రాజకీయ అవసరాల బడ్జెట్‌..

2047 ‌నాటికి వికసిత  భారత్‌ ‌లక్ష్యంగా, పేదరికం నిర్మూలించే ప్రయత్నంగా పేదలు ,యువత ,రైతులు  మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని   ప్రకటిస్తూ,,, సామాన్యులకు మాటలు ,కార్పొరేటర్లకు  మూటల్లో వడ్డించే విధంగా గత బడ్జెట్లకు తీసుపోనీ  విధంగా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని మహాకవి గురజాడ సూక్తి తో ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ‌తన తాజా ఎనిమిదవ బడ్జెట్లో అదే పరంపరను కొనసాగించింది. 2025 -26 కేంద్ర బడ్జెట్‌ 50, 65,345 ‌కోట్లలో ప్రవేశపెట్టగా, రెవెన్యూ లోటు15,68,936 కోట్లు కాగా, నికర లోటు 5,23,246 కోట్లుగా ఉంది. గత బడ్జెట్‌ ‌కంటే  సుమారు మూడు లక్షల కోట్లు  అదనంగా కేటాయించిన జిడిపి లోటు  4.4 శాతంగా చూపడం, మొత్తం బడ్జెట్లో 27 లక్షల 20 వేల 286 కోట్లుగా ప్రతిపాదించడం వల్ల  ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు మేలు కలిగేలా బడ్జెట్‌ ‌ప్రతిపాదనలు చేశామని ప్రభుత్వ వర్గాలు  ఊదరగొడుతున్నను వాస్తవానికి మధ్య తరగతి ప్రజలకు, పేదలకు ఒరిగింది ఏమీ లేదు. వేతన కూలీలకు పన్ను బోనంజాయిచ్చామని 12.75 లక్షల వరకు ఆదాయ పన్ను లేదని, దీనివల్ల కోటి మందికి ఊరట అని,కేంద్రానికి లక్ష కోట్ల ఆదాయం తగ్గనున్నదని ప్రచారం చేస్తున్నను  నిజానికి పన్ను  మినాయింపులో పెద్దగా వేతన జీవులకు లాభం కలిగేదేమీ లేదు.

నూతన విధానంలో పన్ను స్లాబులలో మార్పులు  తీసుకురావడం, పాత విధానంలో మాదిరిగా మినాయింపుల అవకాశం లేకుండా చేయడం వల్ల 12.75 లక్షల రూపాయలకు ఒక్క రూపాయి మించిన 60 వేల రిబేటు రాకపోవడం మూలంగా ఆదాయ పన్ను భారీగానే చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు వార్షిక ఆదాయం 13 లక్షల అయితే కట్టాల్సిన ఆదాయం పన్ను 63000, వార్షిక ఆదాయము 14 లక్షలు అయితే  కట్టాల్సిన ఆదాయం పన్ను 81900. ఈ ఆదాయ పన్ను తగ్గింపు వెనుక పలు రాజకీయ కోణాలతో పాటు అందరిని నూతన విధానంలోకి మళ్లించే కుట్రలో భాగమే. ఆరాటంఆరు పాళ్ళు , చేతలు మూడు పాళ్లు అన్న చందంగా వేతన జీవులకు రాయితీ భారీ మొత్తంలో తగ్గింపును ఇస్తున్నామని  పెద్ద మొత్తంలో ప్రచారం చేస్తూ ఉద్యోగులకు ప్రజలకు అంతరాలు  పెంచేవిధంగా బడ్జెట్లో ప్రయత్నాలు ఉండటం విచారకరం. ఇలా వ్యక్తిగత ఆదాయ పన్ను నుండి వచ్చే ఆదాయం, కార్పొరేట్‌ ‌వ్యక్తుల నుండి వచ్చే ఆదాయం పన్ను కన్నా ఎక్కువ. పరోక్ష పన్నుల రూపంలో ప్రతి ఒక్కరూ చివరికి బిక్షగాండ్లు కూడా పన్ను చెల్లించాల్సిందే, కానీ కార్పొరేట్‌ ‌మద్దతుదారులకు పన్ను రాయితీలు కల్పించి ప్రతి బడ్జెట్లో వారికి అనుకూలంగా పెద్దపీట వేయడం  ఆదాయ అసమానతలు పెంచడం అవుతుంది. బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టడంలో కేంద్ర ప్రభుత్వం  సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా విస్మరించింది.

