తెలంగాణలో పదిమంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో లొల్లి మొదలయ్యింది. దీనిపై బిఆర్‌ఎస్ పోరాడుతూనే ఉంది. చివరకు ‘సుప్రీమ్’లో కేసు వేసింది. ఇంతకాలం ఎందుకు చర్య తీసుకో లేదని తాజాగా ‘సుప్రీమ్’ ప్రశ్నించడంతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి ఆ పది మందికి నోటీసులు ఇచ్చారు. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే గతంలో ఎమ్మెల్యేను గంపగుత్తగా పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్, టిడిపి, సిపిఐలను దెబ్బకొట్టిన చరిత్ర బిఆర్‌ఎస్ పార్టీది. తెలంగాణ పునరేకీకరణ పేరుతో నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను గోడ దాటించారు.
ఆనాడు వారి చేసివుండకపోయి వుంటే..ఇవాళ బిఆర్‌ఎస్ వాదనకు బలం ఉండేది. నిజాయితీ ఉండేది. పార్టీలు మారడం తప్పే…ఒక పార్టీ నుంచి గెలిచిన వారు మరో పార్టీలోకి మారడం అన్నది సర్వసాధారణం అయింది. రాజ్యంగం ప్రకారం కఠిన నిబంధనలు లేకపోవడంతో జంపింగ్ జిలానీలు ఉండనే ఉంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే దుంకేస్తున్నారు. ఇంతకాలంగా ఇది నడుస్తూనే ఉంది. . తెలంగాణ రావడం ఆ కుటుంబం కోసమే అన్నట్లుగా పాలన సాగించారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి, అభివృద్ది ముసుగేశారు. దాదాపు 7 లక్షల కోట్లు అప్పులు చేసిన పెద్దాయన ఇప్పుడు అసెంబ్లీ మొహం చూడడం లేదు. ఫామ్‌హౌజ్ వీడి బయటకు రావడం లేదు.
కేవలం ఆయన కొడుకు, కూతురు, అల్లుడు మాత్రమే రాజకీయాలు నడుపుతున్నారు. అసెంబ్లీలో కూడా అబద్దాలు చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఉప ఎన్నికలకు సిద్దంగా ఉండండి అంటూ కెటిఆర్ పార్టీ శ్రేణులకు లీకులు ఇస్తున్నారు. తెలంగాణలో అధికారం కోల్పోయిన బిఆర్‌ఎస్, తరవాత పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడ్డది. విజయం సాధించక పోవడంతో పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పదిమంది పోయారని సరిపెట్టుకోవడానికి కూడా లేదు. గతంలో టిఆర్‌ఎస్ ఆడిన విధంగానే కాంగ్రెస్ కూడా పాచికలు వేస్తోంది.బిఆర్‌ఎస్‌ను బొందపెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్, బిజెపిలు పావులు కదుపుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అనేకమంది బిఆర్‌ఎస్‌ను వీడి అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు. అధికారంలో లేకున్నా ఎపిలో విపక్షంగా టిడిపి ఉన్నా బలంగా నిలబడి తిరిగి అధికారం దక్కించుకుంది. అక్కడ జగన్ ఎన్ని విధాలుగా వేధించినా నేతలు, కార్యకర్తలు టిడిపిని వీడలేదు. కానీ బిఆర్‌ఎస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఒక కుటుంబం చేతిలో పార్టీ ఉండిపోయింది. పదేళ్లు అధికారంలో ఉన్నా కుటుంబ పాలన వల్ల బిఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది. అనేక అక్రమాలను మూటకట్టుకుంది. అవే ఇప్పుడు యమపాశాల్కె వెన్నాడుతున్నాయి.
