ప్రజాస్వామ్యాన్ని పరిహసించారు

– రీకౌంట్‌ కోరితే బీజేపీ మద్దుతుదారులపై దాష్టీకమా?
` అదే బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి బహిరంగంగా రక్షణా..
– పైడిపల్లెలో ప‌రిణామాల‌పై బీజేపీ చీఫ్‌ ఆగ్ర‌హం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: వెల్గటూరు మండలం పైడిపల్లె గ్రామంలో పంచాయతీ ఎన్నికల మూడో విడత ఓట్ల లెక్కింపు సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కలవరపెట్టే ఇలాంటి సంఘటనలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. పారదర్శకంగా సాగాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియ తీవ్రమైన అక్రమాలు, పాలనా వైఫల్యం కారణంగా అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో బ్యాలెట్‌కు చెందిన ఓట్లు లెక్కించలేదని, తమ అభ్యర్థి కేవలం 17 ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు చూపారని బీజేపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్‌ అభ్యర్థి జక్కుల మమత శేఖర్‌ మద్దతుదారులు గుర్తించారన్నారు. ఈ పరిస్థితుల్లో వారు రీకౌంటింగ్‌ కోరడం న్యాయసమ్మతమేనన్నారు. ప్రజాస్వామ్య పవిత్రతను కాపాడటానికి ఇది అత్యవసరమని, కానీ ఎన్నికల అధికారులు సరైన పరిష్కారం చూపకపోవడంతో పరిస్థితి అదుపు తప్పిందని వివరించారు. రీకౌంట్‌ కోరుతూ లెక్కింపు కేంద్రానికి శాంతియుతంగా వచ్చిన బీజేపీ మద్దతుదారులపై పోలీసులు లాఠీచార్జి జరపడమేగాక గాలిలోకి కాల్పులు జరపడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని తెలిపారు. ఈ క్రమంల్లో బీఆర్‌ఎస్‌ మద్దతున్న సర్పంచ్‌ అభ్యర్థి గంగుల నాగేశ్‌కు ప్రభుత్వం బహిరంగ భద్రత కల్పించగా, లెక్కింపులో తప్పిదాలపై ప్రశ్నించిన వారిపై అణచివేతకు పాల్పడడం అన్యాయమని ఆయన అన్నారు. ఇది కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే జరిగిందని విమర్శించారు. తెలంగాణను అధ:పాతాళానికి నెడుతూ ప్రజాస్వరాన్ని అణచివేసేలా ఈ అపవిత్ర కూటమి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఓట్లను వెంటనే రీకౌంట్‌ చేయాలని, పూర్తి పారదర్శకత పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. అలాగే లెక్కింపులో జరిగిన తప్పిదాలు, అక్రమాలు, ప్రజలపై పోలీసుల బలప్రయోగంపై నిష్పక్షపాత విచారణ జరపాలని కోరుతున్నామన్నారు. కుట్రలు, బెదిరింపులు, రాష్ట్ర యంత్రాంగం దుర్వినియోగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని రామచందర్‌రావు దుయ్యబట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page