సమాచారం ఇవ్వనివారి కోసమే మరో ఛాన్స్
బలహీన వర్గాలను అణచివేయాలనేదే బిఆర్‌ఎస్ ఆలోచన
బిజెపికి బిసి రిజర్వేషన్ ఇష్టం లేదు..
అందుకే అడ్డుపడుతున్నారు..
బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : దేశానికే రోల్ మోడల్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపి పకడ్బందీగా కుల గణన సర్వే చేపట్టిందని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు గాను కోటి 12 లక్షల కుటుంబాలు స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చాయని వెల్లడించారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక పరిశీలకుడిని పెట్టి మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఈ ప్రక్రియ చేపట్టామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వంలోని పెద్దలు అటు సిఎస్ ఇతర ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈ ప్రక్రియనంతా సజావు గా, ట్రాన్సపరెంట్ గా జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దాదాపు 3.1 శాతంలో కొంత మంది తమ సమాచారం ఇవ్వలేదని ఇపుడు వారికి కూడా మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
ఫిబ్రవరి 16 నుండి 28వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంకా సమాచారం ఇవ్వని 3.1 శాతం ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కొందరు బిఆర్‌ఎస్ నేతలు రీ సర్వే జరుగుతుందని అంటున్నారని కానీ ఇది రీ సర్వే కాదు సర్వేలో మిస్సయినవారి కోసం మరో చాన్స్ ఇస్తున్నామని చెప్పారు. మార్చి మొదటి వారంలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆ తర్వాత ప్రత్యేక శాసన సభ సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 42 శాతం స్థానిక సంస్థలు, విద్యా, ఉపాధి అవకాశాల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పంతో చట్టబద్ధత తెచ్చే కార్యాచరణ తీసుకున్నామని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఎవరు కూడా ఈ సర్వేలో పాల్గొనకుండా దానిని విమర్శలకు పరిమితం చేస్తున్నారు. వారి మానసిక స్థితిని చూస్తే బలహీన వర్గాలను ఏ విధంగా అణచివేయాలని స్పష్టంగా కనిపిస్తుందని, మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పువొచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. తెలంగాణ జనాభా లెక్కల్లో పౌరసభ్యుల్లో సభ్యులుగా ఉండి అవకాశాన్ని కోల్పోకుండా ఉండాలన్నారు.
బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని, వారికి కుల గణన జరగడం ఇష్టం లేదని విమర్శించారు. వారికి 42శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం, జనాభాకి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదని ఆరోపించారు. అందుకే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించి రాహుల్ గాంధీ నాయకత్వంలో బడ్జెట్ సమావేశంలో దీనిని ఆమోదింపజేసుకొని కాంగ్రెస్ కు ఉన్న 100 మంది పార్లమెంట్ సభ్యులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలను కలిసి తమిళనాడులో మాదిరి 69 శాతం రిజర్వేషన్లు ఎలా ఉపయోగిస్తున్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా శాసనసభలో సభ అభిప్రాయం తో పాటు తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా పడటం వల్ల కేంద్రం నుంచి నిధులు రావో ఆ నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం భరించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుందన్నారు.
మరో వైపు కుల గణన జరిగిన తర్వాత బీసీ సంఘాల నాయకులను ప్రభుత్వం తరఫున పిలిచి చర్చించామని, వారి అభిప్రాయాలు తీసుకున్నామని, కుల సర్వేలో మిస్సయిన వారికి అవకాశం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారని తెలిపారు. అందరూ సర్వేలో పాల్గొనే విధంగా బీసీ సంఘాలు ప్రోత్సహించాలని కోరారు. బీజేపీ, బిఆర్‌ఎస్ బలహీన వర్గాలపై చిత్తశుద్ధి ఉంటే శాసనసభలో బిల్లు చేసి చట్టబద్ధత చేసి కేంద్రానికి పంపిస్తామని, మీరు మీ పారదర్శకత నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణలో 56% బీసీలు ఉన్నారు 46% రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు.దీనిని అడ్డుకోవడానికి లెక్కలు తప్పని బలహీన వర్గాలను అవమానించే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి వెనుక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు కేశవ రావు, సహచర మంత్రులు రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి ఉన్నారని తెలిపారు.
రాష్ట్ర మంత్రిగా చరిత్రలో ఒక సామాజిక మార్పునకు నాంది కలిగే నిర్ణయం లో భాగస్వామినయ్యానని తెలిపారు. ప్రజలంతా సహకరించాలని, వాస్తవానికి దగ్గరగా చెప్పే ప్రయత్నం చేయాలన్నారు. నగర ప్రాంత ప్రజలు తెలంగాణ జనాభాలో మీ లెక్క ఉండాలంటే సమాచారం ఉండాలంటే మీరు అందులో భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం కోరారు. ఈనెల 16 నుంచి 28 మధ్య జరిగే ఈ ప్రక్రియలో పాల్గొనాలని, గతంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో దూదేకుల వంటి ముస్లింలకు సంబంధించిన కులాలు బీసీల్లో ఉండేవి మనం కొత్తగా తెచ్చినవి కాదు. బీసీ జనాభా 56% వచ్చింది మేం 46% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. 1931లో స్వాతంత్య్రం రాక ముందు కుల సర్వే జరిగిందని మళ్లీ ఇప్పుడు తెలంగాణలో మాత్రమే జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.