వాడీవేడి చర్చ అనంతరం సభ తీర్మానం
ధరణిపై సిబిఐ విచారణకు బిజెపి డిమాండ్
భూమి కోసం ఎన్నో పోరాటాలు సాగాయి
ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది భూమే..
ధరణితో విదేశీ కంపెనీల చేతికి భూముల వివరాలు
శాసన సభలో సిఎం రేవంత్ రెడ్డి
బిఆర్‌ఎస్ సభ్యుల తీరుపై ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్20 : తెలంగాణ అసెంబ్లీలో భూ భారతి బిల్లు – 2024 ఆమోదం పొందింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు. భూ భారతి బిల్లు ప్రవేశపెట్టే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. బిల్లు ఆమోదం పొందుతుండటంతో ఆనంద భాష్పాలు వొస్తున్నాయన్నారు. సభలో భూ భారతి బిల్లు ప్రవేశ పెట్టిన మంత్రి.. బిల్లును పాస్ చేయాల్సిందిగా స్పీకర్ ను కోరారు. సభ్యులు ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం అసెంబ్లీని స్పీకర్ శనివారానికి వాయిదా వేశారు. భూ భారతిపై చర్చ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని అన్నారు. తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి. భూమిని కాపాడుకునే ప్రయత్నంలో దొడ్డి కొమరయ్య వంటి వారు ప్రాణాలు కోల్పోయారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది భూ పోరాటాలు చేశారు. పేదల భూములు కాపాడేందుకు పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారన్నారు.
బిల్లుపై సభలో వాడీవేడిగా చర్చ
భూభారతిపై వాడీవేడిగా చర్చ సాగింది. బిల్లుపై విపక్ష బిఆర్‌ఎస్ సభ్యులు చర్చించకుండా ఆందోళనకు దిగారు. బిల్లుపై చర్చించాలని, ఇది రైతులకు సంబంధించినదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పదేపదే సూచించారు. భూముల అన్యాక్రాంతం, లక్షల కోట్ల అవినీతి జరిందని డిప్యూటి సిఎం భట్టి, మంత్రి పొంగులేటి ప్రకటించినా ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశించలేదని బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సహనం కోల్పోయి స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల దారుణంగా వ్యవహరించారని అన్నారు. అమర్యాదగా ప్రవర్తించి సభాపతిపైనే పేపర్లు విసిరారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పేరుతో వాళ్ల అరాచం, దుర్మార్గం చెప్పలేని స్థాయికి చేరిందని, అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచార సేకరణ నేరం. గాదె శ్రీధర్‌రావు ద్వారా విదేశాలకు సమాచారం పంపించారు. వాళ్లు ఒక్క క్లిక్ కొడితే సమాచారం మొత్తం నాశనమవుతుంది. మన దగ్గర ఉన్న సర్వర్లూ క్రాష్ అవుతాయి. అందుకే విచారణకు ఇవ్వడంపై ఇంతకాలం ఆలోచన చేశాం. విదేశాలకు వెళ్లి వివరాలు ఇవ్వాలని కోరినా సహకరించలేదన్నారు.