ఓటమి తరవాత ఇక్కడ బిఆర్‌ఎస్, ఎపిలో వైసిపి ఒకే తరహా డ్రామాలు ఆడుతున్నాయి. ఎమ్మెల్యేలను లేదా ఎంపిలను లేదా క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను చేర్చుకోవడంలో తెలంగాణలో పోటీ కేవలం కాంగ్రెస్, బిజెపిల మధ్యనే ఉంది. ఈ రెండు పార్టీలు ఆధిపత్యం లక్ష్యంగా పెట్టుకుని పోరాడుతున్నాయి. దీంతో విపక్ష బిఆర్‌ఎస్‌లో చేరేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ ఇంతగా ప్రజల్లో ఆదరణ కోల్పోవడం కేవలం బిఆర్‌ఎస్‌లో మాత్రమే కనిపిస్తోంది. ఈ క్రమంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అత్యధిక సర్పంచ్ సీట్లు గెలిస్తేనే రాజకీయంగా నిలుస్తుంది. అందుకే మైండ్ గేమ్ ఆడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్‌ఎస్ చతికిల బడటం, కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగు తున్న విచారణ, ఎమ్మెల్సీ కవిత మద్యం కుంభకోణంలో జ్కెలుకు వెళ్లడం, ముఖ్యనేతలు అనుకున్న వారంతా కారు దిగి హస్తం పార్టీలోకో, బీజేపీ గూటికో చేరడం వంటి పరిణామాలతో గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దీంతో పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు కేటిఆర్ నిత్యం ఏదో ఓక విధంగా అబద్దాల ప్రచారం అందుకున్నారు. తమ పదేళ్లలో చేయలేని పనులను ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు.
తమ దోపిడీ రాజ్యాన్ని ప్రజలు మరచి పోయేందుకు డ్రామాలు ఆడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు సుప్రీంలో కేసు వేసి పోరాడుతున్నారు. పార్టీ మారడం న్కెతికంగా తప్పే. సుప్రీం దీనిని గుర్తించి తీర్పును ఇస్తే వచ్చే తరాలకు ఇది..ఓ గుణపాఠం కానుంది. ఇదంతా రానున్న కొద్ది రోజుల్లో తేలుతుందా అన్నది చూడాలి. ఇకపోతే అసెంబ్లీ సమావేశాలకు ఇక్కడ కెసిఆర్, అక్కడ జగన్ హాజరు కావడం లేదు. ఇలా హాజరుకాని వారిని ఎమ్మెల్యేలగా ఎందుకు పరిగణించాలో కూడా చట్టంలో చెప్పలేదు. అందువల్ల దీనిపైనా చర్చ చేయాల్సి ఉంది. అసెంబ్లీకి ఎందుకు రారో చెప్పడం లేదు. కెసిఆర్, జగన్ అసెంబ్లీ సమావేశాల్లో కీలకంగా వ్యవహరిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేవిరీ జరగలేదు. అసెంబ్లీ ద్వారా ప్రజల్లో ఉండేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు.
త్వరలోనే పెద్ద బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్‌ను కడిగి పారేస్తానని అంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు బిఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. గులాబీ పార్టీని నిలుపుకునేందుకు మాజీ సీఎం ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతారని అనుకుంటున్నారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని బిజపి, బిఆర్‌ఎస్‌లు ప్రచారం చేస్తున్నా అది పెద్దగా ప్రజలు పట్టించుకునే స్థాయిలో లేదు. స్థానిక ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని కాంగ్రెస్ జోస్యం చెబుతోంది. బీఆర్‌ఎస్ దుకాణం బంద్ అవుతుందని, దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కారు దిగడం ఖాయమని ప్రచారం సాగుతోంది. బీఆర్‌ఎస్ లో నలుగురు మాత్రమే ఉంటారని, మిగతా వారంతా బయటకు రావడం ఖాయమని గులాబీ నేతలను మానసికంగా కృంగదీసేలా మంత్రులు తమ వ్యాఖ్యలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. అలాగే స్థానిక ఎన్నికల్లో బలాబలాలు ఎలా ఉంటాయన్నది చూడాలి మరి!
– వడ్డె మారన్న
సీనియర్‌జర్నలిస్ట్9000345368