబితేనే చేశామని నిందితుడు చెప్పినా అరెస్ట్ చేయలేదు. కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయి… కేసీఆర్ కుటుంబమనే కారణమని తేలినా చర్యలు తీసుకోలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే…కేటీఆర్ యాక్టింగ్ సీఎం. అందుకే జన్వాడ బామ్మర్థి ఫాంహౌస్ కేసులో అడ్డంగా దొరికిన విజయ్ మద్దూరిని, సూత్రధారి అయిన రాజ్ పాకాలపై నామ్ కే వాస్తే కేసులు పెట్టి వదిలేశారు. ఈ రేవ్ పార్టీలో కేసీఆర్ కొడుకు ఉన్నాడని మీడియా అంతా కోడై కూసినా పట్టించుకోలేదు అని బండి సంజయ్ విమర్శించారు. .
బీఆర్ఎస్ దుకాణం బంద్..
ఏనాడూ బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులైతే పోలీసులకు ఫోన్ చేయని కేసీఆర్… తన కొడుకు బామ్మర్థి కేసు గురించి మాత్రం ఏకంగా డీజీపికి ఫోన్ చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కు కార్యకర్తల కంటే కుటుంబమే ముఖ్యమని… అందుకే బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచించే కార్యకర్తలే కరువయ్యారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పటి నుండో పక్కచూపులు చూస్తున్నారు. ఇక కేసీఆర్ అయితే ప్రజల సమస్యలను, కార్యకర్తల కష్టాలను గాలికొదిలేసి హాయిగా ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఎన్నికల్లో మాత్రమే మేకప్ వేసుకుని బయటకొచ్చి అలాంటి లీడర్లను ప్రజలెట్లా నమ్ముతారు. బీఆర్ఎస్ పనైపోయింది… అందుకే గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకడం లేదు. కనీసం బీఆర్ఎస్ పోటీ చేసే పరిస్థితి కూడా లేదని అన్నారు.
మూసీ ప్రాంతంలో సీఎం పాదయాత్ర చేపట్టాలి..
రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలోని సంగెం వద్ద మూసీ కోసం పాదయాత్ర చేస్తున్నారని, నేను నా పాదయాత్రలో ఆ ప్రాంతమంతా తిరిగానని, ప్రజల బాధలు కళ్లారా చూశానని.. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాల్సింది సంగెం వద్ద కాదని.. మూసీ పునరుజ్జీవంతో ఇండ్లు కోల్పోతున్న బాధిత ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టాలని డిమాండ్ చేశారు. అక్కడ తిరిగితేనే పేదల కష్టాలు, కన్నీళ్లు తెలుస్తాయన్నారు. ఆరు గ్యారంటీల విషయంలో పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
కేటీఆర్ కు కళ్లు నెత్తికెక్కాయ్..
కేసీఆర్ కొడుకుకు కళ్లు నెత్తికెక్కాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. బరితెగించి కండకావరమెక్కి పెద్దా, చిన్నా తేడా లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. ప్రధానమంత్రి పదవికి కనీసం గౌరవం ఇవ్వకుండా మోదీపై నోటికొచ్చిందలా మాట్లాడుతున్నాడని, నెత్తికెక్కిన కళ్లను కిందకు దించుతామని అన్నారు. ఈ మధ్య కేసీఆర్ కొడుకు సిగ్గు, శరం అన్నీ వదిలేసి బరితెగించి తిరుగుతున్నాడని, ఆటో డ్రైవర్ల పొట్టకొట్టి సర్వనాశనం చేసిందే బీఆర్ఎస్… అధికారం పోగానే సిగ్గు లేకుండా వాళ్లు ధర్నా చేస్తే పోయి మద్దతిస్తున్నాడని అన్నారు. సర్పంచులను బిచ్చగాళ్లు చేసిందే బీఆర్ఎస్ అని, అయినా వాళ్లు చేస్తున్న ఆందోళనలో పాల్గొంటున్నాడు. నేను ఆందోళనకారులకు చేసే విజ్ఝప్తి ఒక్కటే… మీ సమస్యలను సృష్టించినోళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్. మళ్లీ వాళ్లను కలిస్తే మీరే చులకన అవుతారు. మీకోసం మొదటి నుంచి పోరాడుతున్నది బీజేపీయేనని తెలుసుకోవాలని చెప్పారు. కేసీఆర్ కొడుకు పిరికిపంద. ట్విట్టర్లో, మీడియాలో తప్ప ప్రజల్లోకి వెళ్లి ఫైట్ చేసే దమ్ములేనోడని మండిపడ్డారు.
కేటీఆర్ లీగల్ నోటీసులకు రిప్లై
కేసీఆర్ కొడుకు ఇచ్చిన లీగల్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చానని, అప్పటి నుంచి నోరు మూసుకుని కూర్చున్నాడని తెలిపారు. తాను తప్పుగా మాట్లాడితే మళ్లీ ఎందుకు కౌంటర్ ఇవ్వలేదని ప్రశ్నించారు. తానే ఆయనకు నోటీసు ఇస్తానని, అసలు కేసీఆర్ కొడుకు మాట్లాడే అహంకారపు మాటలకు, మాట్లాడే బూతులకు గంటకో నోటీస్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. త్వరలోనే ఆయనను నేలకు దించుతామన్నారు. . ఆయన మాదిరిగా తాను అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదని, తండ్రి పేరు చెప్పుకుని పదవులు తీసుకోలేదని, 6 గ్యారంటీలపై కొట్లాడే దమ్ము లేనోడు.. రేవంత్ తో కుమ్కక్కైనోడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతానంటే నమ్మేదెవరు? ప్రశ్నించారు. కేసీఆర్ కొడుకుతో పోలిస్తే అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ హరీష్ రావేనని కేంద్ర సహాయం మంత్రి బండి సంజయ్ అన్నారు.