లోపించిన  సమాఖ్య స్ఫూర్తి……
కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు అందిస్తున్న పన్నుల  వాటా ఆధారంగా రాష్ట్రాలకు రావలసిన రాయితీలను,  పండింగ్‌ ‌కేటాయింపులను జనాభా దామాషా ప్రకారం పంచాల్సి ఉంది. కానీ ఈ బడ్జెట్లో తమ ప్రభుత్వం మద్దతుదారులైన బీహార్‌, ఆం‌ధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రాలకు బడ్జెట్‌ ‌కేటాయింపులు భారీగా కేటాయించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలైన గుజరాత్‌ ‌మహారాష్ట్రలకు వివక్షపూరితంగా నిధులు కేటాయించారు. అలాగే ఇటీవల ఎన్నికలు జరగబోయే ఢిల్లీ ,బీహార్‌ ‌రాష్ట్రాలకు అత్యధికంగా నిధులు కేటాయించడం,  స్థూల దేశోత్పత్తిలో ఐదు శాతం  వాటాను  అందిస్తున్న, ఎనిమిది మంది బిజెపి పార్లమెంట్‌ ‌సభ్యులు,  ఇద్దరూ కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించారు. అలాగే మోడీ ప్రభుత్వం ఏనాడు కూడా   సమాఖ్య స్ఫూర్తిని  పాటించలేదు, పట్టించుకోలేదు.

రైతులపై కరుణేది?….
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ,రైతే  రాజు అని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల హామీలో ప్రగల్బాలు పలికి, గత ప్రభుత్వ  హయాంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ ‌కు  దార దత్తం చేసే విధంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురావడంతో నెలల తరబడి రైతులు ఢిల్లీ పురవీధుల్లో ఎముకలు కొరికే చలిలో సైతం తమ నిరసన కార్యక్రమాలు చేపట్టి, సుమారు 700 పై చిలుకు రైతుల బలిదానాల  ఫలితంగా వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన ప్రభుత్వం , రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. రైతులకు ప్రాధాన్యతనిస్తున్నామని చెబుతూనే  రైతాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా  చర్యలు తీసుకోవడం బాధాకరం. ఈసారి బడ్జెట్లో కూడా కనీస మద్దతు ధరకు చట్టబద్ద ప్రస్తావన లేదు. రైతుల రుణ  విముక్తికి  ఎలాంటి చర్యలు ప్రతిపాదించలేదు. కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డుల  రుణ పరిమితి పెంచుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, వాటితో రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే పేరుతో ఎరువుల సబ్సిడీని తగ్గిస్తూ వస్తుంది .ఎరువుల సబ్సిడీ 3 412 కోట్లు తగ్గించడం వల్ల రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. దానివల్ల ఉత్పాదకత తగ్గి  వ్యయ భారం పెరుగుతుంది. వ్యవసాయ రంగానికి మొత్తం బడ్జెట్లో కనీసం 8 శాతం కేటాయించాలని  కోరుతుంటే కేవలం 2.5% మాత్రమే  కేటాయించి   రైతును రాజు చేస్తామనడం హాస్యా స్పదం.

ప్రభుత్వ రంగం  నిర్వీర్యం అయ్యేలా ….
విత్తమంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ‌పద్దులో  ప్రభుత్వ రంగాన్ని కనుమరుగయ్యేలా ప్రతిపాదనలు ఉండటం దేశా భివృద్ధికి శరఘాతం. పన్నులు, ఇంధనం ,గనుల త్రవ్వకం, పట్టణ అభివృద్ధి  ఆర్థిక నియంత్రణ రంగాలపై దృష్టి సారించి అభివృద్ధికి  ఊతమిచ్చేలా సంస్కరణలు చేపడుతున్నామని చెప్పి  ప్రైవేటీకరణకు రెడ్‌ ‌కార్పెట్‌ ‌వేయడం ప్రభుత్వ రంగ సంస్థలను లేకుండా చేయడమేనని ఆర్థిక విశ్లేషకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పి బలోపేతం చేయగా ఎన్డీఏ హయాంలోని ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను  నిర్వీర్యం చేశాయి, చేస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో కూడా బీమా రంగాన్ని పూర్తిగా ప్రవేట్‌ ‌ఫరం చేసే విధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వాటాను 74 శాతం 100% పెంచే ప్రతిపాదన ఉండటం వల్ల దేశీయ ఇన్సూరెన్స్ ‌సంస్థలను ముఖ్యంగా ఎల్‌ఐసి సంస్థను పాతర  వేయడంలో భాగమే. గతంలో  టెలికం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ ‌ను, నవరత్న కంపెనీలలో, ప్రభుత్వ వాటాలను తగ్గిస్తూ  ప్రైవేటు వాటాలను పెంచడం, అదేవిధంగా విద్యుత్‌ ‌రంగాన్ని ప్రవేట్‌ ‌పరం చేయాలని భావిస్తుంది.

మరోసారి విద్యా వైద్యరంగం పట్ల చిన్నచూపు….
దేశాభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యా రంగం పట్ల, పేదల విద్యకు గ్యారెంటీ ఇచ్చేలా, కామన్‌ ‌స్కూల్‌ ‌విద్య  నెలకొల్పేలా బడ్జెట్‌ ‌కేటాయింపులు లేకపోవడం ఆశ్చర్యకరం. బేటి పడావో బేటి బచావో అనే నినాదాన్ని పలుమార్లు ఉచ్చరిస్తూ ఆదిశగా ప్రయత్నాలు లేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని  మధ్యతరగతి వర్గాల అభివృద్ధి,   సంక్షేమం పట్ల   ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. 1966 లోనే కొఠారి కమిషన్‌  ‌జిడిపిలో విద్యకు 6శాతం నిధులు కేటాయించాలని సూచించినను, నేటి వరకు కూడా దానిని అమలు చేయకపోవడం పాలకవర్గాలకు విద్య అభివృద్ధి పట్ల వారికున్న  ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు.  నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ‌లో కూడా నామమాత్రంగా కేవలం2.53  శాతం నిధులను మాత్రమే కేటాయించారు. నిధులు కేటాయించకుండా 100% నాణ్యమైన విద్యను అందిస్తామనడ0 ఏ మేరకు సాధ్యమొ   ఏలికలకే తెలియాలి. క్రమక్రమంగా  విద్యకు నిధులు తగ్గించడం వల్ల విద్యాభివృద్ధి  కుంటూ పడింది. దేశం లోని విశ్వవిద్యాలయాలన్నీ పతనావస్థలో ఉన్నాయి.   లక్షలాది ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరిశోధన రంగం పడకేసింది.

అదేవిధంగా వైద్యం పేరుతో కార్పొరేట్‌, ‌ప్రైవేటు దోపిడీ ప్రజలను జలగళ్ల పీల్చి పిప్పి చేస్తున్న క్రమంలో ప్రజారోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి తమ నిర్లక్ష్యాన్ని  అలసత్వాన్ని ప్రదర్శించింది. ప్రజల ప్రాణాలను కాపాడడానికి భరోసా కల్పించాల్సిన తరుణంలో వైద్య రంగానికి ప్రాధాన్య తనిస్తున్నామని ప్రకటించుతూనే  విధానపరంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా పేదల ఆరోగ్యానికి మేలు కలిగేది ఏమీ లేదు. మొత్తం బడ్జెట్లో వైద్య రంగానికి కనీసం ఐదు శాతం నుండి 10 శాతం వరకు కేటాయించాల్సి ఉండగా కేవలం 98 వేల కోట్లు అనగా 1.8శాతం మాత్రమే కేటాయించి చేతులు దులుపుకోవడం ప్రజారోగ్యానికి గాలికి వదిలేయడమే అవుతుంది. ఆ కేటాయింపులు కూడా వైద్య రంగంలో పనిచేస్తున్న సిబ్బంది  వేతన భత్యాలకు, నిర్వహణకే సరిపోయేలా ఉండటం ఆశ్చర్యకరం. కరోనా తర్వాత రకరకాల ఇన్ఫెక్షన్లు ప్రబలుతున్న వేళ, క్యాన్సర్‌ ‌మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వాటి నివారణకు కేంద్ర బడ్జెట్‌ ‌లో ఎటువంటి ప్రతిపాదన లేకపోవడం ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ పట్ల అశ్రద్ధ కనపరచడమేనని, కోట్లాదిమంది   అణ గారిన వర్గాల వైద్య ఖర్చులను తగ్గించేందుకు లక్షల కోట్ల బడ్జెట్లో పరిష్కారాలు చూపకపోవడం శోచనీయం. క్షేత్ర స్థాయిలో మౌలిక వసతుల కల్పన, టీచింగ్‌ ‌సిబ్బంది కొరత నివారించకుండా  మెడికల్‌ ‌విద్యను సరళతరం చేయడం, ఇంకనూ 75 వేల సీట్లు పెంచుతామని ప్రతిపాదనలు చేయడం ఇబ్బంది కరం.

గ్రామీణ అభివృద్ధి గాలికి…..
దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని గత నాయకులు భావిస్తే నేడు గ్రామీణ భారత అభివృద్ధిని గాలికి వదిలేశారు. గ్రామాలలో నిరుపేద కూలీలకు ఉపాధి హామీని కల్పించే   ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా యూపీఏ ప్రభుత్వం  మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారం భించింది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే విధంగా క్రమక్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తుంది. బడ్జెట్‌ ‌తగ్గించడం మూలంగా వందరోజుల పని దినాలకు బదులుగా కేవలం 41 రోజులు మాత్రమే పని  కల్పించి చట్టాన్ని నిర్మూలించే దిశగా చర్యలు ఉండడం వల్ల భవిష్యత్తులో గ్రామీణ భారతం అర్ధాకలితో ఆల్మట్టించే పరిస్థితి దాపురించనుంది. వాస్తవానికి పథకాలన్నింటిలో పేదలకు  బాగా ఉపయోగపడింది ఉపాధి హామీ పథకం మాత్రమే. దానిని కూడా నిర్వీర్యం చేసి ఎత్తి వేసే దిశగా పావులు కల పడం ప్రభుత్వం ఎవరి  మేలు గురించి    శ్రద్ధ చూ• •స్తుందో అవగతం అవుతుంది.

ముగింపు….
ఆకర్షనీయమైన పదాల పొందికతో, నినాదాలతో ఆదర్శాలు మహా కవుల మాటలను  ఉటంకిస్తూ అత్యంత ఆర్భాటంగా 0% పేదరికం లక్ష్యంగా  వికసిత  భారత్‌ ‌నిర్మాణం చేస్తున్నామని అది మా వల్లనే సాధ్యమని, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలలో దేశ ఆర్థిక వ్యవస్థ ముందంజలో ఉన్నదని, దేశ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పని చేసే ప్రభుత్వంగా ప్రచార పటాటోప0 నిర్వహిస్తూ…. మరోవైపు అంకెల గారడి మోసపూరిత విధానాల తో మధ్యతరగతి ప్రజలను మభ్యపెట్టి మసి పూసిన మారేడు కాయ చందంగా గత బడ్జెట్లో లాగానే సంపన్నుల ప్రయోజనాల కోసం సింహ భాగం కేటాయించడం, పేద ప్రజలను విస్మరించడమే. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మధ్యతరగతి ప్రజలకు మేలు చేశామనే ప్రచారం, కానీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం లబ్ధి కోసం పాటుపడినట్లు నూతన పద్దు స్పష్టంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఎన్నికలు జరగబోయే ఢిల్లీ, బీహార్‌ ‌రాష్ట్రాలలో లబ్ధి పొందేందుకు భారీగా  తాయిలాలు అందించడం జరిగింది. కాని ఆర్థిక వ్యవస్థలో పలు రంగాలు ఎదుర్కొంటున్న డిమాండ్‌ ‌సమస్యను పరిష్కరించడంలో, నిరుద్యోగ మహమ్మారిని నిర్మూలించే దిశగా, వేతనాల  తగ్గుదలకు కారణాలు, ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు  సత్వర చర్యలు, కనీస వేతన పెరుగుదల మరియు దాని అమలు, కార్మిక వర్గం సంక్షేమం గురించి పట్టించుకునే పరిస్థితులు కనుచూపుమేరలో  లేవు. పాలకవర్గం గద్దెనెక్కిన దగ్గర నుండి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 50% తగ్గినను దేశంలో మాత్రం పెట్రోల్‌ ‌డీజిల్‌ ‌ధరలు మండుతూనే ఉన్నాయి.

ద్రవ్యోల్బణం కొండ ఎక్కింది. ప్రభుత్వ, వ్యవసాయ రంగాలు  నిర్వీర్యం అవుతూనే ఉన్నాయి. ప్రజల అవసరాలు పట్టించుకోకుండా కార్పొరేట్‌ ‌ప్రయోజనాలకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు బడ్జెట్‌  ‌ప్రతిబింబిస్తుంది. దేశంలో జనాభా   దామాషాగా 16% గా ఉన్న ఎస్సీలకు 16% నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం ఐదు శాతం, ఏడు శాతంగా ఉన్న గిరిజనులకు రెండు శాతం, 50% పైబడి ఉన్న బీసీలకు నిర్దిష్టమైన బడ్జెట్‌ ‌లేని పరిస్థితి తో బలహీన వర్గాల సంక్షేమం ఎలా సాధ్యం? 0% పేదరిక లక్ష్యం ఎలా నెరవేరుతుంది?  ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌  ‌కర్షకులకు కార్మికులకు శ్రమజీవులకు పేదలకు ఉపయోగపడేదిగా లేదని,ఫక్తు  ఎన్నికలు జరగబోయే పాలకవర్గాల రాష్ట్రాలకి తమ భాగస్వామ్య పక్షాలు  పాలిస్తున్న రాష్ట్రాలకు ఉపయోగపరంగా రాజకీయ అవసరాల బడ్జెట్‌ ‌గా ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం..

image.png
తండ సదానందం
మహబూబాబాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page